Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-2
చ.
అమల సువర్ణ శృంగఖుర మై కపిలం బగుగోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసినఁదత్ఫలంబు త
థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణ ప్రవణంబుకావునన్.15

స్వచ్ఛమైన బంగారపు కొమ్ములను గిట్టలను కలిగి, కపిలవర్ణము గల నూరు
గోవులను ఉత్తములైన బహువేదములలో పరిశ్రమ చేసిన విప్రులకు దానము
చేసిన వలన కలిగే ఫలం తప్పనిసరిగా సమకూరుతుంది భారత గాథను
విన్నటువంటి వారికి. నా చిత్తము ఎల్లప్పుడూ భారతకథను వినుటయందు ఆసక్తి
కలిగి ఉంటుంది.
క.
బహుభాషల బహువిధముల, బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహులగువారికి నెప్పుడు, బహుయాగంబులఫలంబు పరమార్థమగున్.17

వ. అని యానతిచ్చిన విని యక్కవివరుండిట్లనియె.18
చ.
అమలినతార కాసముదయంబుల నెన్నను సర్వ వేదశా
స్త్రంబుల యశేషసారము ముదంబునఁ బొందను బుద్ధి బాహువి
క్రమమున దుర్గమార్థజలగౌరవభారత భారతీసము
ద్రముఁ దఱియంగ నీఁదను విధాతృన కైనను నేరఁ బోలునే.19

స్వచ్ఛమైన నక్షత్రాలను లెక్కించను, అన్నివేదాలసారాన్ని సంతోషముతో
పొందుటను, భారత భారతీ సముద్రాన్ని దాటేలా యీదగలగటం --యివి
విధాతకైనా సాధ్యం కానివి.
క.
ఏయది హృద్య మపూర్వం, బేయది యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బై యుండు నఘనిబర్హణ, మేయది యక్కథయ వినఁగ నిష్టము మాకున్.29

రోమహర్షుణుని పుత్రుడైన రౌమహర్షణి, శౌనకాది మునులతో, ఏకథను నా వలన
వినగోరుతున్నారని అడిగినప్పుడు వారంతా పై విధంగా పలికారట.
సీ.
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రం బని యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతి శాస్త్రంబని కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు లక్ష్యసంగ్రహమని యైతిహాసికు లితిహాస మనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్ఛయం బని మహిఁ గొనియాడుచుండ
ఆ.
వివిధ వేదతత్త్వవిదుఁడు వేదవ్యాసుఁ, డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీన మై, పరఁగుచుండఁ జేసె భారతంబు.31

ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం అంటారట. అధ్యాత్మవిదులు వేదాంతం అంటారట.
నీతివిచక్షణులు నీతి శాస్త్రం అంటారట. కవివృషభులు మహాకావ్యం అంటారట.
లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహం అంటారట.ఐతిహాసికులు ఇతిహాసమంటారట.
పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయం అంటారట. ఈ విధంగా ఈ
భూమి మీద కొనియాడుచున్న మహాభారతాన్ని
వివిధ వేదతత్త్వవిదుఁడు,
ఆదిముని, పరాశరమహర్షి కుమారుడు ఐన వేదవ్యాసుడు విష్ణుసన్నిభుడు
విశ్వానికంతా శుభం కలగాలని రచన చేసాడు.
సీ.
ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు నర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మప్రాప్తియు వినయార్థులకు మహావినయమతియుఁ
బుత్త్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థుల కిష్టసంపదలును
గావించు నెప్పుడు భావించు వినుచుండువారల కిమ్మహాభారతంబు.
ఆ.
భక్తియుక్తు లైన భాగవతులకు శ్రీ,వల్లభుండు భక్తవత్సలుండు
భవభయంబులెల్లఁ బాపి యిష్టార్థసం,సిద్ధిఁ గరుణతోడఁ జేయునట్లు. 33

ఆయువు కోరేవారికి దీర్ఘాయువు, ధనముకోరేవారికి ఎక్కువ ధనసంపద,
ధర్మాన్ని కోరేవారికి నిత్యధర్మప్రాప్తి, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయసంపద,
పుత్రసంతానం కోరేవారికి బహుపుత్ర సమృద్ధి, సంపదలు కోరేవారికిష్టసంపదలు,
కావిస్తుంది ఎప్పుడూ భారతాన్ని భావించి వినేవారికి. అదెలాగంటే భక్తవత్సలుడైన
శ్రీవల్లభుడు భక్తియుక్తులైన భాగవతులకు భవభయాలన్నిటిని పోగొట్టి కరుణతో
యిష్టార్థ సంసిద్ధిని కలిగించినట్లుగా నన్నమాట.


