Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-1
భారత మహిమము

వ.
ఆ వైశంపాయనుండును నఖిలలోకవంద్యుండయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారముసేసి విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి.

సీ.
కమనీయధర్మార్ధ కామమోక్షములకు నత్యంత సాధనంబయిన దాని
వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్న వారల కభిమత శుభకరం బయిన దాని
రాజులకఖిల భూరాజ్యాభివృద్ధినిత్యాభ్యుదయ ప్రదం బయిన దాని
వాఙ్మనఃకాయప్రవర్తితానేక జన్మాఘనిబర్హణం బయిన దాని
ఆ.వె.
సత్యవాక్ప్రబంధ శత సహస్రశ్లోక, సంఖ్య మయిన దాని సర్వలోక
పూజ్య మయినదాని బుధనుత వ్యాస మ,హాముని ప్రణీత మయినదాని.౯
తవిలి= ఆసక్తి కలిగి
అఘనివర్తకంబు=పాపనివర్తకము

ధర్మార్థ కామమోక్షాలకి సాధనం, వినేవారికి శుభాల్నిచ్చేది, రాజులకు భూరాజ్యాభివృద్ధినిచ్చేది, వాక్ మనఃక్కాయములచే చేయబడిన అనేక పాపాల్ని నివర్తింప జేయగలిగేది, లక్షశ్లోకాత్మకమైనది, సకల లోకాలలో పూజింపబడేది, వ్యాస ప్రణీతమయినదీ ఈ మహాభారతము.
శా.
ఆయుష్యం బితిహాస వస్తు సముదాయం బై హికాముష్మిక
శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభాసేవ్యంబు లోకాగమ
న్యాయైకాంత గృహంబు నాఁ బరఁగి నానావేద వేదాంత వి
ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భార తాఖ్యానమున్.౧౧
ఇతిహాసము=పూర్వకథలనెడి
ఆఖ్యానమున్=కథను
ఆయుస్సును పెంపొందించగలిగేది, పూర్వకథల సముదాయంతో కూడి ఐహికాముష్మిక శ్రేయాల్ని కలుగజేయటానికి కారణమైనది, ఉత్తమ సభా సేవ్యమయినది, ఆగమశాస్త్రాలకు గృహము వంటిదిగా ప్రసిద్ధినొంది - అన్ని వేదవేదాంతవిద్యల కాటపట్టయినట్టి మహాభారత కథను చెప్పడం మొదలుపెట్టాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment