Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-10
పాండురాజు మరణము, పాండవులు హస్తిపురంబు చేరుట
క.
మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు, గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్. 159

కృష్ణద్వైపాయనుడు ఒకనాడు తన తల్లి సత్యవతి తో అంటాడు ఈవిధంగా.

పాండురాజు శాపభయంతో శతశృంగ పర్వతం మీద తన యిద్దరు భార్యలతో మునివృత్తి నుండగా వసంత ఋతువు ప్రవేశించింది.
వ.
ఇట్లు సర్వభూతసమ్మోహనం బయిన వసంతసమయంబునం బాండురాజు మదన సమ్మోహనమార్గణ బందీకృతమానసుండై మద్రరాజపుత్త్రిదైన మనోహరాకృతియందు మనంబు నిలిచి యున్నంత నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు కాయితంబు సేయుచుండి మాద్రీరక్షణంబునం దేమఱి మఱచి యున్న యవసరంబున. 140
మార్గణ=బాణములచేత
ఉ.
చారుసువర్ణహాసి నవచంపక భూషయు సిందువారము
క్తారమణీయమున్ వకుళదామవతంసయునైయపూర్వశృం
గారవిలాసలీల యెసగం దనముందట నున్న మాద్రి నం
భోరుహనేత్రఁ జూచి కురుపుంగవుఁ డంగజరాగమత్తుఁడై.
141
సిందువారముక్తా=వావిలిముత్యములచే
వకుళదామవతంస=పొగడదండ సిగబంతిగా గలది
అంగజరాగమత్తుఁడై=మన్మథానురాగము(కామము) చేఁ దెలియనివాఁడై
క.
కిందము శాపము డెందము, నం దలపఁక శాపభయమునను మాద్రి గడున్
వందురి వారింపఁగ బలి,మిం దత్సంభోగసుఖసమీహితుఁడయ్యెన్.
142
వందురి=దుఃఖపడి
వ.
దానిం జేసి విగతజీవుండైన యప్పాండురాజుం గౌగిలించుకొని మాద్రి యఱచుచున్న దానియాక్రందనధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులం బడి యేడ్చుచున్న నెఱింగి శతశృంగనివాసు లగు మునులెల్లం దెరలి వచ్చిచూచి శోకవిస్మయాకులితచిత్తు లయి రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె. 142
కుంతి భర్తతో సహగమనం చేస్తాననగా మాద్రి ఆమెను వారించి పిల్లలను ఏమఱక రక్షించమని కుంతికి చెప్పి తనే పాండురాజుతో సహగమనం చేస్తుంది.
తరువాత శతశృంగమందలి మునులెల్లరూ కలసి కుంతీదేవిని పాండు కుమారులను హస్తినాపురానికి తీసుకువస్తారు.
అప్పుడు పాండుకుమారులను చూచి పౌరులిలా అనుకున్నారట.
చ.
సురలవరప్రసాదమునఁ జూవె సుపుత్త్రులఁ బాడురాజు భా
సురముగఁ గాంచెఁ దత్సుతులఁ జూతము రం డని పౌరు లెల్ల నొం
డొరులకుఁ జెప్పుచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ
చిరి భుజవిక్రమాధరితసింహ కిశోరులఁ బాండవేయులన్. 150
ఉ.
వారలు దైవశక్తిఁ బ్రభవించినవా రను సందియం
బీరమణీయ కాంతి నుపమింపఁగ వేల్పుల కారె యిట్టియా
కారవిశేషసంపదఁ బ్రకాశిత తేజము పేర్మిఁ జూడ సా
ధారణమర్త్యులే యని ముదంబునఁ బౌరులు దమ్ముఁ జూడగన్. 151

వారినందరిని కౌరవులందరూ పెద్దలతో కలసి సగౌరవంగా ఆహ్వానిస్తారు.
వారిలో ఓ వృద్ధ తపస్వి
వ.
ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్త్రరక్షణార్ధంబు మునిగణ ప్రార్ధిత యై యెట్టకేనియు ధృతప్రాణ యయ్యె. ఇక్కుమారులు కురుకులవిస్తారకులు దేవమూర్తులు యుధిష్టర భీమార్జున నకుల సహదేవు లనంగా దేవాధిష్ఠిత నామంబులు దాల్చి బ్రహ్మర్షిప్రణీతోపనయనులై శ్రుతాధ్యయన సంపన్ను లగుచుఁ బెరుఁగు చున్నవారు వీరలం జేకొని కురువృద్ధులు ధర్మబుద్ధితో రక్షించునది యని చెప్పి అంతర్ధానులయిరి. 156
వ.
అంతఁ గృష్ణద్వైపాయనుండు వారికందఱకు దుఃఖోపశమనంబు సేసి యొక్కనాఁడు సత్యవతికి నేకాంతంబున ని ట్లనియె. 158
క.
మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు, గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్. 159

సంసారం అతి చంచలమైనది. సంపదలు ఎండమావులవంటివి, క్షణికమైనవి. గతకాలమే వచ్చేకాలం కంటే మేలైనది
క.
క్రూరులు విలుప్త ధర్మా,చారులు ధృతరాష్ట్రసుతు లసద్వృత్తులు ని
ష్కారణవైరులు వీరల, కారణమున నెగులు పుట్టుఁ గౌరవ్యులకున్. 160

వ.
దాని ధృతరాష్ట్రుండు తాన యనుభవించుం గాని మీ రీదారుణంబుఁ జూడక వీరి విడిచి తపోవనంబున కరుంగుడని చెప్పి చనిన సత్యవతియుఁ బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెఱింగిచి కోడండ్ర నంబికాంబాలికలం దోడ్కొని వనంబునకుం జని తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలంబునకు శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి రిట ధృతరాష్ట్రుండును .161
క.
తనసుతులు పాండుసుతు లని, మనమున భేదింప కతిసమంజసభావం
బున నొక్కరూప కాఁ జే, కొని యుండెం బాండురాజుకొడుకుల బ్రీతిన్. 162
పర్వములు | edit post
0 Responses

Post a Comment