Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౪
పాంచాలీ పాండవులు తమ మెలంగవలయుపనుల నిశ్చయించుకొనుట.
పాండవులు విరాటుని కొలువులో తమ అజ్ఞాతవాస కాలాన్ని గడపాలని నిర్ణయించుకొని వారందరూ ఈ క్రింది పేర్లతో వ్యవహరింప బడాలని అనుకుంటారు.
ధర్మరాజు- కంకుడు
భీమసేనుడు-వలలుడు
అర్జునుడు-బృహన్నల
నకులుడు-దామగ్రంథి
సహదేవుడు-తంత్రీపాలుడు
ద్రౌపది-మాలిని
వీరందరూ పూర్వం ధర్మరాజు ఆస్థానంలో పనిచేసేవారమని కూడా చెప్పుకుంటారు.
(ధర్మరాజు ఇక్కడ అబద్ధం ఆడాడు గదా అని నాకో చిన్న అనుమానం-ఎవరైనా తీర్చగలిగితే బాగుణ్ణు)

ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మంబు లెఱింగించుట
ఈ సేవా ధర్మాలు సార్వకాలికాలు మరియు సేవలు చేసే ఉద్యోగులందరికీ అనుసరణీయాలు అనిపిస్తుంది.
క.
తగఁ జొచ్చి తనకు నర్హం, బగునెడఁ గూర్చుండి రూప మవికృత వేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన, జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్.౧౨౧

తన ఊద్యోగానికి అర్హమైన చోటనే కూర్చుని రూపం ఎంతోకొంతైనా వికృతంగా మార్చుకొని సమయాన్నెఱిగి సేవిస్తే అటువంటి ఉద్యోగి పట్ల యజమాని ప్రసన్నంగా ఉంటాడట.
క.
నరనాథుఁ గొలిచి యలవడ, దిరిగితి నా కేమి యనుచు దేఁకువ లేక
మ్మరియాద దప్పమెలగినఁ, బురుషార్థంహబునకు హాని వుట్టక యున్నే.౧౨౨
తేకుఁవ=భయము

నేను రాజుగారిదగ్గర ఉద్యోగం చేస్తున్నా నాకేవి టనుకుని మర్యాద తప్పి ప్రవర్తిస్తే మొత్తం ఉద్యోగానికే మోసం వస్తుంది.
ఉ.
రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్టఁ గూడ దే
యోజ నృపాలుఁ డాకృతికి నొప్పగువేషము లాచరించు నే
యోజ విహారముల్ సలుప నుల్లమునం గడువేడ్క సేయు నే
యోజ విదగ్ధు డై పలుకు నొడ్డులకుం దగ దట్లు సేయఁగన్.౧౨౩

రాజుగారింటెదురుగా మనం ఇల్లు కట్టుకోకూడదు. రాజు గారు ఏయే సమయాల్లో ఏయే విధంగా మనం ప్రవర్తిస్తే అనుకూలు డవుతాడో అయా సమయాల్లో ఆయా విధంగా ప్రవర్తించాలి .
క.
పుత్రులు పౌత్రులు భ్రాతలు, మిత్రు లనరు రాజు లాజ్ఞ మీఱిన చోటన్
శత్రులకాఁ దమయలుకకుఁ, బాత్రము సేయుదురు నిజశుభస్థితిపొంటెన్.౧౨౪

ముఖ్యమైన విషయం.రాజులు తమ ఆజ్ఞను మీరినవారిపట్ల చాలా కఠినంగా వుంటారు. కొడుకులైనా, మనవలైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా సరే లెక్కచేయకుండా తమ ఆగ్రహానికి పాత్రులను చేస్తుంటారు సుమా.
పర్వములు | edit post
2 Responses
  1. Anonymous Says:

    నమస్కారం.

    చిన్న సందేహం - రాజ గ్రుహంబు కంటె అభిరామముగ ఇల్లు కట్ట......ఈ పద్యం తాత్పర్యంలొ మీరు రాజు ఇంటి ఎదురుగా ఇల్లు కట్టగూడదు అని చెప్పారు. ఎక్కడ ఇల్లు కట్టిన, రాజు ఇల్లు కంటే గొప్పగా వుండ కూదని కదా అర్ధం??? తప్పుంటె మన్నించండి, తెలుసుకుందామని మాత్రమె వ్రాసాను.

    నిమ్మగడ్డ చంద్ర శేఖర్ chandrasekhar67@rediffmail.com


  2. ధర్మరాజు తన పేరు మార్చుకొని అసత్యం చెప్పుటకు మొదట ఒప్పుకోలేదు..ఈ విషయమై ద్రౌపది ఒక భార్య తన భర్త కి ఎన్ని పేర్లయిన పెట్టొచ్చని చెప్పి తనకు కంకు భట్టు అని నామకరణం చేసినది. భార్య నామకరణం చేసినది కాబట్టి ఆ పేరును ఎక్కడైనా చెప్పుకోవొచ్చు..
    ఇది నేను ఒక మహాభారత కథ లో చదివినదే...


Post a Comment