Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-3
మ.
అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై
సుమహా వర్గచతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్తమనానాగుణకీర్తనార్థఫల మై ద్వైపాయనోద్యానజా
తమహాభారతపారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్య మై.65

అమితమైన ఛిన్నకథలనే కొమ్మలతో ప్రకాశిస్తూ వేదార్థములతోడి
నిర్మలమైన నీడతో వివిధరకములైన మంచిగొప్పపుష్పవితతితో
శోభనొంది కృష్ణార్జునుల ఉత్తమ నానాగుణ కీర్తనల అర్థముయొక్క
ఫలమై ద్వైపాయనమనే వనములో పుట్టిన పారిజాతవృక్షము
భూదేవతల(బ్రాహ్మణుల) చే ప్రార్థితమై అలరారుతుంది.

మహాభారతం నిజంగామనకోసం ఏర్పరచబడిన పారిజాత వృక్షమే,
అందుచేతే ఆ గ్రంధపఠనం మన అనేక కోరికలను తీరుస్తుంది.
పూర్తి గ్రంధం చదవాలనున్నా చదవలేని వారనేకమంది. వారి
సౌకార్యార్థం క్లుప్తంగా నైనా తెలియ చేద్దామనేదే ఈ చిన్ని ప్రయత్నం.
మిడి మిడి జ్ఞానంతో చేసే ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులు దొర్లితే
క్షమించి సరిదిద్ది ప్రోత్సహించ గలందులకు విజ్ఞులైన బ్లాగ్మిత్రులను
ఇందుమూలంగా వేడుకొంటున్నాను.

వ.
ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోప
శోభితంబు నుపద్వీపమహాద్వీపసంభృతం బయిన భువనం బజుండు
నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుండై
సంవత్సర త్రయంబు నిర్మించి దాని దేవలోకమునందు వక్కాణింప నారదుం
బనిచెఁ బితృలోకంబున వక్కాణింప నసితుండైన దేవలుం బనిచె
గరుడగంధర్వయక్షరాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె
నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె మనుష్యలోకంబున
జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె నే నా
వైశంపాయనమహామునివలన విని వచ్చితిఁ ,
కృతత్రేతావసానసమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబునుం
బోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహా ఘోర యుద్ధం బయ్యె.౬౬
మహా భారత నిర్మాణానికి సంవత్సరములు పట్టిందట. దానిని ప్రచారం చేయటానికి దేవలోకానికి నారదుడిని, పితృలోకానికి అసితుడైన దేవలుడినిగరుడగంధర్వయక్షరాక్షసలోకాలకి శుకుడిని,నాగలోకానికి సుమంతుడిని,మనుష్యలోకములో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయన మహర్షిని పంపించాడు. నేనా వైశంపాయుని వలన విని వచ్చాను. పూర్వం కృతయుగానంతరం దేవదానవులకు, త్రేతా యుగాతంలో రామరావణ యుద్ధం జరిగినట్లే ద్వాపర యుగాంతంలో పాండవ ధార్తరాష్ట్రులకు మహా ఘోరమైన యుద్ధం జరిగింది.
పర్వములు | edit post
0 Responses

Post a Comment