Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౬
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కులపుత్ర్రులైనసద్భృ, త్యులకును సత్కార మర్ధితోఁ జేయుదె వా
రలు నీ ప్రస్తవమున ని,మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతురనిన్.
౩౯

మంచి వంశములో పుట్టిన మంచి సేవకులకు కోరికతో సత్కారాలు చేస్తున్నావా? వారు నీ విషయంలో చేయదగువిషయాన్ని బాగుగా తలచి యుద్ధంలో ప్రాణాల్నిసైతం విడిచి పెడతారు.
క.
అనఘా నీ ప్రస్తనమున, నని నీల్గిన వీరభటులపోష్యుల నె
ల్లను బ్రోతె భోద నాచ్ఛా,దనముల వారలకు నెమ్మి తఱుఁగక యుండన్.
౪౦

నీ కారణంగా యుద్ధములో చనిపోయిన వీరభటుల మీద ఆధారపడినవారి నందరికి వారి వారి తిండీ గుడ్డా వగైరాలకి లోటు రాకుండా వారి క్షేమమును సరిగా చూసుకుంటున్నావుగదా.
క.
ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ,ర్పనివారలఁ బగఱవలనివారల ధృతి చా
లనివారల దుర్జనులం, బనుపవుగా రాచకార్యభారము దాల్పన్
.౪౧
రాచకార్యాలందు నియోగించ దగని వారి గురించి చెపుతున్నాడు.