Unknown
శాంతి పర్వము-ప్రథమాశ్వాసము-3
అర్జునుడు ధర్మరాజుకు చేయు ఉపదేశం నుండి--
క.
ఫలములయెడ బ్రహ్మార్పణ, కలనపరుం డగుచుఁ గార్యకర్మము నడపన్
వలయుం తత్త్వజ్ఞానము, తలకొనినం గర్మశమము తానై కలుగున్.69

ఫలితములయెడ బ్రహ్మార్పణ చేయుట కలుగుచు కార్యకర్మముల నిర్వహణ మొనర్చుటకు తత్త్వజ్ఞానము కావలయును. ఆలోచించగా కర్మ తానే శమము ఐ వుంటుంది.
ఒకప్పుడు ఇంద్రుడు గరుడుని రూపములో కొందఱు బ్రాహ్మణులు సత్పథ మేది యని అడిగితే దానికి సమాధానం చెపుతూ ఇలా అంటాడు.
తే.
యనిన నలుగాలివాన గోవును నశేష, శబ్దములమంత్రమును లోహజాతిఁ గాంచ
నమును మనుజుల విప్రుండు సమధికత్వ, భాజనములండ్రు వేద ప్రపంచవిదులు.71

నాలుగు కాళ్ళ జంతువులలో- గోవు, శబ్దచయములో- మంత్రము, లోహములలో- బంగారము, మనుష్యులలో - బ్రాహ్మణుడు ఇవి మిక్కిలి యధికమైనవి అని వేదప్రపంచాన్ని తెలిసిన వారు అంటారు.
వ.
ఇట్లుత్తముం డైన విప్రుం డుత్తమమంత్రోపాశ్రితంబు లగు విహిత కర్మంబులు నడపుట రత్న కాంచనసాంగత్యంబునుబోలె సంస్తుత్యం బై యుండు నాలస్యంబునఁ గ్రోధంబున శోకంబునఁ దదనుష్ఠానంబు విడుచుట పాతకం బజ్ఞానులగు నర్థహీనుల సన్న్యాసకాల వివేకంబు లేక వేగిరపడి యుభయ భష్టు లగుదురు. గృహస్థ ధర్మంబున వర్తించి యతిథి దేవ పితృ సంతృప్తి చేయుచు శిష్టాన్నభోజనపరు లగు పుణ్యులకుం బుణ్యలోకంబు లఱచేతిలోనివి కావె బ్రహ్మార్పితంబయిన సత్కర్మ కలాపంబు మహానందంబుఁ జేయు.72

ఈవిధంగా ఉత్తముడైన బ్రాహ్మణుడు మంచి మంత్రోపాశనతో కూడిన తనకు విధింపబడిన కర్మములను చేయుట రత్నం బంగారంతో కూడివున్నట్లుగా స్తుతింప దగినదై వుంటుంది. సోమరితనము, కోపము, శోకముల వల్ల ఆ అనుష్ఠానాన్ని విడిచి పెట్టటం పాపము. అజ్ఞానులైన ధనహీనులు విడిచి పెట్టాల్సిన కాల వివేకము లేనివారై ఉభయ భ్రష్టత్వాన్ని పొందుతారు. గృహస్థ ధర్మాన్నిఅనుసరించుచు, అతిథి, దేవ, పితృ దేవతలను సంతృప్తి పరుస్తూ శిష్టాన్న భోజనపరు లైన పుణ్యులకు పుణ్యలోకములు అఱచేతిలోనివే కావా. బ్రహ్మార్పితమైన సత్కర్మ కలాపము మహానందాన్ని కలిగిస్తుంది కదా.
పర్వములు | edit post
0 Responses

Post a Comment