Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౫
దీర్ఘతముని వృత్తాంతము
వ.
మఱి యదియునుంగాక యుచథ్యుండను మునివరునిపత్ని మమత యనుదాని గర్భిణి నభ్యాగతుం డయి బృహస్పతి దేవర న్యాయంబున నభిలషించినఁ దదీయ గర్భస్థుం డయిన పుత్త్రుం డెఱింగి యిది ధర్మ విరుద్ధంబని యాక్రోశించిన వానికి నలిగి బృహస్పతి సర్వభూతేప్సితంబగు యిక్కార్యంబునందు నాకుఁ బ్రతికూలుండ వయితివి కావున దీర్ఘతమంబును బొందు మని శాపం బిచ్చిన వాఁడును దీర్ఘతముండు నాఁ బుట్టి సకల వేదవేదాంగ విదుండయి జాత్యంధుండయ్యును తన విద్యాబలంబునఁ బెద్దకాలంబునకుఁ బ్రద్వేషిణి యనునొక్క బ్రాహ్మణి వివాహం బయి గౌతమాదు లయిన కొడుకులం బెక్కెండ్రం బడసిన నది లబ్ధపుత్త్ర యై తన్ను మెచ్చకున్న నిట్లేల నన్ను మెచ్చవని దీర్ఘతముండు ప్రద్వేషిణి నడిగిన నది యిట్లనియె.
౨౨౭
భార్య తన గొప్పదనాన్ని గుర్తించకపోతే ఎటువంటి భర్తకైనా బాధగానే ఉంటుంది మరి.

తే.
పతియు భరియించుఁ గావున భర్త యయ్యె
భామ భరియింపఁబడు గాన భార్య యయ్యెఁ

బరఁగ నవి మనయందు వీడ్వడియె నిన్ను

నేన యెల్లకాలము భరియింతుఁ గాన.
౨౨౮

కారణాన్ని సవివరంగా చెప్పిందావిడ. మనయందు మన బాధ్యతలు మాఱుపడినవి నేనే నిన్నెల్లకాలం భరిస్తున్నాను కాబట్టి అందావిడ. నిజమే కదా.
ఆ.
ఎంత కాల మయిన నిప్పాట భరియింప, నోప నింక నరుగు మొండుగడకు
ననిన నిర్దయాత్మ లని దీర్ఘ తముఁ డల్గి, సతుల కెల్ల నపుడు శాప మిచ్చె.
౨౨౯

ఇలా శాపమివ్వడం అన్యాయంగానే వుంది మరి. సతులు నిర్దయాత్ములుగా వుండకూడదన్నమాట.
క.
పతిహీన లయిన భామిను, లతిధనవతు లయ్యుఁ గులజ లయ్యును ననలం
కృత లయ్యెడు మాంగల్యర, హితలయ్యెడుఁ గృపణవృత్తి నిదియు మొదలుగాన్
. ౨౩౦

పతులను కోల్పోయిన స్త్రీలు ఇప్పటి నుండీ గొప్ప ధనవంతులయినాగానీ మంచి కులం లో పుట్టిన వారైనా గావీ అలంకరించుకోరాదనిన్నీ మాంగల్యానికి దూరమౌతారనీ నింద్యమగు నడవడిచేత కాలం గడుపుతారనీ శాపమిచ్చాడు.
భారతంలో చాలాచోట్ల ఇలా శాపాలు ఇది మొదలుగా అని చెప్పి ఇవ్వటం తఱచుగానే ఉంటోంది. అంటే దానిని బట్టి అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉండేవో మనం అర్ధం చేసుకోవచ్చన్నమాట.
వ.
అని శాపం బిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి యమ్ముదుకని నెటకేనియుం గొనిపొండని తన కొడుకులం బంచిన వారును నయ్యౌచథ్యు నతివృద్ధు జాత్యంధు నింధనములతో బంధించి మోహాంధు లయి గంగలో విడిచిన నమ్మునియును బ్రవాహ వేగంబునఁ బెక్కు దేశంబులు గడచి చనియె నంత నొక్కనాఁడు బలి యను రాజు గంగాభిషేకార్ధంబు వచ్చినవాఁ డయ్యింధన బంధనంబున నుండియు నుదాత్తానుదాత్తస్వరిత ప్రచయస్వరభేదంబు లేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచుఁ దరంగఘట్టనంబునం దనయున్నదరిం జేర వచ్చినవాని దీరంబుఁ జేర్చి యింధనబంధనంబులు విడిచి మహర్షి మామతేయుంగా నెఱింగి త న్నెఱింగించి నమస్కారంబు సేసి యిట్లనియె. ౨౩౧
మామతేయున్ కాన్=అభిమానునిగా
క.
ఎందుండి వచ్చి తిందుల, కెందుల కేఁగెదు మహామునీశ్వర విద్వ
ద్వందిత నా పుణ్యంబునఁ, జెందితి ని న్నిష్టఫలముఁ జెందినపాటన్. ౨౩౨

