Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౯
ఉదంకుడు తక్షకుని నుండి కుండలాలు తీసుకున్న తరువాత "కుండలములు నాల్గవ రోజుకి తీసుకుని రమ్మని గురుపత్ని నన్ను పంపించింది. ఈ రోజే ఆ రోజు. ఎలా అక్కడికి తిరిగి వెళ్ళగల'' నని ఆలోచిస్తున్న ఉదంకుని అభిప్రాయం తెలుసుకున్న వాడై ఆ దివ్యపురుషుడు ఓ దివ్యహయాన్ని అతనికిచ్చి ఇది నిన్ను క్షణాలలో నీ గురువుగారి దగ్గరకు చేరుస్తుందంటాడు. ఉదంకుడు అలా చేసి సమయానికి కుండలాల్ని గురుపత్నికివ్వ గలుగుతాడు. అప్పుడు గురువు గారతనిని
క.
ఈయున్న పౌష్యుప్రోలికిఁ, బోయి కడుం బెద్దదవ్వు పోయినయ ట్ల
త్యాయతవిమలతపోమహి,మా యిన్ని దినంబు లేల మసలితి చెపుమా.116

ఈ దగ్గరలోనే వున్న పౌష్యుని దగ్గరకెళ్ళి రావడాని కిం తాలస్య మయిందే మయ్యా అని గురువుగారు అడగనే అడుగుతా డు.
వ.
అనిన నుందకుం డిట్లనియె నయ్యా మీయానతిచ్చినట్ల మసల వలవదు. తక్షకుండను దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మసల వలసె. వినుడు, మిమ్ము వీడ్కొని చనువాఁడ నెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచు వాని మహా తేజస్వి నొక్క దివ్యపురుషుం గని వానిపన్నినవృషభగోమయభక్షణంబు సేసి చని పౌష్యుదేవి కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చి తక్షకుచేత నపహృతకుండలుండ నై వానిపిఱుందన పాతాళ లోకంబునకుం బోయి నాగపతుల నెల్ల స్తుతియించి యందు సితాసితతంతుసంతానపటంబు ననువ యించుచున్న వారి నిద్దఱ స్త్రీలను ద్వాదశారచక్రంబుఁ బరివర్తింపుచున్న వారి నార్వుర గుమారుల నతి ప్రమాణతురగారూఢుం డైన యొక్క దివ్యపురుషుం గని తత్ప్రసాదంబునఁ గుండలంబులు వడసి నత్తురంగంబు నెక్కి వచ్చితి నిది యంతయు నేమి నా కెఱింగింపుఁ డనిన గురుం డి ట్లనియె.117
సీ.
అప్పురుషుండింద్రుఁ డయ్యుక్ష మైరావతంబు గోమయ మమృతంబు నాగ
భువనంబులోఁ గన్న పొలఁతులిద్దఱు ధాతయును విధాతయు వారి యనువయించు
సితకృష్ణతంతురాజితతంత్ర మది యహోరాత్రంబు ద్వాదశారములు గలుగు
చక్రంబు మాసాత్మసంవత్సరంబు కుమారు లయ్యార్వురు మఱియుఋతువు
ఆ.వె.
లత్తురంగ మగ్ని యప్పురుషుండు ప,ర్జన్యుఁ డింద్ర సఖుఁడు సన్మునీంద్ర
యాది నింద్రుఁ గాంచి యమృతాశివగుట నీ, కభిమతార్థసిద్ధి యయ్యెనయ్య .౧౧౮

మసలు=తడయు
మహోక్షము=పెద్ద యెద్దు
అపహృత కుండలుండు=దొంగిలింప బడిన కుండలములు కలవాడు
సితాసితతంతుసంతానపటంబు=తెల్లని నల్లని దారములతో నేయబడి ఉన్న మగ్గము
ద్వాదశార చక్రంబు=పండ్రెండు బండి యాకులుతో కూడిన చక్రము
ఉక్షము=ఎద్దు
పొలతులు=స్త్రీలు
సితకృష్ణరాజితతంత్రము=తెల్లని నల్లని దారములచేఁ బ్రకాశించు మగ్గము

క.
కర మిష్టము సేసితి మా, కరిసూదన దీన నీకు నగు సత్ఫలముల్
గురుకార్యనిరతు లగు స,త్పురుషుల కగు టరుదె యధిక పుణ్యఫలంబుల్.119

మా యిష్టాన్ని నెరవేర్చావు. నీకు సత్ఫలములు చేకూరుతాయి. గురుకార్యమునందు మిక్కిలి ఆసక్తి గల సత్పురుషులైన వారికి అధిక పుణ్యఫలము కలుగుట అరుదు కాదు కదా.
అని పలికి ఉదంకునికి గురుకులమునుండి స్వేచ్థను ప్రసాదిస్తారు గురువులు.