Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-17
ఏకలవ్యుం డనువాఁడు ద్రోణు నారాధించి విలువిద్య గఱచుట
మహాభారతంలోని అనేకానేక ఉపాఖ్యానాల్లో ఇది ఒకటి. ద్రోణుని వ్యక్తిత్వం ఈ కథలో మసకబారింది.
వ.
మఱియు గదా కార్ముకప్రాసాసితోమరకుంతశక్త్యాది వివిధాయుధంబుల యందును గుమారుల నందఱ జితశ్రములం జేయుచున్న ద్రోణాచార్యుల మహా ప్రసిద్ధి విని హిరణ్యధన్వుండను నెఱుకురాజుకొడు కేకలవ్యుం డనువాఁడు ధనుర్విద్యా గ్రహణార్థి యయి వచ్చిన వాని నిషాదపుత్త్రుం డని శిష్యుంగాఁ జేకొనకున్న వాఁడును ద్రోణుననుజ్ఞ వడసి చని వనంబులోన. 231
ప్రాసాసి=?
తే.
వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి, దానికతిభక్తితోడఁ బ్రదక్షిణంబుఁ
జేసి మ్రొక్కుచు సంతతాభ్యాసశక్తి, నస్త్రవిద్యారహస్యంబు లర్థిఁ బడసె.
232
క.
ఇటఁ బాండవకౌరవు లొ,క్కొట నందఱు గురుననుజ్ఞ గొని మృగయాలం
పటు లై వనమున కరిగిరి, పటుతరజవ సారమేయభటనివహముతోన్. 233

పాండవులు కౌరవులు కలసి భటులతోను, వేటకుక్కలతోను వేటకు బయల్దేరారొకసారి.
వ.
మఱియు నం దొక్క భటునికుక్క తోడుదప్పి పఱచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యు సమీపంబున మొఱింగిన నయ్యెలుంగు విని దానిముఖంబునం దేను బాణంబు లొక్కటఁ దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాఁడేసిన నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఱిన దానిం జూచి విస్మయం బంది య ట్లేసినవాఁ డెవ్వఁడో యని రోయుచు వచ్చువారు ముందఱ. 234
ఉ.
తేజిత బాణహస్తు దృఢదీర్ఘమలీమసకృష్ణ దేహుఁ గృ
ష్ణాజిన వస్త్రవిష యా ప్తవిషాదు నిషాదుఁ జూచి యా

రాజకుమారు లందఱుఁ బరస్పర వక్త్రవిలోకన క్రియా

వ్యాజంబునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్.
235
వ.
అక్కుమారులు వాని శరలాఘవంబునకు మెచ్చి నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్యఁ గఱచి తని యడిగిన వారికి నయ్యెఱు కి ట్లనియె. 236
క.
వినుఁ డే హిరణ్యధన్వుం, డనువనచరనాథుకొడుక నాచార్యుఁడు ద్రో
ణునకున్ శిష్యుఁడ నెందును, ననవద్యుఁడ నేకలవ్యుఁ డనువాఁడ మహిన్.
237
వ.
అనిన విని కురుకుమారు లందఱు మగిడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి రంత నర్జునుం డొక్కనాఁ డేకాంతంబున నాచార్యున కి ట్లనియె. 238
క.
విలువిద్య నొరులు నీ క, గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలికితిరి నాక కా దీ, త్రిలో కముల కధికుఁ జూచితిమి యొక యెఱుకన్. 239
క.
నా కంటెను మీకంటెను, లోకములో నధికు డతిబలుండు ధనుర్వి

ద్యా కౌశలమున నాతఁడు, మీకుం బ్రియశిష్యుఁ డటె యమిథ్యావచనా. 240
వ.
అనిన ద్రోణుం డదరిపడి వానిం జూతము రమ్మని యర్జునిం దోడ్కొని యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేగిన నెఱింగి వాడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి యేను మీశిష్యుండ మి మ్మారాధించి యివ్విలువిద్యఁ గఱచితి నని కరంబులు మొగిచి యున్నం జూచి ద్రోణుం డట్లేని మాకు గురుదక్షిణ యిమ్మనిన సంతసిల్లి వాఁ డి ట్లనియె. 241
క.
ఇదె దేహం బిదె యర్థం, బిదె నాపరిజనసమూహ మిన్నిటిలో నె
య్యది మీకిష్టము దానిన, ముద మొదవఁగ నిత్తుఁ గొనుఁ డమోఘంబనినన్. 242
క.
నెమ్మిని నీదక్షిణహ, స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి మ్మి
ష్ట మ్మిది నా కనవుడు విన, యమ్మున వాఁ డిచ్చె దాని నాచార్యునకున్. 243
తే.
దక్షిణాంగుష్ట మిచ్చిన దానఁ జేసి, బాణసంధానలాఘవభంగ మయిన
నెఱుకు విలువిద్య కలిమికి హీనుఁడయ్యెఁ, బార్థునకు మనోరుజయు బాసెనంత. 244
దక్షిణాంగుష్టము=కుడి బొటన వ్రేలు
క.
విలువిద్య నొరులు నీక,గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలరిపుసుతునకుఁ బలికిన, పలు కప్పుడు గురుఁడు సేసెఁ బరమార్థముగన్. 245
బలరిపుసుతునకున్=అర్జునునకు
మత్తకోకిలము.
భూపనందను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
ద్యాపరిశ్రమ కౌశలంబున దండితారి నరుం డిలన్. 246
పర్వములు | edit post
0 Responses

Post a Comment