Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౭
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము
సీ.
క్రోధంబు పాపంబు గ్రోధంబునన చేసి యగుఁ ధర్మ కామార్థహాని
కడుఁ గ్రోధి కర్జంబు గానండు క్రుద్ధుండు గురునైన నిందించుఁ గ్రుద్ధుఁ డై న
వాఁడవధ్యుల నైన వధియించు మఱియాత్మఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ
ఆ.వె.
యెఱుక గల మహాత్ముఁ డెఱుక యన్జలముల, నార్చుఁ గ్రోధ మను మహానలంబు
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు, దాల్చు దేశకాలతత్వ మెఱిఁగి.౨౨౨

క్రోధం - పాపం. దానివలన ధర్మ,అర్థ,కామాలకు హాని కలుగుతుంది. ఎక్కువ కోపి యైనవాడు కార్యముపై దృష్టి పెట్టలేడు, గురువు నైనా నిందిస్తాడు, వధింపగూడని వారిని వధిస్తాడు, చివరకు తనకు తానే హాని చేసుకుంటాడు. మావంటి ధర్మాన్ని అనుసరించే వారికి క్రోధాన్ని దాల్చటం గుణమా? క్రోధమనే గొప్ప అగ్నిని ఎఱుక అనే జలంతో ఎఱుక గలిగిన మహాత్ములు ఆర్పివేస్తారు. దేశకాలతత్వాన్ని ఎఱిగి క్రోధవర్జితు డైనవాఁడు తేజస్సును పొందుతాడు.
క.
క్షమ గలవానికిఁ బృథ్వీ,సమునకు నిత్యంబు విజయసంసిద్ధి యగున్
క్షమ యైనవానిభుజవి,క్రమము గడున్ వెలయు సర్వకార్యక్షమ మై.౨౨౩

క్షమకలవాడు భూదేవితో సమానుడు వానికి ఎప్పుడూ విజయం చేకూరుతుంది. సర్వ కార్యములయందును క్షమాగుణము కలవాని భుజవిక్రమము ప్రకాశిస్తుంది.
వ.
తేజః ప్రభవంబు లైన యమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు క్షమావంతునంద వీర్యవంతంబు లగుఁ దొల్లి కశ్యపగీత లైన గాథలయం దీయర్థంబు వినంబడు వినుము వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగ మంతయు క్షమయంద నిలిచినవి తప స్స్వాధ్యాయయజ్ఞ కర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు వడయుదురు.౨౨౪
అమర్ష=కోపము
ఇలా చెప్పి ద్రౌపది ఇంకా వాదానికి దిగితే ఆమెతో ధర్మరాజు
వ.
నాస్తికులయట్లు ధర్మాభిశంకిని వై దైవదూషణంబు సేసెదు శిష్టచరితం బయిన ధర్మంబు నధిక్షేపించు చున్న దుర్మతికిం బ్రాయశ్చిత్తంబు లేదు ధర్మువు దప్పక నిత్యులై జీవించు చున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ఠ నారదప్రభృతులం బరమ యోగధరులం బ్రత్యక్షంబ చూచెదము వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతు రన్యు లన్యాయంబు సేసి రనియు నే నేల ధర్మువు దప్పుదు.౨౨౮
క.
ధీరమతియుక్తిఁ జేసి వి,చారింపఁగ నిక్కువంబు సర్వజనస్వ
ర్గారోహణసోపానం, బారఁగ ధర్మంబ చూవె యతిరమ్యం బై.౨౨౯

అదీ ధర్మరాజు ధర్మ నిరతి. అందుకేనేమో స్వర్గారోహణ పర్వం చివరలో ధర్మరాజు మాత్రమే వెంట వచ్చిన కుక్కతో కలసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలగటం జరుగుతుంది.
పర్వములు | edit post
0 Responses

Post a Comment