Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౮
ఇంద్రుడు నహుషుతేజోవిశేషంబు చూచి మఱుఁగువడుట.
శచీ దేవి నహుషునితో కొంతకాలం గడువు కోరివచ్చిన పిదప అందరూ కలసి ఆలోచించుకొని విష్ణుదేవు పాలికి రహస్యంగా పోయి సహాయం కోరగా ఇంద్రునిచే అశ్వమేధ యాగం చేయిస్తే అతని పాపం నశిస్తుందని సలహా యిస్తాడు. అలా అశ్వమేధ యాగం చేసి పాపాలను పోగొట్టుకొని ఇంద్రుడు నహుషుని వద్దకు వెళ్ళి ఆతని తేజస్సు చూచి భయకంపితుడై పారిపోయి ఎక్కడో దాగుకొంటాడు.
శచీ దేవి ఆకాశవాణిని ప్రార్థించి ఆకాశవాణి సహాయంతో ఇంద్రుని కలసి నహుషుని పోకలు అతనిని తాను గడువు కోరటం వగైరా తెలియజేస్తుంది.అప్పుడామెతో ఇంద్రుడు
క.
ఆ నహుషు బాహుగర్వ మ,నూనం బై యున్నయది సముజ్జ్వల మునిస
న్మాన ప్రవృద్ధ మగుటను, దానం గాలంబు వేచెదను జయమునకున్.౧౭౫
సముజ్జ్వల మునిసన్మాన ప్రవృద్ధము=ప్రకాశించు మహర్షుల యాదరముఁ బెరిగినది.
చ.
తఱి యగునంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా
కఱపినయట్ల చేయుము తగం జని యాతనిఁ గాంచి నన్ను నె
త్తెఱఁగున నైనఁ బొందఁగ మదిం దలపోఁతయ కల్గెనేనిఁ గ్ర
చ్చఱ మునివర్గవాహనుఁడ వై చనుదెమ్మను మంతఁ దీరెడున్.౧౭౬

సమయం వస్తే గాని యేమీ చెయ్యలేం. నిన్ను పొందాలని అతనికుంటే మునివర్గాన్ని వాహనంగా చేసుకొని రమ్మని చెప్పు. అని శచీ దేవికి చెప్తాడు.
శచీదేవి నహుషుడిని అలానే కోరగా దానికి సమ్మతించి సప్తర్షిగణ వాహన సమేతుడనై వస్తానని చెప్పి అలానే రావటానికి ప్రయత్నిస్తాడు.
శచీ దేవి బృహస్పతిని రక్షింపవేడగా అతడు అగ్నిదేవుడిని పిలిచి ఇంద్రుని వెదికి రమ్మని పంపిస్తాడు. అగ్ని అన్నిచోట్లా వెదకి ఇంద్రుని జాడ కనుక్కోలేక తిరిగివచ్చి బృహస్పతితో ఇలా అంటాడు.
వ.
-----నాకు జలంబులు ప్రవేశింపరామి నంద పరికింప నేరనైతి నప్పుల వలన నగ్నియు బ్రాహ్మణులవలన క్షత్రియజాతియు నశ్మంబులవలన లోహంబును నుద్భవించె వాని వాఁడిమి యెల్ల యెడలనుం జెల్లుఁ దమతమ జన్మస్థానంబులయం దడంగుం గావున నీళ్ళు నాకు సంక్షయంబు సేయుట ప్రసిద్ధంబనిన విని యనిమిషగురుండు హవ్యవాహను నత్యంత గౌరవంబునం గనుంగొని.౧౮౫
అశ్మంబులు=ఱాళ్ళు
బృహస్పతి అగ్నికి తన మంత్రబలంచే అన్నిచోట్లకు వెళ్ళే వీలు కలిగించగా అగ్ని తిరిగివెళ్ళి ఇంద్రుని వెదకి పట్టుకుంటాడు. అక్కడికి మునులందరితో కలసి వెళ్తారందరూ.బృహస్పతి ఇంద్రునితో
క.
శరనిధి ఫేనంబున నా, హరి పొంది జగద్విరోధి యగు వృత్రునిఁ దా
బరిమార్ప నీకు విజయము, దొరకొనియెం గాక దీన దోసము గలదే.౧౯౦
వ.
అని సముచితంబుగా సంబోధించిన గురుని సంభాషితంబుల నిర్దోషితుండయి----౧౯౧
------నహుషు గెలుచు నుపాయంబు విచారించు నవసరంబున.౧౯౭
క.
కష్టుం డగునానహుషుఁడు, నష్టాత్మకుఁ డయ్యె దివిజనాయక నీయు
త్కృష్ట చరితమున సురలకుఁ, దుష్టిగ నిజరాజ్యసంగతుఁడ వగు మనుచున్.౧౯౮
కష్టుండు=పాపి
క.
మునివరుఁ డైన యగస్త్యుఁడు, చనుదెంచిన శతమఖుండు సమ్మతి నుచితా
సనమిడి యర్ఘ్యముఁబాద్యము, నొనరిచి యిట్లనియె సవినయోక్తి నతనితోన్.౧౯౯

