Unknown
ఆది పర్వము-ప్రథమాశ్సాసము-1
మంగళ శ్లోకము
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రి పురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీ కన్ధరా శ్శ్రేయసే. 1

లక్ష్మీ సరస్వతీ పార్వతులను హృదయ ముఖ శరీరములందు స్థిరముగ ధరించి, స్త్రీ పురుష యోగమున జనించిన లోకముల నిల్పుచు, వేదత్రయాత్మకులు త్రిమూర్తులును, దేవతలచేఁ బూజింపబడు విష్ణుబ్రహ్మేశానులు శ్శేయస్సు కొఱ కగుదురు గాక.
ఉ.
రాజకులైక భూషణుఁణు రాజమనోహరుఁ డన్యరాజ తే
జోజయశాలిశౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రి కా
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమపేంద్రుఁ డున్నతిన్,3

రాజకులమునకు అలంకారమైనవాఁడు, రాజులలో మనోహరమైనవాఁడు, ఇతర రాజుల తేజస్సనేకాంతిని జయించిన వీరుడు, విశుద్ధమైన శరత్కాల చంద్రుని వెన్నెలవలె ప్రకాశించు సర్వలోకుడైనవాడు, గెలువఁబడనిగొప్ప భుజమందలి ఖడ్గధారయనెడి జలములచే శాంతమైన శత్రువు లనెడి దుమ్ముగలవాఁడు, అయిన రాజమహేంద్రపు రాజు ఉన్నతితో,
క.
విమలాదిత్యతనూజుఁడు, విమలవిచారుఁడు గుమారవిద్యాధరుఁ డు
త్తమచాళుక్యుఁడు వివిధా, గమవిహితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.4

విమలాదిత్యుని కుమారుడు, శుభ్రమైన ఆలోచన కలవాడు, కుమారుఁడైన విద్యాధరుఁడు, ఉత్తమ చాళుక్యుడు, వివిధములైన ఆగమశాస్త్రములలో బాగుగా పరిశ్రమ చేసినవాఁడు, కాంతిలో చంద్రుని వంటివాఁడు రాజరాజ నరేంద్రుడు.

సీ.
తనకులబ్రాహ్మణు ననురక్తు నవిరళజపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాదినానాపురాణవిజ్ఞాననిరతుఁ
బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్రజాతు సద్వినుతావదాత చరితు
లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు
ఆ.
నిత్యసత్యవ చను మత్యమరాధిపా, చార్యు సుజను నన్నపార్యుఁ జూచి
పరమధర్మ విదుఁడు వరచాళుక్యాన్వయా, భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ.9

తన పురోహితుడు, ఇష్టుడు, జపహోమముల యందధికమైన తత్పరత గలవాఁడు, విపులమైన శబ్దములను శాసించగలవాఁడు, శాస్త్రములఁ జదివిన వాడు, బ్రహ్మాండాది నానా పురాణవిజ్ఞానములో ప్రసిద్ధుడైనవాఁడు, పాత్రుడు, ఆపస్తంబసూత్రుడు, ముద్గలగోత్రములో పుట్టినవాఁడు, మంచి ప్రసిద్ధిచెందిన తెల్లని చరితముకలవాఁడు, లోకజ్ఞుడు, ఉభయభాషాకావ్యముల రచనలలో శోభిల్లువాఁడు, మంచి ప్రతిభతో మిక్కిలి వెలయువాఁడు,

నిత్యము సత్యవచనమునే పలుకువాఁడు, బుద్ధియందు బృహస్పతిని బోలువాఁడు, సుజనుడు ఐన నన్నపార్యుని చూచి పరమ ధర్మ విదుఁడు, ప్రసిద్ధినొందిన చాళుక్యవంశమునకు ఆభరణమువంటివాడైన రాజరాజనరేంద్రుడు ఈవిధంగా అన్నాడు.
మ.
ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లైయుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియుఁ బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్ .12

ఈ ఐదు నాకు చాలా ఇష్టమైనవి. బ్రహ్మణుల సేవ, భారతమును వినుటయందాసక్తి, శంకరుని ధ్యానముసేయుట, సంతతము దానములు చేయుట, సాధుజనులతో సాంగత్యము-అనేవి. ఇవి నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉంటాయి.
గరికిపాటి నరసింహారావు గారు వారి శ్రీమదాంధ్రమహాభారత సామాజిక వ్యాఖ్యలో ఈ పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ
ఇక్కడ చెప్పిన ఐదు గుణాలు ఐదుగురు పాండవులను సూచిస్తున్నాయంటున్నారు. నిజమే ననిపిస్తుంది.
భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్=ధర్మరాజు
భారతశ్రవణాసక్తియుఁ=నకులుడు
సంతతదానశీలత=భీముడు
బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహోత్సవమున్=అర్జునుడు
శశ్వత్సాధుసాంగత్యమున్=సహదేవుడు



పర్వములు | edit post
0 Responses

Post a Comment