Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-1
ఉ.
శ్రీ యన గౌరి నాఁ బరగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తి యై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడుభక్తజనంబు వైదిక
ధ్యాయత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్. 1
క.
వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణవర్గంబులకున్
వా దైన చోటులకు దా, మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్. 4

భారతాన్ని పంచమ వేదం అంటారు. అది వేదములకు, అన్ని స్మృతులయొక్క వాదములకు చాలా పురాణ వర్గములలోని విరోధం కలిగించు చోటులకు, ధర్మార్థకామమోక్షాలకు, ప్రమాణము వంటిది.

ఉ.
ఆదరణీయసారవివిధార్థగతిస్ఫురణంబు గల్గి య
ష్టాదశ పర్వనిర్వహణసంభృత మై పెను పొంది యుండ నం
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వవిశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్. 6


ఆదరింపదగినదై సారవంతమై వివిధములైన అర్థములను ప్రాప్తించు స్ఫురణము కలిగి పదునెనిమిది పర్వములతో శోభించుచున్నదై వుండగా దానిలో ఆదిపర్వము మొదలు మూడు పర్వములను ఆంధ్రకవిత్వ విశారదుడు,విద్యాదయితుడు, మహితాత్ముడు ఐన నన్నయభట్టు దక్షతతో తెలుగు చేసాడు.


మ.
హృదయాహ్లాది చతుర్థ మూర్జితకథోపేతంబు నానారసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జన సంప్రార్థ్యంబు లై పెంపునం
దుది ముట్టన్ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారఁగన్. 7

హృదయాహ్లాదాన్ని కలిగించి గొప్పదైన నాల్గవ కథతోకూడుకున్నవిరాట పర్వము ఉద్యోగ పర్వము మొదలుగాగల మిగిలిన పదిహేను పర్వాలను తెనుఁగు బాసలో జనులచే ప్రార్థింపబడినవై పెంపు వహించేలా చివరివరకూ రచియించటం ఒప్పుతుంది. అలా చేస్తే పండితులందరూ సంతోషిస్తారు.అని తిక్కన సోమయాజి గారు నిర్ణయించుకొన్నారు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment