Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౪
మత్స్యగంధి వృత్తాంతము, శ్రీ వేదవ్యాస మునీంద్రుని అవతారము
సీ.
చపలాక్షి చూపులచాడ్పున కెద మెచ్చుఁ జిక్కని చనుఁగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీఁగయందంబు మది నిల్పు జఘనతలంబుపైఁ జరుపు దృష్టి
యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు వేడ్కతో మఱుమాట వినఁగఁదివురు
నతి ఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు
ఆ.వె.
నెంతశాంతు లయ్యు నెంత జితేంద్రియు, లయ్యుఁగడువివిక్త మయిన చోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు రెందుఁ, గాముశక్తి నోర్వఁగలరె జనులు.౩౮
పరాశర మహర్షి ఒకసారి మత్స్యకన్య యైన సత్యవతి యేకవస్త్రయై ఓడనడుపుతూ ఉన్నపుడు ఆమె జన్మరహస్యం
దివ్యదృష్ఠితో నెఱిఁగిన వాడై ఆమెయందు మదనపరవశుడయ్యి ఆమె ఓడ నెక్కి ఆ విధంగా ప్రవర్తించాడట.
ఉ.
సంచితపుణ్యుఁ డంబురుహ సంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁ డైనవాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్త జగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరఁగు భారత సంహితఁ జేసె నున్నతిన్.౪౭
సత్యవతి యందు పరాశరమునికి సద్యోగర్భంబున వేదవ్యాస మహర్షి జన్మిస్తాడు. ఆ వేదవ్యాసుడే వేదవాజ్ఞ్మయాన్ని విభాగించి లోకములలో వ్యాప్తి నొందించి సమస్తలోకాలకు హితవు గూర్చేట్లుగా పంచమ వేదమైన భారత సంహితను నిర్మిస్తాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment