Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౪

భీష్ముఁడు కురు వంశమును నిలుపు ఉపాయం చెప్పుట
ఉ.
లాలిత రూప యౌవనవిలాస విభాసిను లైన యంబికాం
బాలికలన్ వివాహమయి భారతవంశకరుండు గామలీ

లాలలితా సుభోగ రసలాలసుఁ డై నిజరాజ్యభార చిం

తాలసుఁ డయ్యెఁ గామికి నయంబున నొండు దలంపఁ బోలునే.
౨౧౫
చింతాలసుడు=విచారించుటయందు సోమరి

విచిత్రవీర్యుడు కామలాలసు డై భార్యలతోడిదే లోకంగా ఉంటూ నిజరాజ్య పాలనను నిర్లక్ష్యం చేస్తాడు. కాము డైన వానికి నయముతో ఇంకోవిషయం యేమీ పట్టదు గదా.
సీ.
అమల సుధారమ్య హర్మ్యతలంబుల నవకుసుమామోద నందనములఁ
గృతకాద్రి కందర క్రీడాగృహాంగణ వివిద రత్నోపల వేదికలను
గలహంస కలనాద కమనీయ కమలినీ దీర్ఘి కాసైకత తీరములను
రమియించుచును గామరాగాధికాసక్తిఁ జేసి శోషించి విచిత్రవీర్యుఁ
ఆ.
డమరపురికిఁ జనిన నతనికిఁ బరలోక, విధుల శాస్త్రదృష్టి వెలయఁ జేసె
నాపగా తనూజుఁ డఖిల బాంధవులయు, బ్రాహ్మణులయుఁ దోడ భానునిభుఁడు. ౨౧౭

మేడలలోనూ, నందనవనాల్లోనూ, క్రీడా గృహాలలోనూ, రత్నవేదికలమీదనూ, నదీతీరాల్లోనూ, రమిస్తూ కామరాగాధికా సక్తితో శోషించి పోయి విచిత్రవీర్యుఁడు పిల్లలు పుట్టకుండానే చనిపోతాడు.(అతి సర్వత్ర వర్జయేత్ అంటారు అందుకనే). భీష్ముఁడు అతనికి శ్రాద్ధ కర్మలను పూర్తి చేస్తాడు.తరువాత కొంతకాలానికి ఒకనాడు సత్యవతి భీష్ముని పిలిచి తనను రాజ్యాభిషిక్తుడువు గా కమ్మని పెళ్ళి చేసుకుని వంశాన్ని నిలపమని కోరుతుంది. దానికి భీష్ముడు ఒప్పుకోకుండా ఇలా అంటాడు.
క.
విని భీష్ముఁ డనియె మీ కిట్లని యానతి యీయఁదగునె యమ్మెయి నాప
ల్కిన పల్కును మఱి నా తా, ల్చిన వ్రతమును జెఱుప నంత చిఱుతనె చెపుమా. ౨౨౩
క.
హిమకరుఁడు శైత్యమును న,ర్యముఁడు మహాతేజమును హుతాశనుఁ డుష్ణ
త్వము విడిచిరేని గుర్వ,ర్థము నా చేకొనిన స ద్వ్రతంబు విడుతునే. ౨౨౪

నీకిలా చెప్పటం తగునా? నేను నా పలికిన పలుకులు, నా వ్రతము జెఱుపుకోడానికి చిన్నపిల్లాడినేం కాదు గదా.
అంతేకాదు, చంద్రుడు తన చల్లదనాన్ని విడిచి పెడితే పెట్టుగాక, సూర్యుఁడు తన తేజాన్నీ, అగ్ని తన వేడిమినీ విడిచి పెడితే విడిచి పెట్టు గాక. కాని నేను నా వ్రతాన్ని మాత్రం విడిచి పెట్టను. అంటాడు భీష్ముఁడు.
వ.
పృథివ్యాది మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్లు విడువ వట్ల యేనును గురుకార్యంబున మీ శుల్కార్థంబుగా సర్వజన సమక్షంబున నా చేసిన సమయస్థితి విడువ నది యట్లుండె మీ యానతిచ్చినట్లు నా యెఱుంగని ధర్మువులు లేవు శంతను సంతానంబు శాశ్వతంబగునట్లుగా క్షత్త్రధర్మంబు సెప్పెద నా చెప్పిన దాని ధర్మార్థవిదులయి లోకయాత్రానిపుణు లయిన పురోహిత ప్రముఖ నిఖిల బ్రాహ్మణ వరులతో విచారించి చేయునది యని భీష్ముం డందఱు విన నిట్లనియె. ౨౨౫
చ.
పితృవధజాతకోపపరిపీడితుఁ డై జమదగ్ని సూనుఁడు
ద్ధతబలు హైహయున్ సమరదర్పితుఁ జంపి యశేషధారుణీ
పతులను జంపె గర్భగత బాలురు నాదిగ నట్టిచోటఁ ద
త్సతులకుఁ దొల్లి ధర్మ విధి సంతతి నిల్పరె బూసురోత్తముల్. ౨౨౬
హైహయున్=కార్తవీర్యార్జునుని
తండ్రిని చంపిన కోపముతో జమదగ్ని కుమారు డైన పరశురాముడు ముయ్యేడుమార్లు ప్రపంచాన్నంతా చుట్టి చుట్టి క్షత్త్రియు డనేవా డెవడూ మిగలకుండా గర్భంలో నున్న శిశువులతో సహా చంపివేస్తాడు. అటువంటిచోట ఆ క్షత్త్రియ సతులకు పూర్వము ధర్మ మార్గంలో బ్రాహ్మణులు సంతతిని నిలిపినారు కదా. ఆ మార్గాన్నే మనమూ అనుసరించ వచ్చు అన్నట్లుగా అంటాడు భీష్ముఁడు.