Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౧

సాత్యకి దుర్యోధనుకడకు దూతం బంప గూడ దని చెప్పుట
చ.
పలికిన చందముల్ నెఱపి పైతృక మై చను రాజ్యభాగ మి
మ్ములఁ బడయం దలంచి బలముం జలమున్ నెఱపం గడంగు వీ
రలు నొరు వేఁడఁ బోదురె యరాతులు సాధుల మెత్తురే రణం
బుల జయలక్ష్మిఁ జేకొనుటఁ బోలునె యొండొక రాజధర్మముల్. 26

విరాటు కొలువులో అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత తదుపరి కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలో నిర్ణయించడానికి కూడిన సభలో సాత్యకి ' అన్నమాట ప్రకారం నడచుకొని పిత్రార్జితమైన రాజ్యభాగం కోసం బలమూ చలమూ కలిగిన ఈ పాండవులు ఒకరిని యాచించబోరు.శత్రువులు సాధువులైనవారిని మెచ్చుకుంటారా? యుద్ధములో జయలక్ష్మిని చేకొనుటను యింకో రాజధర్మమేదయినా పోలునా?' అంటాడు.

యుద్ధము వలనగాని రాజ్యభాగము సిద్ధించదు అంటూ ద్రుపదుడు ఇలా అంటాడు.
క.
మృదుభాషణములదుర్జన, హృదయములు ప్రసన్నతామహిమఁబొందునె యె
ల్లిదముగఁ గొని యంతంతకు, మద మెక్కుంగాక దురభిమానము పేర్మిన్. 35

మెత్తనిమాటల వలన దుర్జనులైన కౌరవుల హృదయాలు ప్రసన్నం కావు. తేలికగా తీసుకుని అంతకంతకూ దురభిమానంతో మద మెక్కుతారు.

దుర్యోధనుడు అర్జునుడు కృష్ణ సహాయాన్నర్థించి వచ్చిన ఘట్టంలో నారాయణాభిధానులు పది వేల సైన్యం ఒకవైపు (వారందరూ యుద్ధం చేస్తారు) , తా నొకడూ ఒకవైపుగా(తాను ఆయుధాన్ని పట్టడు) విభాగం చేసి--
క.
వారొక తల యే నొక తల , యీ రెండు దెఱంగులందు నెయ్యది ప్రియ మె
వ్వారికిఁ జెప్పుడు తొలితొలి, గోరికొనన్ బాలునికిఁ దగుం బాడిమెయిన్. 75
ముందుగా వయసులో చిన్నవాడైన అర్జునుడు కోరుకోవటం న్యాయం అంటాడు కృష్ణుడు.

ఈ ఘట్టంలో కొస్తే తిరుపతి వేంకటకవుల పాండవ ఉద్యోగ విజయాల పైకే మనసు పరిగెట్టుకు పోతుంది.
పర్వములు | edit post
0 Responses

Post a Comment