యోగక్షేమాలను విచారించి తన కోరికను తెలియజేసుకుంటున్నాడా రాజు.
వ.
ఏ నపుత్త్రకుండ నై యెవ్విధంబునను సంతానంబు వడయ నేర కున్నవాఁడ నాకు సంతానదానంబు దయసేయు మని యతనిం బూజించి తన పురంబునకుం దోడ్కొని చని ఋతుమతియై యున్న తన దేవి సుదేష్ణ యనుదాని సమర్పించిన నదియును. ౨౩౩

సంతాన దానం చేయమని ఆ రాజు ఆ మునీశ్వరుని ప్రార్థిస్తాడు. పాండవుల జననాని కీవిధంగానే మార్గం ఏర్పడిందన్నమాట.
ఆ.
పుట్టుఁజీకు వృద్ధుఁ బూతిగంధానను, వేదజడునిఁ బొంద వెలది రోసి
తన్నపోనిదానిఁ దన్విఁ గోమలిఁ దన, దాదికూఁతుఁ బంచెఁ దపసికడకు. ౨౩౪

పాపం ఆ రాణీ కూడా తనబదులుగా తనను పోలి వుండే దాది కూతుర్ని ఆ పనికి నియమిస్తుంది. ఇదే పద్ధతి తరువాత విదుర జననంలో కూడా పునరావృతమౌతుంది.
వ.
ఆ దీర్ఘ తముండును దానివలనఁ గాక్షీవదాదుల నేకాదశ పుత్త్రులం బుట్టించిన బలియును సంతసిల్లి వీరలు నా పుత్త్రకులే యనిన నమ్ముని విని కిట్లనియె. ౨౩౫

ఆయనకా సందేహం ఎందుకొచ్చిందో మరి.
క.
వీరలు నీ కులపుత్త్రులు, గారు భవద్దేవిదాదిగాదిలిసుతకున్
భూరిభుజ యుద్భవించిన, వారు మహాధర్మపరు లవారితసత్త్వుల్. ౨౩౬

నీ పిల్లలు కారు . నీ భార్య దాది కూతురు సంతానం అని ఉన్నమాట చెప్పేసేడాయన. ఆ సంతానం మహాధర్మపరులు కూడానంట.
వ.
అనిన నబ్బలి సంతానార్థి గావున వెండియు నమ్మునిం బ్రార్థించి తత్ప్రసాదంబు వడసి సుదేష్ణ నియోగించిన దీర్ఘ తముండును దాని యంగంబు లెల్ల నంటిచూచి వంశకరుండును మహాసత్త్వుండును నయ్యెడు కొడుకు నీకుం బుట్టు నని యనుగ్రహించిన దానికి నంగరా జను రాజర్షి పుట్టె నివ్విధంబున నుత్తమ క్షత్త్రియ క్షేత్త్రంబులందు ధర్మ మార్గంబున బ్రాహ్మణుల వలనం బుట్టి వంశకరు లయిన క్షత్త్రియు లనేకులు గలరు. ౨౩౭

ఈ కథ అంతా పాండవ ధార్త్రరాష్టుల జననాలకు మూలమైనది , భీష్ముడు సత్యవతికి చెపుతున్నదీను.
క.
కావున నియతాత్ము జగ, త్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణుఁ బడయం
గా వలయు వాఁడు సంతతి, గావించు విచిత్ర వీర్యకక్షేత్త్రములన్.౨౩౮.

వ.
అనిన భీష్ము పలుకులకు సంతోషించి సత్యవతి----------
పర్వములు | edit post
2 Responses
  1. Anonymous Says:

    great work sir,
    Put Followers in your blog...
    I want to follow your blog......
    Keep It Up


  2. Unknown Says:

    మీ కోరిక మేరకు ఈ బ్లాగులో ఫాలోయర్సును ఉంచాను. మీ అబిమానానికి నా ధన్యవాదములు.


Post a Comment