Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౫
విదురుడు ధృతరాష్ట్రుని విడిచి పాండవులయొద్దకు పోవుట
తే.
కార్యగతుల తెఱఁగు కలరూపు సెప్పిన, నధికమతులు దాని నాదరింతు
రల్పకార్యబుద్ధు లగువారలకు నది, విరసకారణంబు విషమపోలె.

కార్యగతుల ఉన్నరూపు చెప్పినపుడు బుద్ధిమంతులు దానిని అదరిస్తారు. బుద్ధిలేనివారికి అది విషం లాగా విరసకారణం అవుతుంది.

పాండవులు వనవాసానికి వెళ్ళిన తరువాత ధృతరాష్ట్రుడు విదురునితో ఇప్పుడు మనం చేయాల్సిన కార్యం ఏమిటని అడిగితే
దానికతడు పాండవులని వెనక్కు పిలిచి వారి రాజ్యం వారికిచ్చివేయటం మంచిదంటాడు. దానికి ధృతరాష్ట్రుడంగీకరించక విదురుడిని నీవు పాండవ పక్షపాతివి మా క్షేమం కోరేవాడివి కావు. అందుచేత వారిదగ్గరకే పొమ్మంటాడు. అప్పుడు విదురుడు పాండవులవద్దకు వచ్చి తాను ఉభయపక్షములవారికి జగమునకంతటికి మంచిదైన విషయం చెబితే అది సర్వజనరుచికరమైన ఆహారము రోగమున్నవాడికి ఎలా అరుచికరం అవుతుందో అలా అది అతనికి అరుచికరం అయ్యింది అటూ పై విధంగా అంటాడు.

ధృతరాష్ట్రుడు విదురుడు పాండవుల దగ్గఱ ఉండటం తెలుసుకొని అతనిని విడిచి వుండలేక కామ్యక వనానికి వెళ్ళి అతనిని తిరిగి తీసుకుని రమ్మని సంజయుని చేత కబురంపి అతడిని వెనక్కి తిరిగి రప్పించుకుంటాడు.దుష్టచతుష్టయం పాండవులను అడవికి వెళ్ళి అక్కడే యుద్ధం చేసి వారిని నాశనం చేద్దామని సన్నద్ధులవుతుంటే ఆ విషయం తెలిసిన కృష్ణద్వైపాయనుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి వారిని వారించమని చెప్తాడు.

ధృతరాష్ట్రునికి వ్యాసుఁ డింద్రసురభి సంవాదం సెప్పుట
వ్యాసుడు ధృతరాష్ట్రునితో
ఆ.
ఎల్ల నెయ్యములకుఁ దల్లిదండ్రులయందు, సుతులవలని నెయ్య మతిశయంబు
ధనము లెంత కలిగినను సుతరహితుల, కెమ్మెయిని మనః ప్రియము లేదు.౮౧

అనిచెప్పి ఇంకా ఇలా అంటాడు.
క.
సుజనులసహవాసంబునఁ, గుజనులుసద్ధర్మ మతులగుట నిక్కము ధ
ర్మజునొద్దనుండి నీయా,త్మజుఁడు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్.౮౮

అని అలా చేయమంటే ధృతరాష్ట్రుడు వ్యాసమునీంద్రునే దుర్యోధనునకు చెప్పమంటాడు. వ్యాసుడు మైత్రేయుడనే మునీశ్వరుడు వచ్చి దుర్యోధనునికి బోధ చేస్తాడని చెప్తాడు.
మైత్రేయుడు అక్కడికి వచ్చి దుర్యోధనునితో భీముని పరాక్రమం గురించి చెపుతూ బకుడు, హిడింబాసురుడు, జరాసంధుడు మొదలైన వారిని భీముడు చంపేడు అతనిని నీవు గెలవలేవు పాండవులతో సఖ్యంగా ఉండమంటాడు.
మాత్రేయుండు దుర్యోధనుని శపించుట
వ.
వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయులు జరామరణవంతులైన వారిం జెనకి యెట్లు జీవింతురు నీవు వారితో నొడంబడి యుండు మిది కార్యం బనిన మైత్రేయు పలుకు లాదరింపక పాదాంగుష్టంబున నేల వ్రాయుచు బాహువెత్తి దొడలు సఱచి నగుచున్న యా దుర్యోధనుం జూచి మైత్రేయుండలిగి యీయపరాధంబున నావహంబగు నందు భీముగదాఘాతంబున నీయూరు భగ్నం బయ్యెడు మని శాపంబిచ్చిన---౧౦౩
పర్వములు | edit post
0 Responses

Post a Comment