Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభా పర్వము-ప్రథమాశ్వాసము-3
ఉ.
అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్ధమునన్ జయింపఁగా
నిమ్మహి నోప రెవ్వరు నుమేశ్వరుఁ డట్టివరమ్ము వానికిన్
నెమ్మిన యిచ్చె గావున వినీతుఁడు వాయుసుతుండు మల్ల యు
ద్ధమ్మున నోర్చు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్పడన్. 162

క.
బలిమిమెయిఁ బార్థురక్షా,బలమును బవనసుతు బాహుబలమును నాని
ర్మలనీతిబలము నీకుం, గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా. 163

చ.
తడయక యేగి నీతిబలదర్పము లొప్పఁగ వాని డాసి క
వ్వడియును నేను భీముఁడు నవశ్యముఁ బోర బృహద్రథాత్మజుం
గడిఁదిరిపున్ జయింతుము జగన్నుత న న్నెద నమ్ముదేని యి
ల్ల డ యిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్. 164

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జరాసంధునిమీదకు యుద్ధానికి పోయేటప్పుడన్న మాటలవి.
దానికి ధర్మరాజిట్లా అన్నాడు.
చ.
ప్రియహితసత్యవాక్య యరిభీషణ కృష్ణ భవన్ని దేశసం
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగుటేమి పెద్ద ని
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశుల నిమ్మహాధ్వర
క్రియయును సిద్ధిఁ బొందె నయకిల్బిషకీర్తి వెలుంగు చుండగన్. 166

చూడండి ధర్మరాజు వాక్యాన్ని ఎలా మొదలుపెట్టాడో. 'ప్రియహిత సత్యవాక్య' అని. అంటే చచ్చినట్లు ఆ పనిని నెరవేర్చుకొని రావలసిందే అని సూచన అన్నమాట.