Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౧
యయాతి నూతం బడిన దేవయాని నుద్ధరించుట
వ.
ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ఠ యను కన్యక యొక్కనాఁడు కన్యకాసహస్రపరివృత యయి దేవయానీసహితంబు వనంబునకుం జని యొక్కసరోవరతీరంబునఁ దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడ లాడుచున్న నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కలిసిన నొండొరులం గడవఁ గొలను వెలువడు సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠ గట్టికొనిన మఱి దానిపరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యిట్లనియె.౧౩౪
కన్యకాసహస్రపరివృత యయి= వేయిమంది కన్యలను చుట్టనూ కలిగి ఉన్నదై
పరిధానంబులు=వస్త్రములు
సురకరువలిచేతం=సుడిగాలి చేత
ప్రేరితంబై=ప్రేరేపింపబడినవై
కడవఁ=దాటుటకు
క.
లోకోత్తర చరితుం డగు, నాకావ్యుతనూజ నీకు నారాధ్యను నేఁ
బ్రాకటభూసురకన్యక, నీకట్టినమైల గట్ట నేర్తునె చెపుమా
.౧౩౫
లోకోత్తరమైన చరిత్ర కలిగిన శుక్రాచార్యుల కూతురనైన నేను నీకు ఆరాధనీయను. నేను నీ మైల చీరను ఎలా ధరిస్తాననుకొన్నావు. అని దేవయాని శర్మిష్ఠను అడిగింది.
వ.
అనిన శర్మిష్ఠ యి ట్లనియె.౧౩౬
క.
మాయయ్యకుఁ బాయక పని, సేయుచు దీవించి ప్రియము సేయుచు నుండున్
మీయయ్య యేటి మహిమలు, నాయొద్దనె పలుక నీకు నానయు లేదే.౧౩౭

విడిచిపెట్టకుండా మా అయ్యకు మీ అయ్య పనిచేసి దీవించి ప్రియమును చేస్తూ ఉంటాడు. మీ అయ్య మహిమలు నాదగ్గర చెప్పటానికి నీకు సిగ్గెలా లేదే అన్నది శర్మిష్ఠ దేవయానితో.
వ.
నా కట్టిన పుట్టంబు నీకుం గట్టంగాదు గాకేమి యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి శర్మిష్ఠ కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజవాసంబున నుండె.౧౩౮.
ఎగ్గులాడి =నిందించి
ఇలా ఉండగా నహుషాత్మజు డైన యయాతి వేటాడుతూ వేటాడుతూ దప్పిగొని నీటికొఱకై దేవయాని పడియున్న నూతిదగ్గరకు వచ్చి నూతిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆమెను చూచి నీవెవరవు ఎవ్వరిదానవు అని అడుగుతాడు. అప్పుడామె అంతకు పూర్వం వేటకు వచ్చిన అతనిని చూచివున్నకారణంగా అతనిని గుర్తుపట్టి ఇలా అంటుంది.
తరలము.
అమర సన్నిభ యేను ఘోరసురాసురాహవభూమి య్యమరవీరుల చేత మర్దితు లైన దానవులన్ గత భ్రములఁగాఁ దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి త్యమితశక్తిమెయిన్ వెలింగినయట్టి భార్గవుకూఁతురన్.౧౪౨
వ.
దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్న దానను న న్నుద్ధరించి రక్షింపు మనిన నవ్విప్రకన్యకయందు దద్దయు దయాళుండై.౧౪౩

యయాతి ఆమెకు తన దక్షిణహస్తాన్ని చాచి ఆమెను బయటకు తీసి రక్షించి తన దారిని తాను వెళతాడు.

పర్వములు | edit post
0 Responses

Post a Comment