Unknown
ఆది పర్వము-ప్రథమా శ్వాసము-౭
ఉదంకోపాఖ్యానము
తరువాత జనమేజయుడు సోమశ్రవసుడనే పురోహిడితుని సహాయంతో సమర వచనములకు ప్రతిక్రియగా అనేక శాంతిక పౌష్టిక క్రియలను చేయించి సుఖముగా ఉంటాడు. అది అలా వుండగా--

పైల శిష్యుడైన ఉదంకుడు అనే మునివరుడు తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు గారికి మేలు చేయాలనే ఆలోచనతో గురుపత్ని కోరికమేరకు పౌష్యుడనే రాజు దేవి కుండలములను సంపాదించి తెచ్చి ఇవ్వాలనే కోరికతో వనములో ఒక్కడూ వెళుతుంటాడు. అతని కెదురుగా ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న ఒక దివ్యపురుషుని చూచి, అతనిచ్చిన వృషభ గోమయం రుచి చూసి, ఆతని అనుగ్రహం పొంది త్వరగా వెళ్ళి పౌష్యమహారాజును కలుస్తాడు. ఆతని దేవి కుండలములు తన గురుపత్ని కోరిక మేరకు యీయవలసిందని అర్థిస్తాడు. అప్పుడాయన ఇటువంటి మహాత్ముని కివ్వటం తన భాగ్యంగా భావించి, అయ్యా ఆమె ఆ కుండలాల్ని ఇప్పుడు ధరించే వుంది. అంతఃపురానికి వెళ్ళి నామాటగా చెప్పి వాటిని తీసుకోవలసిందని అంటాడు. ఉదంకు డా ప్రకారంగా అంతఃపురానికి వెళ్ళి చూస్తే ఆమె అతని కక్కడ కనిపించదు. తిరిగి వచ్చి రాజు కీ విషయం చెప్పి నీవే వాటిని తెప్పించి యియ్య వలసిందని అంటాడు. అప్పుడా రాజు అయ్యా 'త్రిభువన పూజితుడవైన నిన్ను అశుచి వ' ని ఎలా అనగలను, నా భార్య పరమ పతివ్రత. అశుచులకు కనిపించదు అంటాడు. అప్పుడా ముని తనచే చేయబడిన ఎద్దుపేడను తినడాన్ని గుర్తుకు తెచ్చుకొని, అందుకు పరిహారంగా తూర్పునకు తిరిగి కాళ్ళు చేతులు ముఖం నోరూ వగైరా శుభ్రపరచుకొని ఆ దేవి వద్దకు వెళ్ళి ఆ కుండలాలను ఆమె నుండి తీసుకుంటాడు. ఆమె అప్పుడు తక్షకుడనేవాడు ఆ కుండలాలకోసం ప్రయత్నిస్తున్నాడని, అతనిబారిని పడకుండా రక్షించుకొని వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెపుతుంది. అలానే జాగ్రత్తగా తీసుకొని వెళతానని చెప్పి రాజుగారికి చెప్పి వెళదామని తిరిగి రాజు వద్దకు వస్తాడు. రాజుకు విషయమంతా చెప్పి వెళ్ళివస్తానని అంటే 'పెద్దలు మీరింత దూరం వచ్చి మా దగ్గర భోజనం చెయ్యకుండా ఎలా వెళ్తార'ని బలవంతపెడితే భోజనానికి కూర్చుంటాడు.భోజనం చేస్తుండగా అన్నం లో ఓ వెండ్రుక వస్తుంది. 'అపరీక్షితమైన అన్నాన్ని పెట్టావ'ని కోపించి గుడ్డివాడవవమని శాపం ఇస్తాడు. నీవు స్వల్ప దోషానికే నాకు శాపం యచ్చావు అందుచేత నీకు సంతానం కలగకుండుగాక అని రాజతనికి ప్రతిశాపం ఇస్తాడు. అప్పుడుదంకుడు నేను అనపత్యుడుగా ఉండలేను నీ శాపం ఉపసంహరించుకోమని రాజుని కోర్తాడు. అప్పుడారాజు--
ఉ.
నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పండతి శాంతుఁ డయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్.
100

బ్రహ్మణులది నిండైన మనసు, కాని వారి పలుకు మాత్రం దారుణమైన వజ్రాయుధం వంటిది. ఓ జగన్నుతుడా విప్రులందు ఈ రెండూ సహజసిద్ధమైనవి. అందుచేత విప్రుడు శాపం ఉపసంహరించగలుగుతాడు. కాని రాజులందు ఈ రెండూ వ్యతిరేకంగా వుంటాయి. కాబట్టి రాజుకు శాపం ఉపసంహరించగలిగే సామర్థ్యం ఉండదు. కాబట్టి నేను నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను, దయతో నీ శాపాన్ని నీవు వెనక్కి తీసుకోమంటాడు. సరే స్వల్పకాలం లోనే నీకు శాపవిమోచన జరుగుతుందని చెప్పి తన గురు పత్ని కోరిక తీర్చగలుగుతున్నాను గదా అనే సంతోషంతో వెళ్తుంటాడు.

ఈ పైన వ్రాసిన 100 వ పద్యం అంటే ఎందుకో చెప్పలేను కాని నాకు విపరీతమైన ఇష్టం. కారణం నాకూ తెలియదు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment