Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౪
యయాతి యదుప్రముఖులకు శాపం బిచ్చుట
క.
తనయుండు తల్లిదండ్రులు, పనిచినపని సేయఁడేని పలు కెదలోఁ జే
కొనఁడేని వాఁడు తనయుం, డనఁబడునే పితృధనమున కర్హుం డగునే.౧౯౯

వ.
ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి కొడుకుల నెల్ల రావించి నాకు విషయసుఖతృప్తి లే కున్నయది గావున మీ యందొక్కరుండు నా ముదిమి గొని తన జవ్వనంబు నా కిచ్చునది యనిన విని యదుతుర్వసుద్రుహ్వ్యానులు దండ్రి కిట్లనిరి.
ఆ.
తగిలి జరయు రుజయు దైవవశంబున, నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యా రెంటిఁ జే, కొందురయ్య యెట్టికుమతులైన.౧౯౩
క.
నరలు గల కాము నైనను, దరుణులు రోయుదురు డాయ ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా, పరిభూతి నభీష్టభోగబాహ్యుఁడ కాఁడే.౧౯౪
నరలు=తెల్లనివెండ్రుకలు

ముసలితనము, రోగము అనేవి దైవవశాత్తు కలిగితే వాటిని అనుభవించాల్సిందే కాని ఎరిగి ఎరిగి పూనుకొని మరీ ఆ రెండింటినీ ఎంత బుద్ధిహీనులైనా కోరి భరించ సిద్ధపడతారా?
తెల్లవెండ్రుకలు కలిగుంటే వాడు సాక్షాత్తు ఆ కాముడైనా సరే తరుణులు అసహ్యించుకుంటారు. ఎంత డబ్బున్న వాడైనా భరింపరాని ముసలితనాన్ని కలిగినవాడు కోరిన కోరికలకు వంచితుడు కాకతప్పదు గదా.
వ.
అని యొడంబడ కున్న నలిగి యయాతి యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాఁ దుర్వసు వంశంబునవారు ధర్మాధర్మ వివేకశూన్యు లై సంకీర్ణ వర్ణ కిరాతులకు రాజులుగా ద్రహ్యువంశంబు వారు డుపప్ల వసంతార్యం బైన దేశంబునకు రాజులుగా జరాదూషకుండగుట ననువంశంబునవారు ముదియునంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగువారునుంగా శాపంబిచ్చి
యానలువురకుం గొండొకవాని శర్మిష్ఠా పుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన వాడు తండ్రి కోరినయట్ల చేసిన నవయౌవనుం డై యయాతి యభిమతసుఖంబులు సహస్ర వర్షంబు లనుభవించి తృప్తుం డై పూరుజవ్వనంబు వానికి నిచ్చి తన జరాభారంబుఁ దాన తాల్చి నిజాజ్ఞా విధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్త్రాది వర్ణ ముఖ్యుల నెల్ల రావించి మంత్రి పురోహితసామంతానంత పౌరజనసమక్షంబున సకల క్షోణీచక్ర సామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుం జేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి.౧౯౫
ఉడుపప్లవ సంతార్యంబు=పడవులు తెప్పలచే దాటదగినది
పంచత్వంబునకు=మరణమునకు
మ.
అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ నీయగ్ర సం
భవుఁ డత్యున్నత శక్తియుక్తుఁడు మహీభార ప్రగల్భుండు భా
ర్గవ దౌహిత్రుఁ డు పాత్రుఁ డీ యదుఁడు లోక ఖ్యాతుఁ డుండంగ నీ
భువనేశత్వభరంబుఁ బూన్పఁ దగునే పూరున్ జఘన్యాత్మజున్.౧౯౬
జఘన్యాత్మజున్=నిందితసుతుని
పెద్దకొడుకు భార్గవుని మనుమడు ఉండగా వానిని కాదని నిందిత యైన శర్మిష్ఠ చివరికొడుకుకు రాజ్యం ఇవ్వడం ఎలా సబబు అని ప్రజలంతా అడిగారు రాజుగారిని.
వ.
అనిన వారల క య్యయాతి యి ట్లనియె.౧౯౭
క.
యదుఁ డగ్ర తనూజుఁడు నా, హృదయసముద్భవుఁడు వాఁ డయిన మద్వచనం
బిది యేటిది యని కడు దు,ర్మదుఁ డై చేయక కృతావమానుండయ్యెన్.౧౯౮

పెద్దకొడుకై ఉండీ దుర్మదు డై తండ్రి యాజ్ఞను పాలించకపోవటం చేత అవమానం పాలవ్వాల్సిన వాడవ్వాల్సి వచ్చింది అంటాడు.
అలా అంటూ ఈ విధంగా పైన చెప్పినట్లుగా అంటాడు.
.
తనయుండు తల్లిదండ్రులు, పనిచినపని సేయఁడేని పలు కెదలోఁ జే
కొనఁడేని వాఁడు తనయుం, డనఁబడునే పితృధనమున కర్హుం డగునే.౧౯౯
క.
పూరుఁడు గొండొక యయ్యును, భూరిగుణ జ్యేష్ఠుఁడును సుపుత్త్రుఁ డు నవనీ
భార సహిష్ణుఁడు నాతఁడ, కోరిన కార్యంబుఁ దీర్చి కుశలుండగుటన్.౨౦౦
గొండొక=చిన్నవాడు
వ.
నా జరాభారంబుఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు శుక్రు వచనంబు నిట్టిద యని యయాతి ప్రకృత జనులనొడంబఱిచి పూరును రాజుగా చేసెను.