Unknown
స్త్రీ పర్వము-ప్రథమాశ్వాసము-1
చచ్చిన వీరులకు ఉదకప్రదానాదులు చేయుట
తరల.
ధరణినాయక యట్లు పుత్రశతంబు వైరికులంబు చే
నిరవశేషత నొందుటన్ మహనీయగౌరవహీనతం
బొరసి కొమ్మలు తున్మ మ్రోడ్పడుభూరుహంబును బోలె ని
ర్భరవిపద్వికలాత్ముఁడై ధృతరాష్ట్రుఁ డుల్లము వెమ్మగన్.4

అలా నూర్గురు పుత్రులు వైరులచే చచ్చుటచే కొమ్మలన్నీ తుంచగా మోడయి నిలచిన భూరుహమును పోలి ఉన్నాడట ఆ ధృతరాష్ట్రుడు.
వ.చింతాభరంబున నూరక యున్నం జూచి సంజయుం డతని కిట్లనియె.5
వ.
పదునెనిమిదియక్షౌహణిలు సమసెఁ బితామహపితృభాతృపుత్రపౌత్రసఖిసుహృత్సహాయులుం దెగి రందు వగపునకుం బని గానివారలు కలరే యేది కొలందిగా నగ చె దందఱకు నగ్ని కార్యంబు నిర్వర్తింపను దగినవారలకుం దిలోదకప్రదానంబులు చేయను వలయుఁ బొలిగలనికి(స్మశానము) వేంచేయుము.7

Unknown
సౌప్తిక పర్వము-ప్రథమాశ్వాసము-1
అశ్వత్థామ ఉపపాండవులను చంపుట
తే.
సంజయునిచేత గురుసుతోత్సాహ మట్లు
వినిన ధృతరాష్ట్రుఁ డిట్లను వీరవర్యుఁ
డనఁగఁ జాలునశ్వత్థామయును సహాయ
రథికులును విక్రమించినక్రమము చెపుమ.3
సంజయునిచేత అశ్వత్థామ ఉత్సాహాన్ని వినిన ధృతరాష్ట్రుడు -వీరవరుడైన అశ్వత్థామ, తక్కిన సహాయ రథికులు ఏవిధంగా విక్రమించారో చెప్పమంటాడు.
Unknown
శల్య పర్వము-ప్రథమాశ్వాసము-1
సంజయుడు ధృతరాష్ట్రునికి దుర్యోధనాదుల మరణము తెలుపుట
సీ.
జననాథ శల్యుండు సమసె సౌబలుడు గీటడఁగె నులూకుండు మడిసె సకల
సంశప్తకులుఁగడచనిరి కాంభోజశతానీకములుఁ దేగటాఱె యవన
పార్వతీయమ్లేచ్ఛ బలములుఁ ద్రుంగె నల్ దిక్కుల మన్నీలుఁ దక్కుఁగలుగు
నరనాయకులును జచ్చిరి కుమారులు కలయందఱుఁ దెగిరి కర్ణాత్మజులును
తే.
బొలిసి రయ్య వృకోదరుపలుకుతప్ప,కుండఁ దద్గదాదండ ప్ర చండనిహతి
రెండుతొడలును విఱిగి ధరిత్రిఁ బెలుచఁ,గూలి రూపఱి రారాజు ధూళి బ్రుంగె.9
ఓ రాజా! శల్యుడు, సౌబలుడు,ఉలూకుడు, అందరు సంశప్తకులు, కాంభోజశతానీకములు,
యవన పార్వతీయమ్లేచ్ఛబలములు, అంతేకాకుండా నాలుగు దిక్కులనుండి వచ్చిన
మన్నీలుడు మొదలుగా నరనాయకులందఱూ, కుమారకులు, కర్ణుని కొడుకులందరూ--
అందరూ చచ్చిరి. భీముడు చేసిన ప్రతిజ్ఞానుసారము ఆతని గదాదండ ప్రచండ నిహతి
రెండు తొడలును విఱిగి నేలకూలి రారాజు రూపుచెడి మన్నులో కలిసిపోయాడు.