Unknown
అనుశాసనిక పర్వము-ప్రథమాశ్వాసము-1
ధర్మరాజు భీష్మపితామహుడు వివరంగా చెప్పిన వివిధ ధర్మంబులు వినిన తరువాత భీష్మునితో నిట్లనియె.
సీ.
అనఘ నాదగు చిత్తమునకు శమంబు కావించుట కై నీవు వివిధవిశద
భంగులఁ బరమకృపానిరతుండ వై సకలధర్మోపదేశములుఁ జేసి
తిమ్మెయిఁ జెప్పఁగానించుకయేనియు శమము లేకున్నది చలముకొని య
నేకబంధుల వధియించితి నది యొక్క తలయు నీకలిగిన దారుణత్వ
ఆ.
మొక్కతలయు నైన యుగ్రకర్మంబులు, చిత్తవృత్తిఁ దగిలి యుత్తలంబుఁ
జేయ శాంతి యెట్లు సిద్ధించు మునిమాన,నీయ యింక నేమి చేయువాఁడ.3

పుణ్యాత్ముడా! నా మనసుకు శాంతి చేకూర్చుటకై నీవు వివిధ ధర్మోపదేశములు కడుంగడు విశదమగునట్లుగా పరమకృపారతుడవై తెలియ చెప్పావు. కాని దానిమూలంగా కొంచెం కూడా నాకు శమము లేకుండా వున్నది. మాత్సర్యాన్ని పూని అనేకమంది బంధువులను చంపాను. అది అంతా ఒకవైపు, ఇంకో వైపు నీకు చేసిన దారుణమైన ఉగ్రకర్మలు నా మనసును పిండివేస్తుండగా నాకు శాంతి యెలా కలుగుతుంది. ఈ పరిస్థితిలో నేను ఇప్పుడు ఏం చేయాలి ?
ఇలా పలికిన ధర్మరాజుతో భీష్ముడు 'వధించటానికి మనుజుడు కర్త' గాదని దానికుదాహరణంగా గౌతమీలుబ్ధకసర్పమృత్యుకాలసంవాదాన్ని అతనికి వివరిస్తాడు.
గౌతమి అనే బ్రహ్మణ స్త్రీ కొడుకు పాము కరచి చనిపోతే ఆవిడ దుఃఖిస్తుండగా చూచి ఓ కిరాతుడు ఆ పాముని తాడుతో కట్టి తెచ్చి ఆమెకు చూపించి ఆ పామును చంపబోతాడు. అప్పుడామె అతనిని వారిస్తూ ఇలా అంటుంది.
క.
విధివశమున వచ్చినకీ,డధములు కొనియాడి వెడఁగులై విపులభవాం
బుధి మునుగుదురు మునుంగరు, సధర్ములగు నుత్తములు ప్ర శాంతిం జులకన్.9

విధివశాన్ని వచ్చిన కీడును అధములైనవారు పెద్దగా జేసి వెడగులై విపులభవాంబుధిలో మునుగుతారు. కాని సధర్ములైన ఉత్తములు ప్రశాంతి నొందినవారై అలా మునగరు.
అదీకాక ఈ పాముని చంపినా నాకొడుకు తిరిగిబ్రతకడు గదా.అని నచ్చచెప్పినా వివశుడైన కిరాతుడు వినక ఇంకా పామును విడవనని అంటాడు.అప్పుడామె నీ అర్జునక నామము నీకున్న స్వచ్ఛమగు విధమునకు తగివుండాలి, బ్రహ్మణ స్త్రీనైన నేను వద్దని చెప్తున్నపుడు బ్రాహ్మణ సహాయుడవైన నీవు దానికి వ్యతిరిక్తంగా నడవకూడదు కదా. నా సన్నిధిలో నీకీ క్రూరత వలదు.అంటే జనబాధకములైన జంతువులను చంపొచ్చు పాపం రాదు అంటాడు. అయినా ఆమె ఒప్పుకోదు.అప్పుడు పాము నాతప్పేమీలేదు, నీవు ధర్మాన్ని తెలియవు, మృత్యుపరాధీనతను బాలుడిని కాటు వేసాను కాని నాకు మనసులో రోషకామాలు లేవు అంటుంది. నీవు మృత్యువునకు సాధనమవు కాన నిన్ను చంపవచ్చుఅనగా మృత్యువు కూడా అక్కడికి వచ్చి పాముతో-- నేను నిన్ను పంపిన విధంగా యమధర్మరాజు నన్ను పంపాడు అండుచేత నా తప్పూ నీ తప్పూ కూడా లేదంటుంది.అప్పుడక్కడికి కాలుడు వచ్చి నేను,మృత్యువు,పాము కూడా కారణం కాము. ఈతడు చేసిన కర్మఫలమే దీనికి కారణం అంటాడు.
క.
విను కర్మం బొనరించును, జననము మరణంబు నదియ సౌఖ్యము దుఃఖం
బును గావించుం దనచే,సినదానింబడక పోవ శివునకు వశమే.34
కర్మ వలసనే చావు పుట్టుకలు, సుఖదుఃఖాలు అన్నీ కలుగుతాయి. దానిని దాటటం శివునికి కూడా వశము కాదు.
అందుచేత ఈ జరిగిన యుద్ధానికీ, చావులకు నీవు గాని దుర్యోధనుడు గాని కారణం కారు . దీనికి విచారించాల్సిన పని లేదు.అంటాడు ధర్మరాజుతో భీష్ముడు.
0 Responses

Post a Comment