Apr
04
Unknown
అరణ్య పర్వము-ప్రఠమాశ్వాసము-౬

ద్రౌపది శ్రీకృష్ణునితో దనపరిభవంబు సెప్పి దుఃఖించుట
వ.
అఖిలరాజలోక పరివృతుం డయి యున్న నారాయణు నొద్దకు వచ్చి ద్రుపదరాజపుత్రి ముకుళితకరాంబుజ యయి నిన్ను నాది ప్రజాసర్గంబునఁ బ్రజాపతివని యసితుండయిన దేవలుండును, సత్యంబు వలన యజ్ఞం బుద్ధరించుటం జేసి నిత్య సత్య మయుండ వయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును, శిరంబున దివంబును బాదంబుల మేదినియును లోచనంబుల సూర్యుండును నవయవంబుల లోకంబులు నభివ్యాపించుటం జేసి సర్వ మయుండవని నారదుండును నక్షయజ్ఞాననిధి వని సర్వమునిముఖ్యులును జెప్పిరి.౧౩౩
వ.
నీ యంతఃకరణప్రవృత్తి కగోచరం బెద్దియు లే దయినను నా పడినపరాభవం బెఱింగించెద.౧౩౫
సీ.
పార్థివప్రభుఁ డైన పాండుమహీపతికోడల నయి యుద్ధకుశలు లయిన
పాండుతనూజుల భార్య నై పూజ్యుఁడ వైన నీయనుజనై యధికశక్తిఁ
బరఁగుధృష్టద్యుమ్ను భగిని నై ధృతరాష్ట్రుపట్టిచే సభఁ దల పట్టియీడ్వఁ
బడి పాపకర్ముచేఁ బరిధాన మొలువంగఁ బడి దారుణం బైన పరిభవంబు
ఆ.వె.
పడితి నట్టి నన్నుఁ బాండవుల్ సూచుచు, నుండి రొరులువోలె నుక్కుదక్కి
యాపగాతనూజుఁ డాదిగాఁ గలవృద్ధ,బంధుజనులు సూచి పలుక రయిరి.౧౩౬
వ.
భ్రాతృపుత్రబంధుజనంబులు నాకుం గలిగియు లేనివా రయి రట్టియెడం గర్ణుండు నన్నుం జూచి నగియె. ౧౩౮
ఆ.వె.
కర్ణునగవు లోకగర్హితుండగు దుస్స, సేను చెయిది కంటె శిఖియపోలె
నడరి నామనంబు నతిదారుణక్రియ, నేర్చు చున్నయది మహీధరుండ.౧౩౯
అప్పుడు కృష్ణుడు వారితో--
వ.
అయ్యవసరంబున నేను మీయొద్ద నుండమిం జేసి యిట్టి దుర్వ్యసవంబు సంభవిల్లెం గామజంబు లైన స్త్రీద్యూతమృగయాపానంబు లను నాలుగు దుర్వ్యసనంబులం బ్రవర్తిల్లకుండఁ బ్రతిషేధింపవలయు నందును విశేషంబుగా ననర్థమూలం బయిన ద్యూతంబుఁ బరిహరింపనినాడు పాపం బగునని హేతుదృష్టాంతంబులు సూపి కృపద్రోణవిదురగాంగేయులం దోడుసేసికొని యాంబికేయు నొడంబఱిచి దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు.౧౪౮
పర్వములు | edit post
0 Responses

Post a Comment