Unknown
సభా పర్వము-ప్రథమాశాస్వము-౨
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట
భారతంలో చాలా చోట్ల వివిధములైన ధర్మాలను చెప్పటం జరిగింది.
ఈ సందర్భంలో నారదుడు ధర్మరాజుని అడిగినట్లు పరోక్షంగా వివిధములైన
రాజధర్మాలను ఉపదేశించటం జరిగింది.

సీ.
మీ వంశమున నరదేవోత్తముల దైన సద్ధర్మమార్గంబు సలుపు దయ్య
ధర్మ విదుండ వై ధర్మార్థకామంబు లొండొంటి బాధింపకుండ నుచిత
కాల విభక్తముల్ గాఁ జేసి సేవింతె ధర్మవునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపర రాత్రమ్ములం దెప్పుడుఁ జింతింతె నిజబుద్ధిఁ జేయఁ దగిన
ఆ.
రాజకృత్యములఁ దిరంబుగా నిఖిల ని, యోగవృత్తులందు యోగ్యు లయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె, నీవు వారి దయిమ నే ర్పెఱింగి.26

ఓ ధర్మరాజా! మీ వంశమున రాజశ్రేష్ఠులదైన సద్ధర్మమార్గాన్ని సలుపుతున్నావా!
ధర్మవిదుడవై ధర్మార్థకామాలు ఒకదానితో నొకటి బాధింపబడకుండగా కాల
విభజనం చేసి సేవిస్తున్నావా! ధర్మమునందే మనస్సును నిలిపి రాత్రి నాల్గవ
జాములో చింతన చేస్తున్నావా! స్వబుద్ధితో చేయదగిన రాజకార్యాలు ఎవరు
ఏయే పనులు చేయసమర్థులో వారి వారి నాయా కార్యాలలో సరిగా గౌరవముతో
చేయటానికి నియమించావా!
(ఇంకావుంది)
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-5
ఉ.
ఇమ్ముగ సర్వలోక జనులెవ్వనియేనిముఖమృతాంశుబిం
బమ్మున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం
ధ్ర మ్మనునంజలిం దవిలి త్రావుదు రట్టిమునీంద్రలోకవం
ద్యు మ్ముని నప్పరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.76

ప్రసిద్ధిగా సర్వలోక జనులు ఎవ్వని చంద్రబింబమువంటి ముఖాన్నుండి
వెలువడే భారతవాగమృతమును చెవి రంధ్రమనే అంజలిని పట్టి త్రాగుతారో
అట్టి మునీంద్రుడు, లోకముచే పొగడబడ్డ- పరాశరసుతుడైన వ్యాసునికి
మిక్కిలి భక్తితో ప్రణమిల్లి--రోమహర్షణుడు భారతగాథను ప్రారంభిస్తున్నాడు.

అక్షౌహిణీ సంఖ్యావివరము.
సీ.
వరరథ మొక్కండు వారణ మొక్కండుతురగముల్మూఁడు కాల్వురును నేవు
రనుసంఖ్య గలయదియగుఁ బత్తి యదిత్రిగుణంబైనసేనాముఖంబు దీని
త్రిగుణంబు గుల్మంబు దీనిముమ్మడుఁ గగుగణముతద్గణముత్రిగుణిత మైన
వాహినియగు దానివడిమూఁటగుణియింపఁ బృతన నాబరఁగుఁదత్పృతనమూఁట
ఆ.
గుణితమైనఁ జము వగున్ మఱి దానిము,మ్ముఁగనీకినీసమాఖ్య నొనరు
నదియుఁ బదిమడుంగులైన నక్షౌహిణి, యౌ నిరంతర ప్రమానుసంఖ్య.80

ఈ మధ్యనే ఓ బ్లాగరి అక్షౌహిణీ సంఖ్యను గురించి వారి బ్లాగులో వ్రాసారు.
ఒక రధము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు, ఐదుగురు భటులు - బత్తి
౩ బత్తిలు ఒక సేనాముఖము
౩ సేనాముఖములు ఒక గుల్మము
౩ గుల్మములు ఒక గణము
౩ గణములు ఒక వాహిని
౩ వాహినులు ఒక పృతన
౩ పృతనలు ఒక చమువు
౩ చమువులు ఒక అనీకినీ సమాఖ్య
౧౦ అనీకినీ సమాఖ్యలు ఒక అక్షౌహిణి.
అంటే ఒక అక్షౌహిణికి ౨౧౮౭౦ రథములు, ౨౧౮౭౦ ఏనుగులు, ౬౫౬౧౦ గుఱ్ఱములు,
౧౦౯౩౫౦ మంది వీరభటులు గలది. ఇటువంటి ౧౮ అక్షౌహిణులు మహాభారత యుద్ధంలో
పాల్గొన్నాయి.అంటే మొత్తం ౩,౯౩,౬౬౦ రథములు, ౩,౯౩,౬౬౦ ఏనుగులు,
౧౧,౮౦,౯౮౦ గుఱ్ఱాలు, ౧౯,౬౮,౩౦౦ వీరభటులూ ఈ యుద్ధంలో పాల్గొన్నారు.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-4
సీ.
ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక విహితావధాను లై వినుచు నుండు
వారికి విపులధర్మార్థారంభసంసిద్ధి యగుఁ బరమార్థంబ యశ్రమమున
వేదముల్ నాలుగు నాదిపురాణముల్ పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ
శాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్త్వంబులు నెఱిఁగినఫల మగు నెల్లప్రొద్దు
ఆ.
దానములను బహువిధక్రతుహుతజప, బ్రహ్మచర్యములను బడయఁబడిన
పుణ్యఫలము వడయఁ బోలు నశేషపా,పక్షయంబు నగుశుభంబు వెరుఁగు.71

