Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౧౩
వ.
దాని నెఱింగి కరుణాకలిత హృదయులై గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖపాల భరద్వాజ వాలఖిల్యోద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులును బ్రమతియు రురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి వ్యపగత ప్రాణయై పడియున్న యక్కన్యకం జూచి దుఃఖితులై యుండ నచ్చోటనుండ నోపక రురుండు శోకవ్యాకుల హృదయుండై యేకతంబ వనంబునకు జని.౧౪౭
వ్యపగత=పోయిన
చ.
అలయక యేన దేవయజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్
సలుపుదునేని నేన గురుసద్ద్విజ భక్తుఁడనేని నేన య
త్యలఘు తపస్వినేని దివిజాధిప భూసురులార మన్మనో
నిలయకు నీ ప్రమద్వరకు నిర్విష మయ్యెడు నేఁడు మీదయన్.148
చ.
అపరిమితాజ్ఞఁ జేసియు మహాపురుషుల్ విషతత్త్వసంహితా
నిపుణులు మంత్ర తంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విష
వ్యపగత మైనజీవ మది వచ్చునుపాయము సేయరొక్కొ నా
తఫముఫలంబు నధ్యయనదాన ఫలంబులు నిత్తువారికిన్.149

వ.
అని దీనవదనుండై యాక్రోశించువానికి నాకాశంబుననుండి యొక్క దేవదూత యిట్లనియె నయ్యా కాలవశంబయిన నెవ్వరికిం దీర్పఁ దరంబు గా దొక్క యుపాయంబు గలదు చేయనోపు దేనిఁ జెప్పెద వినుము నీ యాయుష్యంబునందర్ధం బిక్కన్యకిమ్మనిన రురుం డట్ల చేయుదు నని తన యాయుష్యంబునం దర్ధం బక్కన్యక కిచ్చిన నక్కోమలి దొల్లింటికంటె నధికశృంగార సమన్వితయై విష నిర్ముక్త యయ్యె నట్లు దేవదూత ధర్మరాజానుమతంబునఁ దన చెప్పిన యుపాయంబునం బ్రమద్వరకను బంచత్వంబువలనం బాపె రురుండును దాని వివాహంబై యిష్టోపభోగంబుల ననుభవించుచునుండి.౧౫౦

నిర్ముక్త =వదలిపెట్టబడినది
పంచత్వంబు=మరణము
ఆ తరువాత రురుడు తన భార్య కపకారము చేసిన పాములకు అలిగి పాములన్నిటినీ వెదకి వెదకి మరీ ఓ కర్రతో కొట్టి చంపడం మొదలుపెట్టాడు. అలా ఓ రోజున డుండుభం అనే పేరుగల పామును కొట్టి చంపబోతుండగా ఆ పాము భయపడి అతనితో
మత్తకోకిలము
ఏమికారణ మయ్య పాముల కేలయల్గితి వీవు తే
జోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు నావుడుం
బాము లెగ్గొనరించె మత్ప్రియభామ కేను రురుండ ను
ద్దామ సత్త్వుఁడ నిన్ను నిప్పుడ దండతాడితుఁ జేసెదన్.౧౫౩
ఇలా అనగానే ఆ డుండుభము ఒక మునిగా ప్రత్యక్షమవుతాడు. రురుడు అతని వివరం అడగ్గా తన పేరు సహస్రపాదుడనీ తాను తన సహాధ్యాయుడు ఐన ఖగముఖుడు అగ్నిహోత్ర గృహంలో ఉండగా పరిహాసం కోసమని ఓ చచ్చిన పాముని అతని మెడలో వేశాను. అప్పుడాతడు దానికి కోపించి నిర్వీర్యమైన పాముగా అయ్యేలా నాకు శాపమిచ్చాడు. శాపవిమోచనం చెప్పమని కోరగా రురుని వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. అతనింకా ఇలా అన్నాడు.౧౫౬
ఉ.
భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు ను త్తమ
జ్ఞానము సర్వభూతహితసంహిత బుద్ధియుఁ జిత్త శాంతియున్
మాన మద ప్రహాణము సమత్వము సంతత వేదవిధ్యను
ష్ఠానము సత్యవాక్యము ధృడవ్రతముం గరుణాపరత్వమున్.౧౫౭
ప్రహాణము =త్యజించుట
వ.
అయ్యా నీవు బ్రాహ్మణుండవు భృగువంశ సముత్పన్నుండవు సర్వగుణసంపన్నుండ విది యేమి దొడంగి తిట్టి దారుణక్రియారంభంబు క్షత్రియులకుంగాక బ్రాహ్మణులకుం జనునే బ్రాహ్మణు లహింసాపరు లొరులు సేయు హింసలు వారించు పరమ కారుణ్యమూర్తులు జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందుఁ గద్రూ శాపంబుననయ్యెడు సర్పకుల ప్రళయంబును భవత్పితృశిష్యుం డయిన యాస్తీకుండను బ్రాహ్మణుండు కాఁడె యుడిగించె నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునం దుపశమనబుద్ధి పుట్టించె ననిన విని శౌనకాది మహామును లక్కథకున కిట్లనిరి.158
ఆ.వె.
ఒరులవలనఁ బుట్టు నోటమియును నెగ్గుఁ, బొరయకుండ నరసి పుత్రవరులఁ
దగిలి కాచునట్టి తల్లి సర్పములకు, నేల యలిగి శాప మిచ్చెనయ్య.
ప్రళయము=నాశమును
ఓటమి=అవమానము
ఆది పర్వము ప్రథమాశ్వాసము సమాప్తము.
పర్వములు | edit post
0 Responses

Post a Comment