Unknown
అరణ్య పర్వముప్రథమాశ్వాసము-1
క.
తిలలును నీళ్ళును వస్త్రం, బులుఁ బుష్పసుగంధవాసమున సౌరభముం
బొలు పెసఁగ దాల్చుఁ గావున, నలయక సత్సంగమమున నగు సద్గుణముల్.6
పాండవులు నిజాయుధములు ధరించి ద్రౌపదీ సహితముగ అరణ్యవాసమునకు బయలు దేరినప్పుడు పౌరులెల్లరు దుఃఖితులై ఇలా అంటున్నారు. నువ్వులు, నీళ్ళు, వస్త్రములు పుష్పముల సుగంధం చేత సౌరభాన్ని తాల్చుతాయి.అలానే సత్సంగము వలన అలుపు లేకయె సద్గుణములు కలుగుతాయి.

శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట

క.
శోకభయస్థానంబు , నేకంబులు గలిగినను విహీనవివేకుం
డాకులతఁ బొందునట్లు వి, వేకముగలవాఁడు బుద్ధివికలుండగునే.20

శోకము, భయము కలుగు స్థానంబులు అనేకమున్నా వివేకం లేనివాఁడు వ్యాకులత్వము నొందినట్లుగా వివేకము కలవాఁడు వ్యాకులత్వము నొందునే.
Unknown
సభాపర్వము-ప్రథమాశ్వాసము-1
మయుడు మయసభను నిర్మించి పాండవులకిచ్చి వెళ్ళిన తరువాత చాలా మంది మునీశ్వరులు ధర్మరాజును చూడటానికి వస్తారు.
సీ.
సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్యగోపతి గోపవేష మైత్రేయ పవిత్ర పాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞ్యవల్క్య
ఆ.
వాయుభక్ష భార్గవవ్యాస జైమిని, శుక సుమంతు పైల సువ్ర తాదు
లయిన మునులు నేము నరిగితి మెంతయు, రమ్య మయిన ధర్మరాజుసభకు.21

నారదుఁడు పాండవులయొద్దకు వచ్చుట
ఉ.
నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడునొక్కొ యంచు వి
స్మేరమనస్కు లై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి సురేంద్ర మందిర
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్.23

ప్రజలంతా నీరజమిత్రుడు భూమి మీదకు ఎందుకు వచ్చాడో అని ఆశ్చర్యమనస్కులై ఆతని ప్రకాశాన్ని మెచ్చుకొని చూస్తుండగా ఆకాశ మార్గము నుండి నారదుడు ఇంద్రునిమందిరాన్నే తన విలాసముతో అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్న అర్జునుని ఇంటికి ప్రేమతో వచ్చాడు.

పర్వత పారిజాత రైవత సుముఖు లను మహా మునులతో కలసి వచ్చాడట నారదుఁడు.25
Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౧

సాత్యకి దుర్యోధనుకడకు దూతం బంప గూడ దని చెప్పుట
చ.
పలికిన చందముల్ నెఱపి పైతృక మై చను రాజ్యభాగ మి
మ్ములఁ బడయం దలంచి బలముం జలమున్ నెఱపం గడంగు వీ
రలు నొరు వేఁడఁ బోదురె యరాతులు సాధుల మెత్తురే రణం
బుల జయలక్ష్మిఁ జేకొనుటఁ బోలునె యొండొక రాజధర్మముల్. 26

విరాటు కొలువులో అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత తదుపరి కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలో నిర్ణయించడానికి కూడిన సభలో సాత్యకి ' అన్నమాట ప్రకారం నడచుకొని పిత్రార్జితమైన రాజ్యభాగం కోసం బలమూ చలమూ కలిగిన ఈ పాండవులు ఒకరిని యాచించబోరు.శత్రువులు సాధువులైనవారిని మెచ్చుకుంటారా? యుద్ధములో జయలక్ష్మిని చేకొనుటను యింకో రాజధర్మమేదయినా పోలునా?' అంటాడు.

యుద్ధము వలనగాని రాజ్యభాగము సిద్ధించదు అంటూ ద్రుపదుడు ఇలా అంటాడు.
క.
మృదుభాషణములదుర్జన, హృదయములు ప్రసన్నతామహిమఁబొందునె యె
ల్లిదముగఁ గొని యంతంతకు, మద మెక్కుంగాక దురభిమానము పేర్మిన్. 35

మెత్తనిమాటల వలన దుర్జనులైన కౌరవుల హృదయాలు ప్రసన్నం కావు. తేలికగా తీసుకుని అంతకంతకూ దురభిమానంతో మద మెక్కుతారు.

దుర్యోధనుడు అర్జునుడు కృష్ణ సహాయాన్నర్థించి వచ్చిన ఘట్టంలో నారాయణాభిధానులు పది వేల సైన్యం ఒకవైపు (వారందరూ యుద్ధం చేస్తారు) , తా నొకడూ ఒకవైపుగా(తాను ఆయుధాన్ని పట్టడు) విభాగం చేసి--
క.
వారొక తల యే నొక తల , యీ రెండు దెఱంగులందు నెయ్యది ప్రియ మె
వ్వారికిఁ జెప్పుడు తొలితొలి, గోరికొనన్ బాలునికిఁ దగుం బాడిమెయిన్. 75
ముందుగా వయసులో చిన్నవాడైన అర్జునుడు కోరుకోవటం న్యాయం అంటాడు కృష్ణుడు.

ఈ ఘట్టంలో కొస్తే తిరుపతి వేంకటకవుల పాండవ ఉద్యోగ విజయాల పైకే మనసు పరిగెట్టుకు పోతుంది.