ఈ మహాభారతాన్ని శ్రద్ధగా వినేవారికి అనేక ధర్మార్ధాలను ప్రారంభం చేసిన సిద్ధి
అవుతుంది.శ్రమలేకయె పరమార్థం సిద్ధిస్తుంది. నాలుగు వేదాలు, పద్ధెనిమిది
పురాణాలు, వానిలో చెప్పబడే ధర్మశాస్త్రములు, మోక్షశాస్త్ర తత్త్వములు
తెలుసుకొన్న ఫలం కలుగుతుంది .ఎల్లప్పుడూ దానములను, బహువిధమైన
క్రతువులను, జపము బ్రహ్మచర్యము వలనికలుగు పుణ్యఫలము కలుగుతుంది.
పాపాలు నశిస్తాయి. శుభాలు పెరుగుతాయి.
ఉ.
సాత్యవతేయవిష్ణుపదసంభవ మై విభుధేశ్వరాబ్ధిసం
గత్యుపశోభితం బయి జగద్విదితం బగుభారతీయభా
రత్యమరాపగౌఘము నిరంతర సంతతపుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.72

వ్యాసుఁడనెడి యాకాశమునుండి దేవేంద్రుడనెడి సముద్రమును కలసి
శోభనుపొందు జగద్విదితమగు భారతీయభారతి అనబడే దేవనదీ
ప్రవాహము నిరంతరము విన్నవారికి, కొనియాడిన వారికందరికీ
సంతతమైన పుణ్యసంపదలను అధికంగా అభివృద్ధి నొందిస్తుంది .


Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-3
మ.
అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై
సుమహా వర్గచతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్తమనానాగుణకీర్తనార్థఫల మై ద్వైపాయనోద్యానజా
తమహాభారతపారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్య మై.65

అమితమైన ఛిన్నకథలనే కొమ్మలతో ప్రకాశిస్తూ వేదార్థములతోడి
నిర్మలమైన నీడతో వివిధరకములైన మంచిగొప్పపుష్పవితతితో
శోభనొంది కృష్ణార్జునుల ఉత్తమ నానాగుణ కీర్తనల అర్థముయొక్క
ఫలమై ద్వైపాయనమనే వనములో పుట్టిన పారిజాతవృక్షము
భూదేవతల(బ్రాహ్మణుల) చే ప్రార్థితమై అలరారుతుంది.

మహాభారతం నిజంగామనకోసం ఏర్పరచబడిన పారిజాత వృక్షమే,
అందుచేతే ఆ గ్రంధపఠనం మన అనేక కోరికలను తీరుస్తుంది.
పూర్తి గ్రంధం చదవాలనున్నా చదవలేని వారనేకమంది. వారి
సౌకార్యార్థం క్లుప్తంగా నైనా తెలియ చేద్దామనేదే ఈ చిన్ని ప్రయత్నం.
మిడి మిడి జ్ఞానంతో చేసే ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులు దొర్లితే
క్షమించి సరిదిద్ది ప్రోత్సహించ గలందులకు విజ్ఞులైన బ్లాగ్మిత్రులను
ఇందుమూలంగా వేడుకొంటున్నాను.

వ.
ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోప
శోభితంబు నుపద్వీపమహాద్వీపసంభృతం బయిన భువనం బజుండు
నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుండై
సంవత్సర త్రయంబు నిర్మించి దాని దేవలోకమునందు వక్కాణింప నారదుం
బనిచెఁ బితృలోకంబున వక్కాణింప నసితుండైన దేవలుం బనిచె
గరుడగంధర్వయక్షరాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె
నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె మనుష్యలోకంబున
జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె నే నా
వైశంపాయనమహామునివలన విని వచ్చితిఁ ,
కృతత్రేతావసానసమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబునుం
బోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహా ఘోర యుద్ధం బయ్యె.౬౬
మహా భారత నిర్మాణానికి సంవత్సరములు పట్టిందట. దానిని ప్రచారం చేయటానికి దేవలోకానికి నారదుడిని, పితృలోకానికి అసితుడైన దేవలుడినిగరుడగంధర్వయక్షరాక్షసలోకాలకి శుకుడిని,నాగలోకానికి సుమంతుడిని,మనుష్యలోకములో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయన మహర్షిని పంపించాడు. నేనా వైశంపాయుని వలన విని వచ్చాను. పూర్వం కృతయుగానంతరం దేవదానవులకు, త్రేతా యుగాతంలో రామరావణ యుద్ధం జరిగినట్లే ద్వాపర యుగాంతంలో పాండవ ధార్తరాష్ట్రులకు మహా ఘోరమైన యుద్ధం జరిగింది.