Unknown
ఆది పర్వము- చతుర్థాశ్వాసము-౧౧
శంతన సత్యవతుల వివాహము
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్

దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్
దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁ
డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨

దాని శరీర సౌరభము, దాని చంచలమైన కనుచూపులు, దాని అందమైన శరీరాకృతి, దాని మందహాసముతో కూడిన ముఖకాంతి, దాని విలాసము కడు సంతోషముతో చూచి మదనబాణములచే బాధింపబడిన వాడైన శంతనుడు సత్యవతితో ని ట్లనియె.
ఉ.
ఎందులదాన వేకతమ యియ్యమునానది నోడ సల్పుచున్
సుందరి నీకు నున్కి యిది చూడఁగఁ దా నుచితంబె నావుడున్
మందమనోజ్ఞ హాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం
క్రందనసన్నిభున్ నృపతిఁ గన్యక యి ట్లని పల్కెఁ బ్రీతితోన్. ౧౭౩

ఏమిటిలా ఓడనడుపుతున్నావేమిటి కారణం అని ఆమెను అడుగుతాడు శంతనుడు.
వ.
ఏను దాశరాజు కూఁతురఁ దండ్రినియోగంబున నిక్కార్యంబు ధర్మార్థంబు సేయుచుండుదు ననిన దాని యభినవరూపసౌందర్యంబులు దొల్లియు విని యెఱింగిన వాఁడై యక్కోమలిం గామించి దాశరాజుకడకుం జని తన యభిప్రాయం బెఱింగించిన నతండును సంతసిల్లి శంతను నత్యంత భక్తి పూజించి యి ట్లనియె. ౧౭౪
తే.
పుట్టినప్పుడ కన్యకఁ బోలునట్టి, వరున కిచ్చుట యిది లోకవర్తనంబు
వసుమతీనాథ నీయట్టివరున కిచ్చి, ధన్యులము గామె యిక్కన్యఁ దద్దపేర్మి. ౧౭౫

పుట్టినప్పుడే కన్యకను తగిన వరున కిచ్చుట అనేది లోకవర్తనము. ఓ రాజా నీ వంటి వరున కిచ్చి చేస్తే మేము ధన్యులమవుతాము. అని దాశరాజు ఇంకా--
వ.
అయినను నాడెందంబునం గలదానిం జెప్పెద నిక్కన్యక నీకు ధర్మపత్నిఁగాఁ జేయునట్టి యిష్టంబు గలదేని నా వేఁడినదాని ని మ్మనిన శంతనుండు దాని నీనగునేని నిచ్చెదఁ గానినాఁ డీ నేర యేది సేప్పుమనిన దాశరా జిట్లనియె.౧౭౬
ఇవ్వగలిగిందయితే ఇస్తాను ఈయరానిదైతే ఇవ్వను అది యేమిటో చెప్పు అంటాడు శంతనుడు.
మధ్యాక్కర.
భూపాల నీకు నిక్కోమలివలనఁ బుట్టినసుతుఁడు
నీ పరోక్షంబున రాజు గావలె నెమ్మి ని ట్లీఁ గ
నోపుదే యనిన శంతనుండు గాంగేయు యువరాజుఁ దలచి
యీపల్కు దక్కగ నొండు వేఁడుమ యిచ్చెద ననిన. ౧౭౭

నీ వలన ఈ కన్యయందు పుట్టేవాడే నీ పరోక్షంలో రాజు కావాలి .ఈ వరం ఇస్తే పెండ్లి జరుగుతుంది. లేకపోతే లేదు అంటాడు. అప్పుడు రాజు గాంగేయుని తలచుకొని ఇది కాకుండా వేరే ఏమైనా కోరుకొమ్మంటాడు.
వ.
నా కొండెద్దియు నిష్టంబు లే దనిన విని యద్దాశరాజు చేతం బ్రతిహతమనోరథుం డయి క్రమ్మఱి వచ్చి శంతనుండు చింతాక్రాంతుం డయి సత్యవతిన తలంచుచు వీతకార్యావసరుం డయి యున్న నొక్కనాఁడు గాంగేయుండు తండ్రిపాలికి వచ్చి యి ట్లనియె. ౧౭౮

తలచిన పని జరగలేదు కాబట్టి రాజు ఇంటికి తిరిగి వచ్చినా ఆమెను మరవలేక బాధపడుతుంటాడు.
చ.
భవదభిరక్షితక్షితికి బాధ యొనర్పఁగ నోపునట్టి శా
త్రవనివహంబు లేదు వసుధా ప్రజ కెల్ల ననంతసంతతో
త్సవముల రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు నిట్లు మా
నవవృషభేంద్ర యేలొకొ మనఃపరితాపముఁ బొంది యుండఁగన్. ౧౭౯

నీచే రక్షించబడి యున్న రాజ్యమునకు బాధ కలిగించగలిగినట్టి శత్రుసమూహమేమీ లేదు. భూప్రజలలెల్లరూ ఎల్లప్పుడూ ఉత్సవములే గా ఉన్నారు. రాజు లందరూ నీకు విధేయులు గానే ఉన్నారు. అలాంటప్పుడో రాజా నీ విషాదానికి హేతు వేమిటో చెప్పమని అడిగాడు గాంగేయుడు రాజుని.
వ.
అనిన విని బెద్దయుం బ్రొద్దుచింతించి శంతనుండు గొడుకున కి ట్లనియె. ౧౮౦
క.
వినవయ్య యేక పుత్త్రుఁడు, ననపత్యుఁడు నొక్కరూప యని ధర్మువులన్
విని నీకుఁ దోడు పుత్త్రుల, ననఘా పడయంగ నిష్ట మయినది నాకున్. ౧౮౧
క.
జనవినుత యగ్నిహోత్రం,బును సంతానంబును వేదములు నెడ తెగఁగాఁ
జన దుత్తమవంశజులకు, ననిరి మహాధర్మ నిపుణు లైన మునీంద్రుల్. ౧౮౨.
క.
నీ వస్త్రశస్త్ర నిద్యా, కోవిదుఁడవు రణములందుఁ గ్రూరుఁడ వరివి
ద్రావణసాహసికుండవు, గావున నీ యునికి నమ్మఁగా నోప నెదన్. ౧౮౩

వినవయ్య! ఒక్కకొడుకు, అనపత్యుడు(పిల్లలు లేనివాడు) ఒక్కరూపే అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత నీకు తోడుగా ఇంకా పిల్లలని పొందాలని ఉందయ్యా. పైగా అగ్నిహోత్రం, సంతానము వీటిని ఉత్తమవంశజులు విడిచి పెట్టరాదు. అలా అని గొప్ప ధర్మాల్ని యెఱిగిన మునీశ్వరులు చెప్తారు. నీవేమో గొప్ప పరాక్రమ శాలివి, అనేక యుద్ధాలలో పాల్గొంటుంటావు. గొప్ప సాహసికుడవు కూడా. అంచేత నీ ఉనికి శాశ్వతమని నమ్మటానికి లేదు.
వ.
బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయవలయు వివాహం బయ్యెద ననిన విని.

ఎదిగిన కొడుకుకు పెళ్ళి చేయకుండా తానే మళ్ళీ పెళ్ళికి సిద్ధపడటం ఏ విధంగా ధర్మబద్ధం అవుతుందో తెలియదు.