Unknown
అశ్వమేధ పర్వము-ప్రథమాశ్వాసము-1
శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకు మనస్తాపోపశమంబు చేయుట.
సీ.
శారీరమును మానసంబును నా రెండు తెఱఁగు లై వ్యాధి వర్తించు నందు
విను వాతమునుఁ బిత్తమును శ్లేష్మమును సమత్వంబుఁ బొందినయప్డు స్వస్థుఁడగున
రుం డవి మూఁడు నొక్కండయి వికృతి నొందిన శరీరవ్యాధి యనఁగఁ బరఁగు
సత్వరజస్తమస్సమత సుస్థ్సితి విషమత మనోవ్యాధి యీద్వితయమునకు
ఆ.
నొంటి దోఁచు టెపుడు నొదవ దన్యోన్యసం, జనకజన్యభావ తనుతఁ జేసి
వికృతికాల మొకట నొకటి తోఁచునది వా, తాదులందు గుణములందు నధిప.113

శారీరకము, మానసికము అని వ్యాధులు రెండు విధములు. వాత, పిత్త, శ్లేష్మాలు
సమత్వం పొందితే మనిషి ఆరోగ్యంగా వుంటాడు. ఆ మూటిలో ఏ ఒక్కటి వికృతి పొందినా
మనిషి శారీరక రోగాన్ని పొందుతాడు. మనిషిలోని సత్త్వ, రజ, తమో గుణముల సమత్వం
మానసిక సుస్థ్సితి, వానిలో ఏ ఒక్కటి విషమత చెందినా కలిగేది మనోవ్యాధి.
యీ రెంటిలో ఒక్కటే తోచటం ఎపుడూ జరగదు.ఆ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి
వుంటాయి.వాతాదులలోన, గుణములలోన వికృతికాలములో ఒకటి ఒకటి కనిపిస్తాయి.

కృష్ణుఁడు ధర్మరాజుతో అప్పుడు జరిగిన యుద్ధము మిథ్యాయుద్ధమని, సత్యయుద్ధం అంటే ఏమిటో చెపుతానని ఇలా అంటాడు.
ఉ.
అమ్మెయి బంధుమిత్రులసహాయతకల్మి ప్రయోజనంబు లే
దమ్మహనీయయుద్ధమున కాత్మయ తోడు మనంబు శత్రుఁ డీ
వెమ్మెయి నైన శాంతి ఘటియింపుము లోపగఁ దీర్పు మందు శాం
తమ్మ చుమీ మనోవిజయితన్ వెలుఁగొందుము శాంతబుద్ధివై.118

ఆ యుద్ధంలో బంధుమిత్రుల సహాయసంపద ఉండదు. ఆగొప్ప యుద్ధానికి ఆత్మయే తోడు. మనస్సే శత్రుడు. నీవేవిధంగా నైనా శాంతిని పొందు.లోననున్న పగను మాన్చుము. శాంతమే మనోవిజయమును కూరుస్తుంది.శాంతబుద్ధివై వెలుగొందు.
తే.
అంతరం బగునిక్కయ్య మధిప గెలువ, కిట్ల యేగతిఁ బోయెదో యెఱుఁగ దీని
నీవ కనుఁగొని సద్బుద్ధినిశ్చయప్ర,వీణుడవు కమ్ము మాటలు వేయు నేల.

అంతరంగంలో జరిగే ఈ యుద్ధం గెలవకుండా ఇటుల యేగతి పొందుతావో ఎఱుగను. దీనిని నీవే కనుక్కో. సద్బుద్ధి నిశ్చయప్రవీణుడవు కమ్ము. ఇంక మాటలు వేయయినా ఏమి ప్రయోజనము?
వ.
అని చెప్పి కౌంతేయాగ్రజునితోఁ గృష్ణుండు వెండియు నిట్లను. రెండక్షరంబులు మృత్యువు, మూఁడక్షరంబులు బ్రహ్మంబవి యెయ్యవి యంటేని వినుము మమ యనునవియును నమమ యనునవియును నై యుండు భూతంబులచేతం గానంబడక యా బ్రహ్మమృత్యువులు పోరుచుండు.120
క.
వెలిపగఱ గెలుపు గెలుపే, యలఘుమతిన్ గెలువవలయు నభ్యంతరశ
త్రులఁ దద్విజయము మోక్షము, నలవఱుపం జాలు నొంట నమ్మేలగునే.124

బయటి శత్రుల గెలుపు గెలుపు కాదు అంతశ్శత్రులను గెలవటం ద్వారానే మోక్షము కలుగుతుంది.
క.
విను మంతశ్శత్రులలో, ఘనుఁ డగుఁ గాముఁడు నిరస్తకామం బగువ
ర్తనము విశద మద్యయనయ,జనదానంబులును గామసహితములు కదా.125

విను. అంతశ్శత్రులలో కాముడు ఘనమైనవాఁడు. నిరస్తకామమగు వర్తనము విశదము.అధ్యయనము, యజనము, దానములు కూడా కామసహితములే కదా.
క.
విను పెక్కు లేల కోరిక, మనమునఁ జొరనీక యున్న మడియుం గాముం
డనవధ్య యశ్వమేధం, బొనరింపుము కోరకుండు మొక్కటియు మదిన్.133

కోరికను మనస్సులో చొరనీక పోతే కామం చస్తుంది. ఏ కోరికా మనస్సులో వుంచుకోకుండా కామ్యరహితంగా అశ్వమేధ యాగం చెయ్యి.అని చెప్తాడు ధర్మరాజుతో కృష్ణుడు.
0 Responses

Post a Comment