Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౧౨
చ.
అడిచినఁ దిట్టినన్ మఱి మహాపరుషంబులు పల్కి యల్కతోఁ
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు వారలకెగ్గు సేసినం
జెడు నిహముం బరంబు నిది సిద్ధముగావు టెఱింగి భక్తి నె
ప్పుడు ధరణీసురోత్తములఁ బూజలం దన్పుదు నల్గ నోడుదున్.౧౩౩
వ.
నీవు బ్రాహ్మణుండవు నీ వెద్దిసేసిన నీక చను లోకహితుండ నయిననాకు శాపం బిచ్చి లోకంబులకెల్లఁ జెట్ట సేసితి వ దెట్లనిన వేదోక్తంబులయిన నిత్యనైమిత్తిక బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు వేల్వంబడిన హవ్య కవ్యంబులు నా ముఖంబునన దేవ పితృగణంబు లుపయోగింతు రట్టియేను సర్వభక్షకుండనై యశుచి నైనఁ గ్రియానివృత్తి యగుఁ గ్రియానివృత్తియైన లోకయాత్ర లేకుండు నని యగ్ని భట్టారకుండు నిఖిలలోక వ్యాప్తం బైన తన తేజోమూర్తి నుపసంహరించిన.౧౩౯
సీ.
త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమిఁ జేసి క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె
నగ్ని హోత్రములందు నౌపాసనాదిసాయంప్రాత రాహుతు లంత నుడిగె
దేవతార్చనలందు దీపధూపాది సద్విధులు వర్తిల్లక విరతిఁ బొందెఁ
బితృ కార్యములఁ బితృపిండయజ్ఞక్రియ లడఁగె విచ్ఛినంబులై ధరిత్రి
ఆ.వె.
నంత జనులు సంభ్రమా క్రాంతులై మహా,మునులకడకుఁ జనిరి మునులు నమర
వరులకడకుఁ జనిరి వారును వారును, బ్రహ్మ కడకుఁ జనిరి భయము నొంది.౧౪౦
వ.
బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును సకల వ్యవహార విచ్థేదంబును నెఱింగి యగ్ని దేవు రావించి యిట్లనియె.౧౪౧
చ.
ప్రకటితభూత సంతతికి భర్తవు నీవ చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుఁడవు దేవముఖుండవు నీవ లోకపా
వకుఁడవు నీవ యిట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వ భా
రకభువన ప్రవర్తన పరాజ్ఞ్ముఖభావముఁ బొందఁ బాడియే.౧౪౨
వ.
అమ్మహాముని వచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షకుండవయ్యును శుచులయందెల్ల నత్యంత శుచివై పాత్రులయందెల్లఁ బరమ పాత్రుండవై పూజ్యులయం దెల్ల నగ్రపూజ్యుండ వై వేద చోదిత విధానంబులయందు విప్రసహాయుండవై భువనంబుల నడపు మని విశ్వగురుండు వైశ్వానరుం బ్రార్ధించి నియోగించి భృగువచనంబు ప్రతిష్ఠాపించె నట్టి భృగునకుఁ బుత్త్రుండై పుట్టి పరఁగిన.౧౪౩
క.
చ్యవనునకు సుకన్యక కు, ద్భవ మయ్యె ఘనుండు ప్రమతి ప్రమతికి నమృతో
ద్భవ యగు ఘృతాచికిని భా,ర్గవముఖ్యుఁడు రురుఁడు పుట్టెఁ గాంతియుతుండై.౧౪౪
వ.
అట్టి రురుం డను మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకకుం బుట్టినదాని స్థూలకేశుం డను మహాముని నివాసంబునఁ బెరుఁగుచున్న దాని రూపలావణ్యగుణంబులఁ బ్రమదాజనంబులయందెల్ల నుత్కృష్టయగుటం జేసి ప్రమద్వర యన నొప్పుచున్న కన్యక నతి స్నేహంబున వివాహంబుగా నిశ్చయించి యున్నంత.
ప్రమద్వర సర్పదష్టయై చచ్చి మరల బ్రదుకుట
తే.
కన్నియలతోడ నాడుచు నున్నదానిఁ, బాదమర్దితమై యొక్క పన్నగంబు
గఱచెఁ గన్నియలందఱు వెఱచిపఱచి,యఱచుచుండఁ బ్రమద్వర యవనిద్రెళ్లె.౧౪౬