Unknown
ఆది పర్వము- అష్టమాశ్వాసము-2
వ.
అనుచున్న సమయంబున నయ్యిద్దఱ వారించి విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. 42
సీ.
ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థవిమలమతులు
ద్రోణగాంగేయులు దురితవిదూరులు ని న్నెద్ది గఱపిరి నెమ్మితోడ

దానిన చేయుట ధర్మువు వారలకంటె హితుల్ నీకుఁ గలరె యొరులు

దుర్యోధనుండును దుశ్శాసనుండును గర్ణుండు శకునియుఁ గరము బాలు
గీ.
రెఱుఁగ రిదియు ధర్ము విది యధర్మం బని, యట్టివారిపలుకు లాదరించి
వినక పాండుసుతుల వేగ రావించి వా,రలకుఁ బ్రీతి నర్థరాజ్యమిమ్ము
. 43

విదురుడు ధృతరాష్ట్రునికి సరియైన విధానాన్ని బోధించాడు. ద్రోణుడు, గాంగేయుడు వీరిద్దరూ మధ్యస్థులు, నిజాన్ని పలికేవాళ్ళు, వయోవృద్ధులు, పాపానికి దూరంగా వుండేవారూను అందుచేత వారు చెప్పింది ఆచరించటం శ్రేయస్కరం. వారు చెప్పినట్లుగా పాండవులను పిలవనంపి వారికి అర్థ రాజ్యం ఇయ్యి. దుర్యోధనాదులు ఇంకా చిన్నవాళ్ళు, వారికి ఇది ధర్మం యిది అధర్మం అనేది సరిగా తెలియదు. అని సలహా ఇస్తూ ఇంకా పాండవుల గురించి ఇలా అంటున్నాడు.
మ.
తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్ దానిపై
శమితారాతిబలుండు వారలకుఁ బాంచాలప్రభుం డిప్ప్డు చు

ట్టము దా నయ్యెఁ దదాత్మజుం డయినధృష్టద్యుమ్నుఁడున్ వారితో

సమవీర్యుం డొడఁగూడె నిష్టసఖుఁ డై సంబంధబంధంబునన్
. 44
దార=తారు అ =వారే, శమితారాతిబలుండు=శత్రుబలము నణఁచినవాఁడు

పాండవులు మొదలే వారికి వారే పరాక్రమంలో ఎవ్వరికీ జయింపరానివారు, వాళ్ళకిప్పుడు శత్రుబలాన్ని అణిచిపెట్టినట్టి ద్రుపదుడు చుట్టం కూడా అయ్యాడు. ఆయనకొడుకు దృష్టద్యుమ్నుఁడు పాండవులతో సరిసమానమైన పరాక్రమ వంతుడు వారికి ప్రియసఖు డయ్యాడు చుట్టరికం మూలంగా.
మ.
బలదేవాచ్యుతసాత్యకుల్ దమకు నొప్పన్ మిత్రులుం గూర్చుమం
త్రులుఁ గా దైవము మానుషంబుం గలనిత్యుల్ నీకు దుర్యోధనా
దులకంటెం గడు భక్తు లెంతయు వినీతుల్ వీరు లప్పాండుపు
త్త్రులు నీపుత్త్రుల కారె వారిఁ దగునే దూరస్థులం జేయఁగన్. 45

బలదేవుడు, శ్రీకృష్ణుడు, సాత్యకి తమకు కూర్చిన మంత్రులు, హితులు కాగా దైవము - మానుషమూ కల నిత్యులూ, దుర్యోధనాదులకంటె నీ యెడల అధికమైన భక్తి కలవారు అయిన పాండవులు నీ పుత్త్రులవంటివారే. వారిని దూరస్థులుగా ఉంచటం తగదు.
ఉ.
ఆహవభూమిలోనఁ బరమార్థము పార్థుఁడు వైరివాహినీ
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వారికి మార్కొనంగ ను
త్సాహము సేయఁ డన్న లఘుసారు లధీరు లసాహసుల్ నిరు
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా. 46
వ్రచ్చుచోటన్ = చీల్చునెడ, మఘవుండు=ఇంద్రుడు

ఉ.
ఆయతబాహుఁ డాతనికి నగ్రజుఁ డగ్రణి పోరులందు నా
గాయుతసత్త్వుఁ డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీముఁ డ
వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిఁ బోలు చున్నమా
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్. 47
క.
తమ్ములయట్టుల తనకు వ,శమ్మయి ధర్మువును ధృతియు సత్యముఁ గారు
ణ్యమును నొప్పఁగ బేర్మి ని,జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే. 48
వ.
వారలబలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె నీ పుణ్యమున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రదికిరి నీయందుఁ బురోచనదిగ్ధం బయినదుర్యశఃపంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము దుర్యోధనాపరాధంబున నఖిలమహీ ప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి నట్లు గా కుండ రక్షింపుమనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె. 49
క.
నీవును భీష్ముఁడు ద్రోణుఁడు, భూవినుతవిశుధద్ధర్మబుద్ధుల రగుటన్
మీ వచనమున కనర్థము, గావింపఁగ నంత కార్యగతిమూఢుఁడనే. 50

ఇలా అని చెప్పి పాండవులను తన వద్దకు రప్పించుకొని ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చి ధర్మరాజును ఖాండవప్రస్థానికి పంపిస్తాడు.