Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౧
మ.
వివిధోత్తుంగతరంగఘట్టన చల ద్వేలావనై లావలీ
లవలీలుంగలవంగసంగతలతాలాస్యంబు లీక్షించుచున్
ధవళాక్షుల్ సని కాంచి రంత నెదురం దత్తీర దేశంబునం
దవదాతాంబుజఫేనపుంజనిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్.౩౦
కద్రూవినతలు కశ్యప ప్రజాపతి భార్యలు. ఆయన వలన కద్రువకు వేవురు కొడుకులు(సర్పములు), వినతకు అనూరుడు, గరుత్మంతుడు అనే ఇద్దరు కొడుకులు కలుగుతారు. అనూరుడు తన తల్లి అండాన్ని తొందరపడి అణచటం వల్ల సగము దేహంతో పుట్టినవాడై తల్లికి సవతికి దాసివి గమ్మని శాపం ఇస్తాడు. తరువాత అనూరుడు సూర్యుని రథసారథిగా వెళ్ళిపోతాడు.
కద్రూవినతలు ఓ రోజు ఉచ్ఛైశ్రవమనే ఒక అతి తెల్లని అశ్వరాజాన్ని చూస్తారు. వారిద్దరూ మాటలలో ఉన్నపుడు కద్రువ వినతతో చూజు ఆ అశ్వం పూర్తిగా తెల్లనిదైనా దాని తోక నల్లగా ఉంది కదా అంటుంది. వినత నీవు ఎలా చూచావో కాని అది మహాపురుషుని కీర్తి వలె పూర్తిగా తెల్లగానే ఉంది, తోకతో సహా అంటుంది. అప్పుడు వారిరువురు ఒకరి కొకరు ఓడితే దాసిగా ఉండేట్లుగా పందెం కాసుకున్నారు.అప్పుడు వినత దగ్గరగా వెళ్ళి చూద్దామంటే కద్రువ ఈ రోజు పతి శుశ్రూషకు వేళ ్యింది గాన రేపు చూద్దామని వాయిదా వేస్తుంది.ఇంటికి తిరిగివచ్చాక
సీ.
కద్రువ కొడుకుల కడ కేగి యేను మి మ్మందఱ వేఁడెద నన్నలార
నా పంపు సేయుండు నన్ను రక్షింపుఁడు కామచారులకు దుష్కరము గలదె
యొడలు తెల్లని తురగోత్తమువాలంబు నల్ల సేసితి రేని నాకు దాసి
యగు మనవినత మీరట్లు సేయనినాఁడు దానికి మఱి యేను దాసి నగుదు
ఆ.వె.
జంటపన్నిదంబు సఱచితి మిట్లుగా, ననినఁ బాము లెల్ల ననయ మిదియుఁ
దల్లి పనిచె నని యధర్మువుసేయంగ, నగునె యెఱుక గలరె మగువ లెందు.౩౪
వ.
అని యందఱుఁ దమలో విచారించి యధర్మారంభమునకు సుముఖులు గాక యున్నఁ గద్రువ కోపోద్దీపితముఖియై.
క.
అనుపమముగ జనమేజయు, డనుజనపతి సేయుసర్పయాగనిమిత్తం
బునఁ బాములు పంచత్వము, సనియెడు మని యురగములకు శాపం బిచ్చెన్.౩౬
వారిలో కర్కోటకు డనేవాడు ఉచ్ఛైశ్రవం తోకను చుట్టుకొని ఉండి నల్లగా కనిపించేలా చేస్తాడు. అది చూచి వినత పందెం ఓడిపోయానని ౫౦౦ సంవత్సరములు కద్రువకు దాసిగా మెలగుతుంది. అప్పుడు రెండవ అండాన్నించి వినతకు గరుత్మంతుడు పుడతాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment