Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-6
క.
తగు నిది తగ దని యెదలో, వగవక సాధులకుఁ బేదవారల కెగ్గుల్
మొగిఁజేయు దుర్వినీతుల, కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్.
85

ఇక్కడ నుంచే భారత కథ మొదలవుతుంది.

పాండవులలో అర్జునుని కుమారుడైన అభిమన్యునికి పరీక్షిత్తు అతనికి జనమేజయుడు పుడతారు.ఈ జనమేజయునకు వైశంపాయనుడు చెప్పేకథగా, శౌనకాది మునులకు రోమహర్షణుడు చెప్తున్నట్లుగా భారతం చెప్పబడుతుంది.

జనమేజయుడు ఒకప్పుడు సత్త్రయాగాన్ని చేస్తుండగా దేవతల కుక్క సరమ యొక్క కుమారుడు సారమేయుడనేవాడు ఆడుకుంటూ అక్కడకు వస్తాడు. ఆ సారమేయుడిని జనమేజయుని తమ్ములు శ్రుతసేనుడు,భీమసేనుడు,ఉగ్రసేనుడు అనేనాళ్ళు కొడితే అది అరుచుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకు పిర్యాదు చేస్తుంది. అప్పుడు సరమ జనమేజయునివద్దకు వచ్చి ఇలా అంటుంది.నీ తమ్ముళ్ళు తప్పుచేయని నా కొడుకుని కొట్టారు ఇది అన్యాయం అంటూ. పైన చెప్పిన విషయం చెపుతుంది.
ఇది తగును, ఇది తగదు అని మనసులో ఆలోచించకుండా సాధువులకు పేదవారికి ప్రయత్నంచి చెడు చేసే దుష్టులైనవారికి నిమిత్తమేమీ లేకుండానే వచ్చే భయాలు కలుగుతాయి.ఇది చెప్పి సరమ అక్కడనుంచి అదృశ్యమయిపోతుంది.

భారతప్రారంభం లోనే చెప్పబడిన బంగారం లాంటి సూక్తి ఇది. ఓ ఆణిముత్యం. ఇటువంటి ఆణిముత్యాలు భారతం నిండా ఎన్నో, ఎన్నెన్నో.... మన ప్రయత్నమే తరవాయి.రండి మనందరం కలసి బారతం లోని ఆణిముత్యాలను ఏరి భద్రపరచుకుందాం. మన పిల్లలకీ అందిద్దాం.