Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-5
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట.
క.
ఉపధాశుద్ధులఁ బాప, వ్యపగతబుద్ధుల వినీతవర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.౩౬

ధర్మాదులచే పరిశుద్ధులైన వారు, పాపవ్యపగతబుద్ధులు, వినీతి వర్తనులు, సమదృష్టి కలిగిన వారు, నిపుణులు అయినవారిని బాగుగా పరీక్షించి ధనసంపాదనాది రాజకార్యాలలో నియోగింస్తున్నావా? గవర్నమెంటు ఆఫీసర్లకుండాల్సిన
లక్షణాలన్నమాట అవి.
ఉ.
ఉత్తమమధ్యమాధమనియోగ్యుల బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమమధ్యమాధమనియోగములన్ నియమించి తే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి ననూనముగాఁ దగుజీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్.౩౭

రాజ ధర్మాల్ని ఎంత చక్కగా విశదీకరిస్తున్నారో చూడండి. ఉద్యోగులకు దయతో కాలము తప్పకుండా జీతాల్ని చెల్లిస్తుండాలట రాజు. ఎవరెవర్ని ఏ యే పనుల్లో నియోగించాలో బాగా తెలుసుకుని అలానే నియోగించాలట.
క.
తమతమకనియెడుతఱి జీ,తము గానక నవయుభటులదౌర్గత్యవిషా
దము లేలినవాని కవ,శ్యము నె గ్గొనరించు నతఁడు శక్రుండైనన్.౩౮

జీతాలు అందక ఉద్యోగులు బాధపడితే వాళ్ళ దుర్గతివల్ల కలిగే విషాదము ఆరాజు ఇంద్రుడైనా సరే అతనికి చెడును కలిగిస్తాయట.
పర్వములు | edit post
0 Responses

Post a Comment