Unknown
సభా పర్వము-ప్రథమాశాస్వము-౨
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట
భారతంలో చాలా చోట్ల వివిధములైన ధర్మాలను చెప్పటం జరిగింది.
ఈ సందర్భంలో నారదుడు ధర్మరాజుని అడిగినట్లు పరోక్షంగా వివిధములైన
రాజధర్మాలను ఉపదేశించటం జరిగింది.

సీ.
మీ వంశమున నరదేవోత్తముల దైన సద్ధర్మమార్గంబు సలుపు దయ్య
ధర్మ విదుండ వై ధర్మార్థకామంబు లొండొంటి బాధింపకుండ నుచిత
కాల విభక్తముల్ గాఁ జేసి సేవింతె ధర్మవునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపర రాత్రమ్ములం దెప్పుడుఁ జింతింతె నిజబుద్ధిఁ జేయఁ దగిన
ఆ.
రాజకృత్యములఁ దిరంబుగా నిఖిల ని, యోగవృత్తులందు యోగ్యు లయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె, నీవు వారి దయిమ నే ర్పెఱింగి.26

ఓ ధర్మరాజా! మీ వంశమున రాజశ్రేష్ఠులదైన సద్ధర్మమార్గాన్ని సలుపుతున్నావా!
ధర్మవిదుడవై ధర్మార్థకామాలు ఒకదానితో నొకటి బాధింపబడకుండగా కాల
విభజనం చేసి సేవిస్తున్నావా! ధర్మమునందే మనస్సును నిలిపి రాత్రి నాల్గవ
జాములో చింతన చేస్తున్నావా! స్వబుద్ధితో చేయదగిన రాజకార్యాలు ఎవరు
ఏయే పనులు చేయసమర్థులో వారి వారి నాయా కార్యాలలో సరిగా గౌరవముతో
చేయటానికి నియమించావా!
(ఇంకావుంది)
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-5
ఉ.
ఇమ్ముగ సర్వలోక జనులెవ్వనియేనిముఖమృతాంశుబిం
బమ్మున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం
ధ్ర మ్మనునంజలిం దవిలి త్రావుదు రట్టిమునీంద్రలోకవం
ద్యు మ్ముని నప్పరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.76

ప్రసిద్ధిగా సర్వలోక జనులు ఎవ్వని చంద్రబింబమువంటి ముఖాన్నుండి
వెలువడే భారతవాగమృతమును చెవి రంధ్రమనే అంజలిని పట్టి త్రాగుతారో
అట్టి మునీంద్రుడు, లోకముచే పొగడబడ్డ- పరాశరసుతుడైన వ్యాసునికి
మిక్కిలి భక్తితో ప్రణమిల్లి--రోమహర్షణుడు భారతగాథను ప్రారంభిస్తున్నాడు.

అక్షౌహిణీ సంఖ్యావివరము.
సీ.
వరరథ మొక్కండు వారణ మొక్కండుతురగముల్మూఁడు కాల్వురును నేవు
రనుసంఖ్య గలయదియగుఁ బత్తి యదిత్రిగుణంబైనసేనాముఖంబు దీని
త్రిగుణంబు గుల్మంబు దీనిముమ్మడుఁ గగుగణముతద్గణముత్రిగుణిత మైన
వాహినియగు దానివడిమూఁటగుణియింపఁ బృతన నాబరఁగుఁదత్పృతనమూఁట
ఆ.
గుణితమైనఁ జము వగున్ మఱి దానిము,మ్ముఁగనీకినీసమాఖ్య నొనరు
నదియుఁ బదిమడుంగులైన నక్షౌహిణి, యౌ నిరంతర ప్రమానుసంఖ్య.80

ఈ మధ్యనే ఓ బ్లాగరి అక్షౌహిణీ సంఖ్యను గురించి వారి బ్లాగులో వ్రాసారు.
ఒక రధము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు, ఐదుగురు భటులు - బత్తి
౩ బత్తిలు ఒక సేనాముఖము
౩ సేనాముఖములు ఒక గుల్మము
౩ గుల్మములు ఒక గణము
౩ గణములు ఒక వాహిని
౩ వాహినులు ఒక పృతన
౩ పృతనలు ఒక చమువు
౩ చమువులు ఒక అనీకినీ సమాఖ్య
౧౦ అనీకినీ సమాఖ్యలు ఒక అక్షౌహిణి.
అంటే ఒక అక్షౌహిణికి ౨౧౮౭౦ రథములు, ౨౧౮౭౦ ఏనుగులు, ౬౫౬౧౦ గుఱ్ఱములు,
౧౦౯౩౫౦ మంది వీరభటులు గలది. ఇటువంటి ౧౮ అక్షౌహిణులు మహాభారత యుద్ధంలో
పాల్గొన్నాయి.అంటే మొత్తం ౩,౯౩,౬౬౦ రథములు, ౩,౯౩,౬౬౦ ఏనుగులు,
౧౧,౮౦,౯౮౦ గుఱ్ఱాలు, ౧౯,౬౮,౩౦౦ వీరభటులూ ఈ యుద్ధంలో పాల్గొన్నారు.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-4
సీ.
ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక విహితావధాను లై వినుచు నుండు
వారికి విపులధర్మార్థారంభసంసిద్ధి యగుఁ బరమార్థంబ యశ్రమమున
వేదముల్ నాలుగు నాదిపురాణముల్ పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ
శాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్త్వంబులు నెఱిఁగినఫల మగు నెల్లప్రొద్దు
ఆ.
దానములను బహువిధక్రతుహుతజప, బ్రహ్మచర్యములను బడయఁబడిన
పుణ్యఫలము వడయఁ బోలు నశేషపా,పక్షయంబు నగుశుభంబు వెరుఁగు.71

