Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-6
క.
క్రోధమ తపముం జెఱచును, గ్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు, బాధయగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే
౧౭౪

క.
క్షమ లేని తపసితనమును, బ్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభురా
జ్యము భిన్న కుంభమున తో, యములట్టుల యధ్రువంబులగు నివి యెల్లన్.
౧౭౫


పరీక్షితుడు అడవికి వేటకెళ్ళి అక్కడ శమీకు డనే మునీశ్వరుని- తను వేటాడుతున్న జంతువు గురించి వివరం అడిగి-, మౌనవ్రతుడైన ముని సమాధానం చెప్పక పోతే- అతని మెడలో చచ్చిన పాము శవాన్ని వేసి వస్తాడు. శమీకుని పుత్రుడు శృంగి ఇది తెలిసి పరీక్షితుడు ఏడు రోజులలో తక్షక విషాగ్ని వలన చనిపోతాడని శాపం ఇస్తాడు. శృంగి తరువాత తండ్రికి ఈ విషయం చెప్పగా శమీకుడు శోకించి కొడుకుతో పై విధంగా అంటాడు.
వ.
క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధంబైన క్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుం డైన పరీక్షితునకుం బరీక్షింపక శాపంబిచ్చి చెట్ట సేసితివి. రాజ రక్షకులై కాదె మహామును లతిఘోరతపంబు సేయుచు వేదవిహితధర్మంబులు నడపుచు మహాశక్తిమంతు లయి యున్నవా రట్టిరాజుల కపకారంబు సేయునంతకంటె మిక్కిలి పాతకం బొం డెద్ది మఱియు భరతకుల పవిత్రుం డైన పరీక్షితు రాజ సామాన్యుంగా వగచితే.౧౭౬
వగచితే=తలఁచితివా?
ఉ.
క్షత్రియవంశ్యు లై ధరణిఁ గావఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రు లనఁగాఁ గల నాలుగు జాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామ మాం
ధాతృ రఘుక్షి తీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్.౧౭౭ (పోలిక కొంచెం ఎక్కువయిందని పిస్తుంది)
వ.
అతండు మృగయా వ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుడయి యెఱుంగక నా కవజ్ఞఁ జేసె నేనును దాని సహించితి నమ్మహాత్మునకు నీ యిచ్చిన శాపంబుఁ గ్రమ్మఱింప నేర్తేని ల గ్గగు ననిన శృంగి యిట్లనియె.౧౭౮
నేర్తేని=సాధ్యమయితేని
క.
అలుక మెయిమున్న పలికితి, నలుకని నాపలుకు తీక్ష్ణమై యింతకు ను
జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ, దలరఁగఁ బ్రేరేఁప కేల తా నెడ నుడుగున్.౧౭౯
తలరఁగన్=చలించునట్లుగ
వ.
నావచనం బమోఘం బనిన శమీకుండు శోకాకలితచిత్తుండై తన శిష్యున్ గౌరముఖుం డనువానిం బిలిచి దీనినంతయుఁ బరీక్షితున కెఱిగించి తక్షకువలనిభయంబు దలంగునట్టి యుపాయంబు చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ పరీక్షితు పాలికిం జని అన్ని విషయాలు తెలియజేస్తాడు--౧౮౦
తరువాత ఇక్కడో చిన్న కథ కూడా వుంది.
కశ్యపు డనే వైద్యుడొకడు తక్షక విషాగ్నిచే చనిపోయే పరీక్షితుని బ్రతికించి రాజు నుండి విశేషమైన ధనాన్ని పొందగోరి వెళ్తుంటాడు. ఇది తెలిసిన తక్షకుడు అతని కెదురుపడి అతన్నడిగి విషయం తెలుసుకొని నీకిది సాధ్యం గాదని సవాలు చేసి చేతనైతే- అక్కడ వున్న ఓ మహా వృక్షాన్ని కాటువేసి తన విషంతో బూడిదగా మార్చి- దానిని ముందటిలా తన వైద్యంతో పునర్జీవింప చేయమంటాడు. అతడు దానిని తన శక్తితో ముందటిలా పునర్జీవింప జేస్తాడు. అప్పుడు తక్షకుడే అతనికి విశేషమైన ధనాన్ని ఇచ్చి మరలింప చేస్తాడు. కొసలో చిన్నగమ్మత్తేంటంటే నిర్జనమైన అడవిలో జరిగిన ఈ విషయం బైట లోకానికెలా తెలిసిందన్నది. అక్కడ ఆ చెట్టుపైకి పుల్లలకోసం ఎక్కిన వాడొకడు చెట్టుతో పాటే దగ్ధమై మళ్ళీ చెట్టుతో పాటే పునర్జీవితుడైన వాడొకడు దీనిని ప్రజలకు చెప్పటం జరిగిందట. అదీ సంగతి.మన పూర్వీకుల్లో ఎంతెంత గొప్పవాళ్ళున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment