Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-12
కృపాచార్యుల జన్మ వృత్తాంతము
కౌరవపాండవులు కృపాచార్యుల వద్ద, ద్రోణాచార్యుల వద్ద విలువిద్యనభ్యసిస్తున్నారని వైశంపాయనుడు చెప్పినది విని జనమేజయుడు వారిద్దరి వృత్తాంతాన్ని చెప్పమని వైశంపాయనుడిని అడుగుతాడు.
సీ.
వినవయ్య గౌతముం డనఁ బ్రసిద్ధుం డా నమునికి శరద్వంతుఁ డనుమహాత్ముఁ
డురుతర తేజుఁ డై శరసమూహంబుతో నుదయించి వేదముల్ చదువ నొల్ల
కతి ఘోరతపమున నుతభూసురోత్తముల్ వేదముల్ చదువున ట్లాదరమున
సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ బడసి మహానిష్ఠఁ గడఁగి తపము
ఆ.
సేయు చున్న దివిజనాయకుఁ డతిభీతి, నెఱిఁగి వానితపముఁ జెఱుపఁ బనిచె
జలజనయనఁ దరుణి జానపది యనెడు, దాని నదియు వచ్చె వానికడకు. 185

గౌతముడనే మహామునికి శరద్వంతు డనే కుమారుడు శరసమూహముతో సహా జన్మించి వేదములు చదవటానికి ఇష్టపడక ధనుర్వేదాన్ని బాగుగా నేర్చుకొని గొప్ప నిష్ఠతో తపస్సు చేయసాగాడు. ఇంద్రుడు ఆ తపస్సు చెడగొట్టమని జానపది అనే ఆమెను నియోగించగా ఆమె ఆపని నిమిత్తం అక్కడికి వచ్చింది. ఇంద్రునికి అందరి తపస్సులూ పాడుచేయటమే పని కాబోలు.
క.
అమ్ముదితఁ జూచి కాముశ, రమ్ములచే విద్ధుఁ డై శరద్వంతుఁడు చి
త్తమ్మలర మదనరాగర, సమ్మునఁ దన్నెఱుఁగ కుండెఁ జంచలతనుఁ డై. 186

ఆమెను చూచి శరద్వంతుడు కాముని శరములతో బాధింపబడిన వాడై మదనపరవశు డయ్యాడు.
క.
ఆతరుణి కటాక్షేక్షణ, పాతము గౌతమున కపుడు పటుబాణధనుః
పాతముతోడన రేతః, పాతము గావించె రాగపరవశుఁ డగుటన్. 187

ఆమె క్రీఁ గంటి చూపులు పడుట గౌతమునకు అపుడు పటుబాణ ధనుఃపాతముతో పాటుగా రేతఃపాతము(వీర్యము పడుట) అయినదట.
వ.
దాని నెఱింగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండు చోటం దపంబు సేయు చుండె. అవ్వీర్యం బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన నందొక కొడుకునుం గూఁతురుం బుట్టి రంత శంతనుండు మృగయావినోదార్థం బరిగి వానిసేనాగ్రచరుం డాశరచాపకృష్ణాజినంబులుం జూచి యివి యెయ్యేనియు నొక్క ధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణు నపత్యం బగు నని శంతనునకుం జూపిన శంతనుండును వారలఁ జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచటం జేసి యయ్యిరువురుఁ గృపుడును గృపియు ననం బెరుగు చున్నంత. 188
క.
చనుదెంచి శరద్వంతుం, డనవద్యుఁడు తనయపత్య మని వారిని శం
తనున కెఱింగిచి కృపు న, త్యనుపమ నుపనీతుఁ జేసె నధిక ప్రీతిన్. 189

శా.
వేదంబుల్ చదివించె భూసురులతో విఖ్యాతి గా నాత్మ సం
వేదిం జేసెఁ జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్త్రవి
ద్యాదాక్షిణ్యముతోడఁ దాన గఱపెం దద్వృత్తముల్ సూచి సం
వాదుల్ గాఁ దననందనుం గృపు శరధ్వంతుండు దాంతాత్ముఁ డై. 190

ఇక్కడ కొంచెం వివరణ తెలియాల్సినది ఉంది. గౌతముని రేతఃపతనము వలన కృపాచార్యుడు జన్మించాడని ముందు చెప్పబడింది. తరువాత శరద్వంతుడు కృపాచార్యుడు తన కొడుకు అని చెప్పినట్లుగా ఉంది. పెద్దలెవరైనా ఈ సందేహనివారణ చేస్తే కృతజ్ఞుడిగా ఉంటాను.
వ.
అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి వానితోడఁ దన మనుమల నందఱ విలువిద్య గఱవం బంచిన.