Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-11
వ.
ఇట్లడిగినఁ గుంతీదేవికి నవ్విప్రుం డిట్లనియె. 266
సీ.
ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని మానుషంబునఁ దీర్పఁ రానిదాని
నయినను జెప్పెదఁ బ్రియహితవచన యీ ప్రోలికి నామడ నేల నల్ల
యమునానదీగహ్వరమున బకుం డనురక్కసుం డుండు వాఁ డక్కజముగ
నిందులకాఁపుల నందఱ దొల్లి యల్వరుస మ్రింగుచు నున్నఁ బరమసాధు
ఆ.
లగుధరామరేంద్రు లగణితజపహోమ, దానవిధులఁజేసి వానివలనఁ
గ్రమము వడసి యొక్క సమయంబుఁ జేసిరి, యొనర దాని తెఱఁగు వినుము తల్లి. 266
వ.
నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రెండెనుపోతులం బూనిన శకటంబున నపరిమిత భక్ష్యపిశితమిశ్రాన్నం బునిచికొని పోయిన దానిని వానిని నయ్యెనుపోతులను భక్షించుచు. 268
పిశితమిశ్ర=మాంసముతోఁ గలిసిన
ఆ.
మనుజభక్షకుఁ డిదియ తనకు నప్పనముగా, నొరులవలనిబాధ వొరయకుండ
దీనిఁ గాచుచుండు నీనాఁటి రాజును, దలపఁ డసుర నోర్వ బలిమి లేమి. 269
ఉ.
పోలఁగ ధర్మ శీలుఁ డయి భూరిబలాధికుఁ డై న ధారుణీ
పాలకురక్ష మున్ వడసి భార్యను బుత్త్రుల నర్థయుక్తితో
నోలిన మేలుగాఁ బడసి యూళ్ళుల నున్నది యట్లు గానినా
డేల గృహస్థవృత్తి సుఖ మేగి వనంబున నున్కి కష్టమే. 270
క.
అరి యని విప్రులచేతను, ధరణీశులు పోఁకయును మొదలుగాఁ గొన రె
వ్వరు నిప్పాపుఁడు మానిసి, నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్. 271
అరి=కప్పము
వ.
పెద్దకాలంబునకు నీయిలువరుస నేఁడు మాకు వచ్చె నిచ్చిఱుతవాని నారాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప నేన పోయెద నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యిట్లనియె.272