Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౨
శల్యుఁడు పాండవుల జూడ నుపప్లావ్యంబునకు వచ్చుట
తే.
మేలు చేసితి రొక్కరి మెచ్చి వారి, కోర్కి దీర్చుట పెద్దలగుణమె కాదె
యది మదీయచిత్తమునకు హర్ష కరమ, తివిరి ొక్కటి వేఁడెద నవధరింపు.౧౦౯

శల్యుడు నకుల సహదేవులకు మేనమామ అవుతాడు. యుద్ధప్రారంభంలో పాండవులను చూద్దామని , అవసరం అయితే వారికి సహాయం చేద్దామని వస్తూండగా దుర్యోధనుడు అది తెలిసికొని అతడు వచ్చే మార్గంలో అతనికి ఎన్నో సదుపాయాలు తాను ప్రచ్ఛన్నంగా వుంటూ కలగజేస్తాడు.శల్యుడు పాపం అవన్నీ పాండవులే తనకోసం ఏర్పాటు చేసారనుకుంటాడు. ఆసమయంలో దుర్యోధనుడు అతనికి కనిపించగా ఓ వరం కోరుకోమని అంటాడు శల్యుడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని తన పక్షంలో చేరమని అడగ్గా అలాగే నని వరం ఇస్తాడు. తరువాత పాండవుల్ని కలసికొని శల్యుడు జరిగిన విషయం అంతా ధర్మరాజుకు వివరిస్తాడు. అప్పుడు ధర్మరాజతనితో పై విధంగా అంటాడు.
వ.
పార్థునకుఁ గృష్ణుండు సారథ్యంబు సేయువాఁ డై యున్నవాఁడు. కర్ణుండు పార్థుతో నెప్పుడు మచ్చరించుచునుండు వీరిరువురకు సంగ్రామం బైనయపుడు కృష్ణునకుఁ బ్రతిసారథ్యం బొనరింప మీరకాని యక్కడం దక్కొరుండు లేఁడు కావున నవశ్యంబును మీకుం గర్ణసారథ్యంబు కర్తవ్యంబు గాఁగలయది సమరసమయంబున నిరాకరించి పలికి కర్ణుచిత్తంబునకుం గలంక పుట్టించి పార్థు రక్షింపవలయు నకృత్యం బని యనుమానింపక మత్ప్రార్థనంబున నెల్లభంగుల నివ్విధంబనుష్ఠింప వలయునని యభ్యర్థించిన సమ్మతించి శల్యుండిట్లనియె.౧౧౦
అకృత్యం=చేయరానిది(దోషము)
(ఇక్కడ కూడా ధర్మరాజు అధర్మానికి పాల్పడ్డటయిందిగదా అని ఓ సందేహం నా చిన్న బుర్రకి- ఎవరయినా ఈ సందేహం కూడా తీరిస్తే బాగుంటుంది గదా)

అలా శల్యుడు ధర్మరాజుకు మాట యిచ్చిన తరువాత కర్ణుడు ఆరోజు సభలో ఆడినమాటల వలన తన మనసు బాగా నొచ్చుకుందని చెప్పి బాధపడవొద్దు కష్టాలు పెద్దపెద్ద వాళ్ళకే తప్పలేదు మనమనగా నెంత ఇంద్రుడంతటివాడికే తప్పలేదు అంటూ ఇలా అంటాడు.
క.
వాసవుఁడు తొల్లి నిజకాం,తా సహితముగాఁగ నధికదైన్యము వొందెన్
మీ సంపద పెద్దయె విధి, చేసినగతిఁ బడయకుండ శివునకు వశమే.౧౧౬

అలా అనగానే ఆ వృత్తాంతాన్ని చెప్పమని ధర్మరాజడుగుతాడు.అప్పుడు వృత్తాసుర వధని గురించి శల్యుడు ధర్మరాజుకు చెప్తాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment