Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౩
వ.
అని బ్రాహ్మణ స్వరూపంబుఁ జెప్పిన నెఱింగి వినతకు మ్రొక్కి వీడ్కొని గరుడుం డతిత్వరితగతిం బఱచి సముద్రోదరంబున నున్ననిషాదుల ననేకశతసహస్రసంఖ్యల వారిం బాతాళవివరంబునుంబోని తన కంఠబిలంబుఁ దెఱచి యందర నొక్క పెట్ట మ్రింగిన నందొక్క విప్రుండుండి కుత్తుకకు డిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి నాకంఠబిలంబున విప్రుం డున్న వాఁడేని వెలువడి వచ్చునది యనిన గరుడున కవ్విప్రృం డిట్లనియె.౬౩
ఉ.
విప్రుఁడ నున్నవాఁడ నపవిత్ర నిషాది మదీయభార్య కీ
ర్తిప్రియ దీనిఁబెట్టి చనుదెంచుట ధర్మువె నాకు నావుడున్
విప్రులఁ బొంది యున్న యపవిత్రులుఁ బూజ్యులుగారె కావునన్
విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్.౬౪
వ.
అనిన నాగరుడుని యనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీ సహితుండై వెలువడి వచ్చి గరుడుని దీవించి యథేచ్ఛం జనియె.౬౫

తరువాత కశ్యపుడు చెప్పినమీఁదట ఇంకా బలం కలగటానికి గరుడుడు గజకచ్ఛపాలని ఆరగించి అమృతం సాధించే నిమిత్తం స్వర్గలోకానికి వెళతాడు. అక్కడ అమృతరక్షకులను నిర్జించి అమృతాన్ని సాధిస్తాడు. అలా సాధించిన వానికి శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు
సీ.
అమృతాశనంబు చేయకయును దేవ నాకజరామరత్వంబు నందుటయును
నఖిలలోకంబుల కగ్రణివైన నీ యగ్రంబునందు నిన్నధికభక్తిఁ
గొలుచుచు నునికియుఁ గోరితిఁ గరుణతో దయచేయు ముద్ధత దైత్యభేది
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁడై యిచ్చి హరి యిట్టులనియె నాకు
ఆ.వె.
ననఘ వాహనంబ వై మహాధ్వజమ వై, యుండుమనినఁ బక్షియును బ్రసాద
మనుచు మ్రొక్కి పరచె నంత నాతనిమీఁద, వజ్రమెత్తి వైచె వాసవుండు.108
వ.
అదియును నంబరమున నగ్ని కణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజు పక్షంబుల దాఁకవచ్చినం జూచి గరుడుండు నగి నీ చేయు వేదన నన్నుం దాఁకనోపదు నీవు మహాముని సంభవంబ వగుటను దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింపరాదు గావు మదీయైక పర్ణశకలచ్ఛేదంబు సేయుము నాయందు నీ శక్తి యింతియ యనిన సకలభూతసంఘంబులెల్ల నాతనిపర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగడిరి.౧౦౯
వ.
ఇంద్రుడు గరుడునితో స్నేహము చేసి ఆతని బలపరాక్రమములను గురించి చెప్పమంటాడు. అప్పుడు గరుడుడు అతనితో--
క.
పరనిందయు నాత్మగుణో,త్కర పరికీర్తనముఁ జేయఁగా నుచితమె స
త్పురుషుల కైనను నీ క,చ్చెరువుగ నాకల తెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్.౧౧౪
ఉ.
స్థావరజంగమప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా
లావునఁ బూని తాల్తు నవిలంఘ్యపయోధిజలంబులెల్ల ర
త్నావళితోన చల్లుదు బృహన్నిజపక్ష సమీరణంబునన్
దేవగణేశ యీ క్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులన్.౧౧౫

త్రివిష్టపంబులు=మూడు లోకములు
ఇంద్రుడు గరుడునికి అతనికోరికమీద ఉరగభోజనత్వాన్ని అనుగ్రహిస్తాడు.




పర్వములు | edit post
5 Responses
  1. Anonymous Says:

    'త్రివిష్టపం' అనే మాటకు 'స్వర్గం' అనికదా అర్థమ్?
    స్వరవ్యయం స్వర్గ నాక స్త్రిదివ స్త్రిదశాలయా:|
    సురలోకో ద్యౌ దివౌ ద్వే స్త్రియాం క్లీబే త్రివిష్టపమ్||ఆమరకోశ:-1-1.
    అని కదా?


