Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-16
మత్తకోకిలము.
వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధన మోపఁ డేనియు వీనిమాత్రకు నాలుగేన్
పాఁడికుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచు నుండగాన్. 218

మత్తకోకిలము- నడక ఎంత అందంగా వుంటుందో కదా.

కనీసం పిల్లాడికి పాలనిమిత్తం నాలుగు పాడి పశువులనన్నా ఇయ్యకపోడు గదా అనే ఉద్దేశంతో వెళ్ళాడు పాపం.
వ.
అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెఱింగించిన నాతండు దనరాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక యేను రాజును నీవు పేదపాఱుండవు నాకును నీకును ఎక్కడిసఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి నని దన వృత్తాంతం బంతయు జెప్పిన. 219
పాఱుడు=బ్రాహ్మణుడు
క.
విని రోయుతీఁగ గాళ్ళం, బెనఁగె గదా యనుచుఁ బొంగి భీష్ముఁడు ద్రోణున్
ఘనభుజు నభీష్టపూజా, ధనధాన్యవిధానముల ముదంబునఁ దనిపెన్. 220

వెతుకుతున్నతీగ కాళ్ళకు తగిలింది గదా అనుకుని భీష్ముడు ద్రోణుని అన్నివిధాలా ఆదరించి
చ.
మనుమల నెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు వీరిఁ
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసనవిద్య లెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలఁడు ని న్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్. 222

మనమల కందరికీ విద్య గఱపమని కోరుతూ ద్రోణుడిని ఎటువంటి పొగడ్తతో భీష్ముడు ఆకట్టుకున్నాడో చూడండి. పరశురాముడుకూడా యుద్దంలోనూ నైపుణ్యంలోనూ పరాక్రమం లోనూ నిన్ను పోలడని విన్నాను-అదీ మాట నేర్పంటే.
వ.
అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన ద్రోణుండు వారలం జేకొని యందఱ కి ట్లనియె. 223
తే.
అస్త్రవిద్యలు గఱచి నాదైన ఇష్ట, మొగిన తీర్పంగ నిందెవ్వఁ డోపు ననినఁ
బాయమొగమిడి కౌరవుల్ పలుకకుండి, రేనుదీర్చెద ననిపూనె నింద్రసుతుఁడు. 224

గురువును ఆకట్టుకోవటం అంటే అదీ. ఆవిద్య అర్జునిడికి మాత్రమే తెలుసు. అందుచేత వెంటనే ఆమాటన్నాడు.
వ.
ఇట్లు తనయిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న నానా దేశంబులం గలరాజపుత్త్రు లెల్ల వచ్చి వారితోఁ గలసి కఱచుచుండిరి(మఱియు సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యా కౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె) అంత. 225
కర్ణుడు కూడా నానాదేశ రాజులతో పాటుగా ద్రోణుని దగ్గర విద్య నేర్చుకున్నాడా అనే సందేహం కలుగుతున్నది నాకు.
క.
నరుఁ డస్త్రవిద్యా, పరిణతి నధికుఁ డయి వినయపరుఁ డయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునఁ, బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్. 226
వ.
అయ్యర్జునుతోడి విద్యామత్సరంబునఁ జీకటి నాతం డేయనేర కుండ వలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడువం బెట్టకుమీ యనిపంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయు చున్న నొక్కనాఁటిరాత్రి యందు. 227

చీకటిలో అన్నం తినటం అలవాటయితే ధనుర్విద్యను కూడా చీకటిలో అదేవిధంగా నేర్చుకోవచ్చన్నమాట.
ఉ.
వాసవనందనుండు గుడువం బటుమారుతాహతిం
జేసి చలించి దీపశిఖ చెచ్చెరఁ బోవుడు భోజన క్రి యా
భ్యాసవశంబునం గుడిచి పన్నుఁగ నిట్టుల విద్య లెల్ల న
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముఁ డై.228
పటుమారుతాహతిన్= మిక్కిలి గాలి దెబ్బచేత
క.
పాయక చీఁకటియందును, నేయం దా నభ్యసించె నిట్టియెడం గౌం
తేయు ధనుర్జ్యాధ్వని విని, ధీయుక్తుఁడు ద్రోణుఁ డరుగుదెంచి ముదమునన్.228

శిష్యుల విద్యాపరిశ్రమ చూస్తే ఏ గురువుకైనా ముచ్చట వేస్తుంది కదా.
సీ.
ఆతనియస్త్రవిద్యాభియోగమునకుఁ బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
యన్న ధనుర్ధరు లన్యులు నీకంటె నధికులు గా కుండునట్లు గాఁగఁ
గఱపుదు విలువిద్య ఘనముగా నని పల్కి ద్వంద్వసంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథమహీవాజివారణములపై నుండి దృఢచిత్ర సౌష్టవస్థితుల నేయ
తే.
బహువిధవ్యూహభేదనోపాయములను, సంప్రయోగరహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటిభార్గవుఁడు వింట, నిట్టిఁడే యని పొగడంగ నెల్ల జనులు.229
అభియోగమునకున్=పూనికకు

అలా విలువిద్యలో అర్జునుని అందరికంటె ప్రవీణు డయ్యేలా విద్య గఱపాడు ద్రోణుఁడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment