Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-10
క.
ధృతి సెడి వేఁడెడువానిని, నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు,ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 274

ఏకచక్రపురంలో బకాసురుని కాహారంగా కుంతి తనకుమారులలో ఒకరిని బ్రాహ్మణబాలునికి బదులుగా పంపిస్తానన్నపుడు ఆ గృహస్థు కుంతితో పై విధంగా అంటాడు. కథలోకి మనం వెళితే--

భీముడు కుంతితో ఇలా అంటాడు.
ఆ.
ఎఱిఁగి నాకుఁ జెప్పుఁడిదియేమి యెవ్వరి, వలన నింత య్యె వగవ నేల
యెంతకడిఁది యైన నిది యేను దీర్చి యీ, విప్రునకుఁ బ్రియంబు విస్తరింతు
. 246
వ.
అనిన గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దనబాంధవులు విన ని ట్లనియె. 247
పరిదేవనంబు=రోదనము
క.
నలసారము సంసార మ, ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం

చలము పరాధీనం బిం, దులజీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్.248
నలసారము=తృణమువంటి సారము గలది
ఈ జీవితం సారం లేనిది, దుఃఖాన్ని కలిగించేది, భయానికి స్థానం, చంచలమైనది, పరాధీనమైనది --తత్త్వవేత్తలయిన వారు దీనిని ఎలా నమ్ముతారు?
క.
ఆదిని సంయోగవియో, గాదిద్వంద్వములు దేహి యగువానికి సం
పాదిల్లక తక్కవు పూ, ర్వోదయకర్మమున నెట్టియోగికి నయినన్.
249
మొదటగా సంయోగవియోగాలనే ద్వంద్వాలు దేహికి తప్పవు. ఎటువంటి యోగికైనా సరే పూర్వజన్మకర్మలవల్ల ఇవి తప్పవు.
తరువోజ.
ఏనును బ్రజలును నీధర్మసతియు నేయుపాయంబున నిబ్బారిఁ గడవఁ
గానేర్తు మెయ్యది గర్జమిందుండఁగా దేగుదమయొండు గడ కని ముంద
రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది యిట్టి దారుణ మిమ్మెయిఁ జేయఁ
గా నున్న విధి యేల కడవంగ నిచ్చుఁ గర్మవిపాకంబు గడవంగ లావె. 250

నేను నాపిల్లలు యీ నాభార్య యీ ఆపదనుంచి ఏ ఉపాయంతో గట్టెక్కగలం? ఇప్పుడేం చేయాలి ? మనం ఇక్కడుండొద్దు ఎక్కడికైనా వెళదామని నే ముందరే చెప్పాను, కాని యిది వినలేదు. ఇటువంటి దారుణం జరగాల్సి ఉండగా విధి ఎలా తప్పిస్తుంది? కర్మను తప్పించుకోవటం ఎవరి తరం !
సీ.
మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై ధర్మచారిణి యగుదాని వినయ
వతిఁ బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు భక్ష్యంబ వగు మని పనుప నేర్తు
ధర్మాభివృద్ధిగాఁదగు వడువునకు నీ నిల్లడ బ్రహ్మచే నిడఁగఁబడిన
యిక్కన్య యతిబాల యిం దుద్భవం బగు దౌహిత్రలాభంబు దలఁగ నెట్లు
ఆ.
దీనిఁ బుత్తు మఱి మదీయపిండోదక, నిధిఁ దనూజుఁ గులము నిస్తరించు
వానిఁ బితృగణంబువలని ఋణంబుఁ బా,చినమహోపకారిఁ జిఱుతవాని. 251
మంత్రయుక్తముగా నన్ను పెళ్ళాడి నాకు సహధర్మచారిణి యై వినయశీలి, పుత్త్రవతి, అనువ్రత అయిన ఈమెను ఆ రాక్షసుని కాహారంగా ఎలా పంపను? ధర్మాభివృద్ధి కాగా నీ వడువునకు బ్రహ్మచే భార్యగా నీబడిన యీ కన్యను మనుమలనిచ్చే దానిని అతి బాలను ఎలా పంపించను ? నాకు తిలోదకదానాలు వదలాల్సిన వాడు కులదీపకుడు అయిన చిన్నకుఱ్ఱవానిని ఎలా పంపించగలను.
ఆ.
ఎట్టు సూచి చూచి యిది పాప మనక య, య్యసురవాతఁ ద్రోతు నదయవృత్తి
నరిగి యేన యిప్పు డసురకు నాహార, మగుదు వారిఁ బుచ్చ నగునె నాకు. 252

చూచి చూచి ఈ పాపం నే చోయలేను. నేనే ఆ అసురకు ఆహారంగా వెళతాను
వ.
అని యాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె. 253
పర్వములు | edit post
0 Responses

Post a Comment