అగస్త్యు డింద్రునకు నహుషుభ్రష్టత దెలుపుట.
వ.
అనిన విని యమ్మునీంద్రుండి ట్లనియె నన్నహుషుని మోచివేసరుచున్న మునులతనికడ గోష్టీవినోదంబుల నుండి బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందు జెప్పఁబడి యుండునవి నీకుఁ బ్రమాణభూతంబు లగునే యని యడిగినం బాపనిశ్చయుం డై యతం డమ్మంత్రంబులు బ్రమాణంబులుగావనిన నే నమ్మాట నిషేధించి పూర్వాచార్యులచేత నభినందితంబు లగు మంత్రంబుల నిందించుట యజ్ఞానం బని వివాదంబు సేసిన నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నిన నతనిం గనుంగొని పుణ్యహీనుండును దేజో(హాని)దీనుండును నగుట యుపలక్షించి నీవు పూజనీయు లయిన మహామునుల నిన్ను వహింపంబనిచితి వారలు కొనియాడుమంత్రంబుల గర్హించి తదియుంగాక నన్ను నవమానించితి గావున నింద్ర పదభ్రష్టుండ వై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగంబ వై యుండు మని శాపం బిచ్చి పదంపడి యనుగ్రహించి భవదీయ వంశజాతుం డయి యజాతశత్రుం డవుపెంపు గలిగి యుథిష్ఠరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబులఁబాసి పుణ్యలోకంబు బడయు వాఁడ వనిన దత్క్షణంబ,౨౦౧
క.
స్వర్గ పద భ్రష్టుం డై , దుర్గతికిం బోయె నతఁడు దుశ్టాత్ములకున్
దౌర్గత్యము సుజనులకు, న నర్గళసద్గతియు నగుట యరుదే యెందున్.౨౦౨

ఈవిధంగా ఇంద్రుడంతటివానికే కష్టములు పడక తప్పలేదు.
క.
కావున మీపడినయర,ణ్యావాసక్లేశమునకు నజ్ఞాతవిధిన్
సేవకుల రైనదానికి, నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరై.౨౦౮

అని శల్యుఁడు ధర్మరాజుతో పలికెను.


Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౭

ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము
వ.
క్షమయును దేజంబును నయ్యయి కాలంబులఁ బ్రయోగింప నేరని రాజునకుం బ్రజానురాగ ప్రతాపంబులు లే వను నీయర్థం బితిహాసంబున వినంబడు క్షమా తేజంబులలోన నెయ్యది విశేషంబు దానిని నిర్ణయించి చెప్పుమని బలీంద్రుండు తొల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె.౨౧౬
ఆ.వె.
క్షమయ తాల్చియుండఁజన దెల్లప్రొద్దుఁ దే, జంబ తాల్చి యుండఁజనదు పతికి
సంతత క్షముండు సంతత తేజుండు, నగుట దోష మందు రనఘమతులు
.౨౧౭
వ.
ఎట్లనిన నిత్యక్షమాన్వితుం డయినవానికి భృత్యులు వెఱవక యవమానంబు సేయుదు ర ర్థంబులయం దధికృతుం డైన వాఁ డతిక్రూరదండంబున సర్వజనసంతాపంబు సేయుచు గృహగతం బైన సర్పంబునుంబోలె నెప్పుడు నుద్వేగకరుండగుం గావున గాలోచితంబుగా క్షమాతేజంబులు గల్పించునది యథాకాల కల్పితక్షమాతేజుం డైన వానికి నుభయలోకసిద్ధి యగు నని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది యిట్లనియె.౨౧౮
క.
ఇది తేజంబున కవసర, ముదితక్రోధుండ వగుమ యొక్కించుక దు
ర్మదు లగు సుయోధనాదుల, నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్
.౨౨౦
వ.
అనిన ధర్మరాజిట్లనియె.౨౨౧
భారత ఇతిహాసం లో మనకందరికీ ఏరుకున్నవారికి ఏరుకున్నన్ని నీతులు కుప్పతిప్పలుగా తటస్థపడు తుంటాయి. మనదే ఆలస్యం. రండి మనందరం కలసి రత్నాల్ని ముత్యాల్ని ఏరుకొని భద్రపరచుకుందాం.
Unknown
విరాట పర్వము- ప్రథమాశ్వాసము-౬
ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మములు సెప్పుట
చ.
ధరణిపు చక్కఁ గట్టెదురు దక్కి పిఱుందును గానియట్లుగా
నిరుగెలనం దగం గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యె
వ్వరిదెస నెప్పు డేతలఁపు వచ్చునొ యీతనికంచుఁ జూడ్కి సు
స్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్.౧౨౯

సేవకుడు రాజులదగ్గఱ మెలగాల్సిన విధం గుఱించి చెప్పాడు.
క.
నగళులలోపలిమాటలు, తగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడం బుట్టినఁ బతి విన, నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్.౧౩౦

అంతఃపురం విషయాలు బైటికి చేరవేయకూడదు. తనకు బయట తెలిసిన విషయాలు రాజుకు ఉపయోగపడేవైతే అతనితో చెప్పాలి.
క.
అంతిపురము చుట్టరికం, బెంతయుఁ గీ డంతకంటె నెగ్గు తదీయో
పాంతచరకుబ్జవామన, కాంతాదులతోడిపొందుకలిమి భటునకున్.౧౩౧

అంతఃపురం గొడవలు చాలా సున్నితమైన విషయాలు.అక్కడి స్త్రీలతో పొందుకూడా భటుడైనవానికి నిషిద్ధమైనదే.
ఆ.వె.
ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం,బులును గరుణఁ దమకు భూమిపాలుఁ
డీక తార యెక్కు టెంతటిమన్నన, గలుగువారి కైనఁ గార్య మగునె. ౧౩౨

ఉత్తమమైన ఆసనములు, వాహనములు రాజుగారు తమకు ఇవ్వకుండా వాటిని తమంతట తామేఉపయోగించటం ఎంతటి చనువు గలిగివున్నవారికైనా తగిన కార్యం కాదు.
క.
మన్నన కుబ్బక యవమతి, ద న్నొందిన స్రుక్కఁబడక ధరణీశు కడన్
ము న్నున్న యట్ల మెలఁగిన, యన్నరునకు శుభము లొదవు నాపద లడగున్.౧౩౩

ప్రభువు మన్నన చేసినపుడు పొంగిపోయి, అవమానించినపుడు క్రుంగి పొవటం కాకుండా ఎల్లప్పుడూ ఓకే విధంగా మునుపు వున్నట్లుగానే ఉండేవారికి శుభములు కలుగుతాయి., ఆపదలు తొలగుతాయి.
క.
జనపతి యెవ్వరినైనను, మనుపఁ జెఱుపఁ బూని యునికి మదిఁ దెలియ నెఱిం
గినయేనిఁ దాను వెలిపు, చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్.౧౩౪

ప్రభువు ఎవ్వరిమీదైనా కత్తికట్టిన విషయం తనకు ముందుగా తెలిసినా సరే,దానిని ఎటువంటి మూఢుఢు కూడా ముందుగా బయటపెట్టకూడదు.