Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట(కొనసాగింపు)
క.
అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్.
౯౨

యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశకరుడవుతాడనీ నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.
క.
భూరిగుణు నిట్టికుల వి, స్తారకు దారకు నుదార ధర్మప్రియు ని
ష్కారణమ తప్పఁ జూడఁగ, సారమతీ చనునె నాఁటి సత్యము గలుగన్. ౯౩

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?
చ.
ుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు
సూడఁగన్.౯౪

తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.
క.
వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
౯౫

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.
తే.
సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు
. ౯౬

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.
క.
కావున సత్యము మిక్కిలి , గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ, గావింపుము గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్.
౯౭
క.
క్షత్త్రవరుఁ డైన విశ్వా, మిత్త్రునకుఁ బవిత్రమైన మేనకుకున్ స
త్పుత్త్రి నయి బొంకువలుకఁగ, ధాత్త్రీతల నాధ యంత ధ ర్మేతరనే
. ౯౮

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.
వ.
అనిన శకుంతలపలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డిట్లనియె.
క.
ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్
మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే.
౧౦౦

నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?
క.
వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,
దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ ౧౦౦ --(పాఠాంతరము)

ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా!!
క.
పొడువునఁ బ్రాయంబునఁ గుఁ, గడిఁదిబలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు, నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందరు నగగాన్. ౧౦౧

పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా.
వ.
ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు మయుక్తంబు లయినపలుకులు పలుకక నీ యాశ్రమంబునకుం బొమ్మనిన శకుంతల యత్యంత సంతాపితాంతఃకరణ యై. ౧౦౨

ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపాన్నొందిన దై.
మధ్యాక్కర.
తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ
నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. ౧౦౩

పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.
ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.
వ.
ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. ౧౦౪
చ.
గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 105

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును తీసుకువచ్చింది.
పర్వములు | edit post
0 Responses

Post a Comment