Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-1
ఉ.
శ్రీ యన గౌరి నాఁ బరగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తి యై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడుభక్తజనంబు వైదిక
ధ్యాయత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్. 1
క.
వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణవర్గంబులకున్
వా దైన చోటులకు దా, మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్. 4

భారతాన్ని పంచమ వేదం అంటారు. అది వేదములకు, అన్ని స్మృతులయొక్క వాదములకు చాలా పురాణ వర్గములలోని విరోధం కలిగించు చోటులకు, ధర్మార్థకామమోక్షాలకు, ప్రమాణము వంటిది.

ఉ.
ఆదరణీయసారవివిధార్థగతిస్ఫురణంబు గల్గి య
ష్టాదశ పర్వనిర్వహణసంభృత మై పెను పొంది యుండ నం
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వవిశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్. 6


ఆదరింపదగినదై సారవంతమై వివిధములైన అర్థములను ప్రాప్తించు స్ఫురణము కలిగి పదునెనిమిది పర్వములతో శోభించుచున్నదై వుండగా దానిలో ఆదిపర్వము మొదలు మూడు పర్వములను ఆంధ్రకవిత్వ విశారదుడు,విద్యాదయితుడు, మహితాత్ముడు ఐన నన్నయభట్టు దక్షతతో తెలుగు చేసాడు.


మ.
హృదయాహ్లాది చతుర్థ మూర్జితకథోపేతంబు నానారసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జన సంప్రార్థ్యంబు లై పెంపునం
దుది ముట్టన్ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారఁగన్. 7

హృదయాహ్లాదాన్ని కలిగించి గొప్పదైన నాల్గవ కథతోకూడుకున్నవిరాట పర్వము ఉద్యోగ పర్వము మొదలుగాగల మిగిలిన పదిహేను పర్వాలను తెనుఁగు బాసలో జనులచే ప్రార్థింపబడినవై పెంపు వహించేలా చివరివరకూ రచియించటం ఒప్పుతుంది. అలా చేస్తే పండితులందరూ సంతోషిస్తారు.అని తిక్కన సోమయాజి గారు నిర్ణయించుకొన్నారు.
Unknown
శాంతి ప్వము-ప్రథమాశ్వాసము-4
నకులుడు ధర్మజునకు మనస్తాపోశమంబు చేయుట.
క.
తక్కినమూఁడాశ్రమములు, నొక్క దెస గృహస్థధర్మ మొక దెసఁదులయం
దెక్కింప వానితో , య్యొక్కటి సరిదూగె నందు రుర్వీశ బుధుల్.76

వర్ణాశ్రమ ధర్మాలు నాలుగు.అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమము. వీనిలో ఒక తక్కెడలో గృహస్థం ఒకవేపు, మిగిలిన మూఢు ఒకవేపు ఉంచి తూచితే గృహస్థాశ్రమం మిగిలిన మూడింటితో సమానంగా తూగినదని పెద్దలు చెపుతారు.అదీ గృహస్థాశ్రమం యొక్క గొప్పదనం.అది మిగిలిన ౩ ఆశ్రమాలకీ ఆధారభూతం.కావున గృహస్థధర్మంబు ఆచరణీయం.
క.
జతనంబున నర్థము సం, చితముగఁ గావించి క్రతువిశేషంబుల దే
వతలం దృప్తులఁ జేయమి, యతికిల్బిషకారి యందు రాగమవేదుల్.78

ప్రయత్నములద్వారా ధనాన్ని బాగుగా కూడబెట్టి క్రతువుల నొనరించుటతో దేవతలను సంతృప్తులను చెయకుండుట ఎక్కువ పాపమును కలిగించునని ఆగమ శాస్త్రవేదులు అంటారు.
క.
పరుల వధింపక యెవ్వఁడు, ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ
బొరయరు పాపము సుగతిక, యరిగిరి వా రీవు నట్ల యగు టొప్పు నృపా.81

పూర్వ రాజులలో పరులను వధించకుండా ఏరాజు రాజ్యాన్ని పరిపాలించాడో చెప్పు.వారందరూ సుగతినే పొందారు. నీకూ అలానే చేయటం మంచిది.
క.
రక్ష ప్రజ గోరు నిజయో, గ క్షేమార్థముగ జనసుఖస్థితి నడపన్
దక్షుఁ డగు రాజు నడప కు, పేక్షించినఁ బాప మొందదే కురుముఖ్యా.82

ప్రజలు రాజు వలని రక్షణను కోరుకుంటారు.అందరూ సుఖంగా వుండేలా అందరికి క్షేమం కలిగేలా దక్షుడైన రాజు పరిపాలించాలి, అలా చేయకపోతే పాపము కలుగుతుంది కదా రాజా.