Unknown
అర్జునుడు పేడి రూపమున విరటుఁ గొల్వ వచ్చుట
అర్జునుడు కొలువులోనికి రావటం ఎలావుందంటే
ఆ.
మంచుమఱుఁగువడినమార్తాండుఁడునుబోలె, నీఱు గవిసియున్న నిప్పుఁబోలె
వేషధారి యైన విష్ణుండుఁబోలె న, వ్విరటుకొలువు చేర నరుఁడు వచ్చె. 228
క.
కనుదెంచి పేడితనమును, వనితారూపంబు నమర వాసవసుతుఁ డా
మనుజాధీశునకు సభా, జనులకుఁ దనుఁ జూపి మందసంచారమునన్. 229
క.
నిన్నుఁ గొలువంగ వచ్చితిఁ, గన్నియలకు నాడ గఱపఁ గా నోపుదు వి
ద్వన్నుత మన్నామంబు బృ,హన్నల యేఁ బేడి ననుడు నత డిట్లనియెన్. 233
ఉ.
ఆయత బాహులున్ వెడఁద యైనసమున్నతవక్షమున్ సరో
జాయితలోచనంబులుఁ బ్రసన్నముఖంబు నుదాత్తరేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్ర మ
శ్రీయును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే. 234
కాయజున్ = మన్మధుని, కౌశికున్ = ఇంద్రుని
వ.
అనిన విని యమ్మహీపతికి బృహన్నల యి ట్లనియె.237
ఉ.
ఆఁడుఁదనంబు నిక్కమున కారసి చూచిన లేదు పుంస్త్వముం
బోఁడిమి దప్పి యున్నది నపుంసక జన్మ మవశ్యభోగ్య మై
వాఁడిమి గల్గుశాపమున వచ్చెఁ బురాకృతకర్మభావ్య మె
వ్వాఁడును నేర్చునే తొలఁగ వైవఁగ నోర్వక పోవ వచ్చునే. 238
వ.
కావున.
తే.
ఒండు పనులకు సెలవు లే కునికిఁ జేసి, యభ్యసించితి శైశవ మాది గాఁగ
దండలాసకవిధమును గుండలియును, బ్రేంఖణంబు తెఱంగును బ్రేరణియును. 240
సెలవు = ఉపయోగము, బ్రేరణి = కుండమీఁది నాట్యము

విరాటరాజప్పుడు తన కూతురు ఉత్తరను పిలిపించి ఆమెకు బృహన్నలను గురువుగా పరిచయం చేసి బృహన్నలకామెను అప్పగిస్తూ ఆమెతో ఇలా అంటాడు.
ఆ.
ఎల్ల చుట్టములును దల్లియుఁ దోడును, జెలియుఁ బరిజనంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్కకొఱఁతయు లే దిందుఁ, జేరి బ్రదుకు బుద్ధిగౌరవమున. 253