Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-6
క.
క్రోధమ తపముం జెఱచును, గ్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు, బాధయగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే
౧౭౪

క.
క్షమ లేని తపసితనమును, బ్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభురా
జ్యము భిన్న కుంభమున తో, యములట్టుల యధ్రువంబులగు నివి యెల్లన్.
౧౭౫


పరీక్షితుడు అడవికి వేటకెళ్ళి అక్కడ శమీకు డనే మునీశ్వరుని- తను వేటాడుతున్న జంతువు గురించి వివరం అడిగి-, మౌనవ్రతుడైన ముని సమాధానం చెప్పక పోతే- అతని మెడలో చచ్చిన పాము శవాన్ని వేసి వస్తాడు. శమీకుని పుత్రుడు శృంగి ఇది తెలిసి పరీక్షితుడు ఏడు రోజులలో తక్షక విషాగ్ని వలన చనిపోతాడని శాపం ఇస్తాడు. శృంగి తరువాత తండ్రికి ఈ విషయం చెప్పగా శమీకుడు శోకించి కొడుకుతో పై విధంగా అంటాడు.
వ.
క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధంబైన క్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుం డైన పరీక్షితునకుం బరీక్షింపక శాపంబిచ్చి చెట్ట సేసితివి. రాజ రక్షకులై కాదె మహామును లతిఘోరతపంబు సేయుచు వేదవిహితధర్మంబులు నడపుచు మహాశక్తిమంతు లయి యున్నవా రట్టిరాజుల కపకారంబు సేయునంతకంటె మిక్కిలి పాతకం బొం డెద్ది మఱియు భరతకుల పవిత్రుం డైన పరీక్షితు రాజ సామాన్యుంగా వగచితే.౧౭౬
వగచితే=తలఁచితివా?
ఉ.
క్షత్రియవంశ్యు లై ధరణిఁ గావఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రు లనఁగాఁ గల నాలుగు జాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామ మాం
ధాతృ రఘుక్షి తీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్.౧౭౭ (పోలిక కొంచెం ఎక్కువయిందని పిస్తుంది)
వ.
అతండు మృగయా వ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుడయి యెఱుంగక నా కవజ్ఞఁ జేసె నేనును దాని సహించితి నమ్మహాత్మునకు నీ యిచ్చిన శాపంబుఁ గ్రమ్మఱింప నేర్తేని ల గ్గగు ననిన శృంగి యిట్లనియె.౧౭౮
నేర్తేని=సాధ్యమయితేని
క.
అలుక మెయిమున్న పలికితి, నలుకని నాపలుకు తీక్ష్ణమై యింతకు ను
జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ, దలరఁగఁ బ్రేరేఁప కేల తా నెడ నుడుగున్.౧౭౯
తలరఁగన్=చలించునట్లుగ
వ.
నావచనం బమోఘం బనిన శమీకుండు శోకాకలితచిత్తుండై తన శిష్యున్ గౌరముఖుం డనువానిం బిలిచి దీనినంతయుఁ బరీక్షితున కెఱిగించి తక్షకువలనిభయంబు దలంగునట్టి యుపాయంబు చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ పరీక్షితు పాలికిం జని అన్ని విషయాలు తెలియజేస్తాడు--౧౮౦
తరువాత ఇక్కడో చిన్న కథ కూడా వుంది.
కశ్యపు డనే వైద్యుడొకడు తక్షక విషాగ్నిచే చనిపోయే పరీక్షితుని బ్రతికించి రాజు నుండి విశేషమైన ధనాన్ని పొందగోరి వెళ్తుంటాడు. ఇది తెలిసిన తక్షకుడు అతని కెదురుపడి అతన్నడిగి విషయం తెలుసుకొని నీకిది సాధ్యం గాదని సవాలు చేసి చేతనైతే- అక్కడ వున్న ఓ మహా వృక్షాన్ని కాటువేసి తన విషంతో బూడిదగా మార్చి- దానిని ముందటిలా తన వైద్యంతో పునర్జీవింప చేయమంటాడు. అతడు దానిని తన శక్తితో ముందటిలా పునర్జీవింప జేస్తాడు. అప్పుడు తక్షకుడే అతనికి విశేషమైన ధనాన్ని ఇచ్చి మరలింప చేస్తాడు. కొసలో చిన్నగమ్మత్తేంటంటే నిర్జనమైన అడవిలో జరిగిన ఈ విషయం బైట లోకానికెలా తెలిసిందన్నది. అక్కడ ఆ చెట్టుపైకి పుల్లలకోసం ఎక్కిన వాడొకడు చెట్టుతో పాటే దగ్ధమై మళ్ళీ చెట్టుతో పాటే పునర్జీవితుడైన వాడొకడు దీనిని ప్రజలకు చెప్పటం జరిగిందట. అదీ సంగతి.మన పూర్వీకుల్లో ఎంతెంత గొప్పవాళ్ళున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.
Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౪
గరుడుడు అమృతాన్నితెచ్చి ఉరగులకిచ్చి తను, తన తల్లి పంచభూతముల సాక్షిగా దాస్యమునుంచి విముక్తి పొందామని చెప్పివారిని శుచిగా స్నానం గట్రా చేసి వచ్చి ఆరగించమని చెప్పి శుభ్రమైన ప్రదేశంలో దర్భలపై అమృతం కలిగిన పాత్రను ఉంచి అక్కడినుంచి తల్లితో సహా వెళ్ళిపోతాడు. వారు శుద్ధులై వచ్చేలోగానే అదృశ్యరూపంలో గరుడుని వెనకాలే వచ్చిన ఇంద్రుడు ఆ పాత్రనక్కడినుండి తీసుకుని స్వర్గానికెళ్ళిపోతాడు.
వ.
అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానం బని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటం జేసి నాఁటంగోలె ద్విజిహ్వులు నాఁ బరగిరి యమృతస్థితిం జేసి బర్భలు పవిత్రంబు లయ్యె.౧౨౩


తరువాత శేషుడు తన వారు చెసిన పనికి విచారించి వారిని విడిచిపెట్టి బ్రహ్మ గురించి తపస్సు చేసి భూభారాన్ని ధరించేలా వరాన్ని పొందుతాడు.తల్లి శాపం వల్ల జనమేజయ సర్పయాగంలో ఉరగులకు గల మరణాన్నించి వాసుకి చెల్లెలైన జరత్కారువునకు జరత్కారుడనే మునీశ్వరునికి పుట్టే ఆస్తీకుడనేవాని వలన రక్షణ కలుగుతుందని బ్రహ్మ చెప్పాడట.
జరత్కారుని చరిత్రము
జరత్కారుడు వివాహానికి విముఖుడై వుంటే ఆతని పూర్వీకులు అతడు సంతానం లేకుండా వుండటం వలన వారికి సద్గతులు కలగటం లేదంటారు. అది తెలిసినవాడై పెళ్లి చేసుకోడానికి సిద్ధపడి తన పేరు వంటి పేరుగల సనామ్నినే చేసుకుంటానంటాడు. అప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు అనే ఆమెతో అతని వివాహం జరుగుతుంది. వారిద్దరికీ పుట్టిన ఆస్తీకుడే జనమజేయుని సర్పయాగాన్ని విరమింప జేసి సర్పములను రక్షిస్తాడు. ఆ సందర్భంలోని అపుత్రకులకు గతులు కలుగవని చెప్పే పద్యం ఇది.
చ.
తగినసుపుత్రులం బడసి ధర్మువు దప్పక తమ్ము నుత్తముల్
పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్ గడుఘోరనిష్ఠతోఁ
దగిలి తపంబు సేసియును దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్
నెగడఁగఁ జేసియుం బడయ నేర రపుత్రకు లైనదుర్మతుల్.౧౫౦
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-5
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట.
క.
ఉపధాశుద్ధులఁ బాప, వ్యపగతబుద్ధుల వినీతవర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.౩౬

ధర్మాదులచే పరిశుద్ధులైన వారు, పాపవ్యపగతబుద్ధులు, వినీతి వర్తనులు, సమదృష్టి కలిగిన వారు, నిపుణులు అయినవారిని బాగుగా పరీక్షించి ధనసంపాదనాది రాజకార్యాలలో నియోగింస్తున్నావా? గవర్నమెంటు ఆఫీసర్లకుండాల్సిన
లక్షణాలన్నమాట అవి.
ఉ.
ఉత్తమమధ్యమాధమనియోగ్యుల బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమమధ్యమాధమనియోగములన్ నియమించి తే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి ననూనముగాఁ దగుజీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్.౩౭

రాజ ధర్మాల్ని ఎంత చక్కగా విశదీకరిస్తున్నారో చూడండి. ఉద్యోగులకు దయతో కాలము తప్పకుండా జీతాల్ని చెల్లిస్తుండాలట రాజు. ఎవరెవర్ని ఏ యే పనుల్లో నియోగించాలో బాగా తెలుసుకుని అలానే నియోగించాలట.
క.
తమతమకనియెడుతఱి జీ,తము గానక నవయుభటులదౌర్గత్యవిషా
దము లేలినవాని కవ,శ్యము నె గ్గొనరించు నతఁడు శక్రుండైనన్.౩౮

జీతాలు అందక ఉద్యోగులు బాధపడితే వాళ్ళ దుర్గతివల్ల కలిగే విషాదము ఆరాజు ఇంద్రుడైనా సరే అతనికి చెడును కలిగిస్తాయట.