  2. Unknown Says:

    ఆర్యా,
    నా దగ్గరనున్న మహా భారత ప్రతి(లఘు టీక రచయిత శ్రీమాన్ ఉత్పల వేంకట రంగాచార్యులు)లో పేజీ క్రింద నున్న అథోసూచికలో అర్ధం అలా ఇవ్వబడింది. అదే నేను వ్రాసాను. మీ సందేహం చూసాక శబ్దరత్నాకరంలో చూస్తే మీరన్నట్లుగానే స్వర్గము,వేల్పుఁబ్రోలు అనే అర్థాలే వ్రాసి ఉన్నవి. బ్రౌణ్యంలో కూడా స్వర్గము అనే ఉంది. కాని ఇక్కడ త్రివిష్టపం అనే ఏకవచన పదాన్ని కాకుండా త్రివిష్టపంబులన్ అని బహువచనంలో ఉపయోగించుట వలన వారా అర్థాన్ని గ్రహించారేమో ననిపిస్తుంది నాకు. స్వర్గం అనేది ఒకటే కదా? స్వర్గాలు అనేవి (బహువచనం)ఉన్నాయా?
    అలా లేకపోతే ముల్లోకములను అనే అర్థం ఎంతవరకూ సబబో నాకు తెలియదు. అందుచేత ప్రస్తుతానికి అది అలానే ఉంచాను.ఇంకా ఎవ్వరైనా దీనిమీద వారి అభిప్రాయాలు తెలియజేస్తారేమో చూద్దాం.


  3. Anonymous Says:

    అయ్యా! నమస్కారములు.

    నేను, పాఠకులకు ఇలాటి సందేహం కలుగ వచ్చు.అవకాశం ఉంది అనే అభిప్రాయంతో మాత్రమే అలా రాసాను.

    ఇక వీషయానికి వస్తే మీరు రాసిన అర్థం తప్పేమీ కాదు.పైగా చాలా అర్థవంతమూ,ఆమోదయోగ్యమూనూ.
    ముల్లోకాలనే అక్కడ అర్థం.ఉత్పలవారి వ్యాఖ్యానమూ సరియైనదే.
    ఎందుకంటే 'త్రివిష్టపం' అనే పదమే కాకుండా 'విష్టపం' అని మరో పదముంది.దానికి 'లోకం' అనే అర్థం.అప్పుడూ మీరు ఇచ్చిన అర్థం ఏ నిరూపణ లేకుండానే ఘటిస్తుంది.
    ధన్యవాదాలు.


  4. Anonymous Says:

    అయ్యా! నమస్కారములు.

    క్షమించండి.మరో మాట మీరేమనుకోనంటే....
    పైన మీరు 'అధోసూచికలో' అని ప్రయోగించారు.కానీ అధస్సూచికలో/అధ:సూచికలో అని ఉండాలేమో!
    (వయసులో చదువులో చిన్నవాడిని.కోపగించుకోకండి.ఆశీర్వదించండి.)
    ధన్యవాదాలు.


  5. Unknown Says:

    మీరన్నదే సరియైనది.తప్పు సరిచేయటానికి వయసుతో సంబంధం లేదు.నేను వయసులో పెద్ద అవ్వచ్చు. కాని మీరు విద్యలో పెద్దలు. ఆచార్య స్థానంలో ఉన్నవారు.తప్పు సరిచేసే హక్కు మీ కెప్పుడూ ఉంటుంది.ఎవరి తప్పు వారికి చప్పున తెలియదు. తప్పు సరిచేసినందులకు మీకు నా ధన్యవాదములు.
    ఆంధ్రమహాభారతం-ఆణిముత్యాలు ను తెలుగుసూచీలో చేర్చినందులకు మీకు నా ధన్యవాదములు.
    ఇంకో విషయం.అన్నమయ్య పలుకుబడులు-జాతీయములు పేరున అన్నమయ్య సంకీర్తనలలోని నుడికారములను,సామెతలను,జాతీయములను ఆ యా సంపుటముల వారిగా ఈ బ్లాగులో ఉంచుతున్నాను.ఇప్పటికి రెండు సంపుటములు పూర్తి అయినవి.మూడో సంపుటం పూర్తి కావస్తున్నది. ఈ బ్లాగును కూడా ఓసారి చూడగలరు. బాగున్నట్టయితే టూల్బార్ కి అనుసంధించవచ్చు.
    http://mutyalasaraalu.blogspot.com/
    సెలవు.


Post a Comment