Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౭
ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మము లెఱింగించుట
ఉ.
ఎండకు వాన కోర్చి తనయిల్లు ప్రవాసపుఁ జోటు నాక యా
కొండు నలంగుదున్ నిదురకుం దఱి దప్పెను డప్పి వుట్టె నొ
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా
తం డొక చాయ చూపినను దత్పరతం బనిసేయు టొ ప్పగున్.౧౩౫

సేవకుడనేవాడు ఎండకు వానకు ఓర్చుకోవాలి. తన యిల్లు చాలా దూరం అని అనక ఆకలవ్వుతుంది, అలసిపోయాను, నిదరపోవడానికి కాలమయింది, దప్పికవుతుంది, ఒక్కడ్నే ఎలా చెయ్యను, అని సణగకుండా రాజుగారు ఓదారి చూపితే
పనిచేయాల్సినచోట అదే ధ్యాసతో పని చేయటం మంచిదవుతుంది.
క.
తా నెంతయాప్తుఁ డై నమ,హీనాయకు సొమ్ము పాము నెమ్ములుగా లో
నూనినభయమునఁ బొరయక, మానినఁ గాకేల కలుగు మానము బ్రదుకున్.౧౩౬

రాజుకు తానెంత ఆప్తుడైనా సరే రాజుగారి ధనం పాముతలమీది మణిలా లోన భయముకలిగి ప్రవర్తించకపోతే మానము బ్రదుకు కూడా దక్కవు.
ఆ.
ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ,నంబు గుప్తవర్తనములు గాఁగఁ
జలుపవలయు నృపతి కొలువున్న యెడల బా,హిరము లైనఁ గెలని కెగ్గు లగుట.౧౩౭

రాజుగారు కొలువున్నప్పుడు ఆవులింత, తుమ్ము, నవ్వు, ఉమియుట -ఇవి ఇవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి. బయటకు తెలిస్తే అందరి దృష్టి నీమీదే వుంటుంది.
క.
వైరుల దూతలు నెర వగు, వారు నిరాకృతులుఁ బాపవర్తులుఁ దమకుం
జేరువగా వర్తించుట, నేరమి తుదిఁ బోయి చేటు నిందయు వచ్చున్.౧౩౮

శత్రురాజుల దూతలు , నెరవగువారు(?), రూపము లేనివారు, పాపవర్తులు - తమకు చేరువగా మెలగటాన్ని సేవకులు తెలుసుకోలేకపోతే చివరకు చేటు, నింద కూడా కలిగిస్తారువాళ్ళు.
ఆ.
వసుమతీపాల వర్తించు నేనుంగు, తోడ నైన దోమతోడ నైన
వైరమగు తెఱంగు వలవదు తా రెంత, పూజ్యు లైన జనులపొందు లెస్స.౧౩౯

రాజు గారి దగ్గరగా వర్తించే ఏనుగు వంటి వారితో గాని దోమ లాంటి వారితోగాని వైరము పూనటం తగదు. అటువంటి వారితో స్నేహమే మంచిది.
క.
కలిమికి భోగముల కదా, ఫల మని తను మెఱసి బయలుపడఁ బెల్లుగ వి
చ్చలవిడి భోగింపక వే,డ్కలు సలుపఁగ వలయు భటుఁ డడంకువతోడన్.౧౪౦

ధనము ఉంది కాబట్టి భోగించాలని అట్టహాసంగా విచ్చలవిడిగా ఉండకుండగా అణకువతో నే మెలగాలి.ఇవన్నీ సేవకులు రాజులపట్ల చూపించాల్సిన పాటించాల్సిన సేవాధర్మములు. అజ్ఞాత వాస సమయంలో పాండవులు రాజు దగ్గఱ సేవలు చేస్తూ ఉండాల్సి ఉంది కాబట్టి వారి పురోహితు డైన ధౌమ్యుడు పాండవులకు ఇవన్నీ పాటించాలని ఉపదేశిస్తాడు. ఈ కాలానికైనా ఏ కాలానికైనా ఇవే ధర్మాలు అందరు సేవకులకూ కూడా వర్తిస్తాయి.
పర్వములు | edit post
0 Responses

Post a Comment