ఈ మహాభారతాన్ని శ్రద్ధగా వినేవారికి అనేక ధర్మార్ధాలను ప్రారంభం చేసిన సిద్ధి
అవుతుంది.శ్రమలేకయె పరమార్థం సిద్ధిస్తుంది. నాలుగు వేదాలు, పద్ధెనిమిది
పురాణాలు, వానిలో చెప్పబడే ధర్మశాస్త్రములు, మోక్షశాస్త్ర తత్త్వములు
తెలుసుకొన్న ఫలం కలుగుతుంది .ఎల్లప్పుడూ దానములను, బహువిధమైన
క్రతువులను, జపము బ్రహ్మచర్యము వలనికలుగు పుణ్యఫలము కలుగుతుంది.
పాపాలు నశిస్తాయి. శుభాలు పెరుగుతాయి.
ఉ.
సాత్యవతేయవిష్ణుపదసంభవ మై విభుధేశ్వరాబ్ధిసం
గత్యుపశోభితం బయి జగద్విదితం బగుభారతీయభా
రత్యమరాపగౌఘము నిరంతర సంతతపుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.72

వ్యాసుఁడనెడి యాకాశమునుండి దేవేంద్రుడనెడి సముద్రమును కలసి
శోభనుపొందు జగద్విదితమగు భారతీయభారతి అనబడే దేవనదీ
ప్రవాహము నిరంతరము విన్నవారికి, కొనియాడిన వారికందరికీ
సంతతమైన పుణ్యసంపదలను అధికంగా అభివృద్ధి నొందిస్తుంది .


Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-3
మ.
అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై
సుమహా వర్గచతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్తమనానాగుణకీర్తనార్థఫల మై ద్వైపాయనోద్యానజా
తమహాభారతపారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్య మై.65

అమితమైన ఛిన్నకథలనే కొమ్మలతో ప్రకాశిస్తూ వేదార్థములతోడి
నిర్మలమైన నీడతో వివిధరకములైన మంచిగొప్పపుష్పవితతితో
శోభనొంది కృష్ణార్జునుల ఉత్తమ నానాగుణ కీర్తనల అర్థముయొక్క
ఫలమై ద్వైపాయనమనే వనములో పుట్టిన పారిజాతవృక్షము
భూదేవతల(బ్రాహ్మణుల) చే ప్రార్థితమై అలరారుతుంది.

మహాభారతం నిజంగామనకోసం ఏర్పరచబడిన పారిజాత వృక్షమే,
అందుచేతే ఆ గ్రంధపఠనం మన అనేక కోరికలను తీరుస్తుంది.
పూర్తి గ్రంధం చదవాలనున్నా చదవలేని వారనేకమంది. వారి
సౌకార్యార్థం క్లుప్తంగా నైనా తెలియ చేద్దామనేదే ఈ చిన్ని ప్రయత్నం.
మిడి మిడి జ్ఞానంతో చేసే ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులు దొర్లితే
క్షమించి సరిదిద్ది ప్రోత్సహించ గలందులకు విజ్ఞులైన బ్లాగ్మిత్రులను
ఇందుమూలంగా వేడుకొంటున్నాను.

వ.
ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోప
శోభితంబు నుపద్వీపమహాద్వీపసంభృతం బయిన భువనం బజుండు
నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుండై
సంవత్సర త్రయంబు నిర్మించి దాని దేవలోకమునందు వక్కాణింప నారదుం
బనిచెఁ బితృలోకంబున వక్కాణింప నసితుండైన దేవలుం బనిచె
గరుడగంధర్వయక్షరాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె
నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె మనుష్యలోకంబున
జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె నే నా
వైశంపాయనమహామునివలన విని వచ్చితిఁ ,
కృతత్రేతావసానసమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబునుం
బోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహా ఘోర యుద్ధం బయ్యె.౬౬
మహా భారత నిర్మాణానికి ౩ సంవత్సరములు పట్టిందట. దానిని ప్రచారం చేయటానికి దేవలోకానికి నారదుడిని, పితృలోకానికి అసితుడైన దేవలుడినిగరుడగంధర్వయక్షరాక్షసలోకాలకి శుకుడిని,నాగలోకానికి సుమంతుడిని,మనుష్యలోకములో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయన మహర్షిని పంపించాడు. నేనా వైశంపాయుని వలన విని వచ్చాను. పూర్వం కృతయుగానంతరం దేవదానవులకు, త్రేతా యుగాతంలో రామరావణ యుద్ధం జరిగినట్లే ద్వాపర యుగాంతంలో పాండవ ధార్తరాష్ట్రులకు మహా ఘోరమైన యుద్ధం జరిగింది.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-2
చ.
అమల సువర్ణ శృంగఖుర మై కపిలం బగుగోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసినఁదత్ఫలంబు త
థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణ ప్రవణంబుకావునన్.15

స్వచ్ఛమైన బంగారపు కొమ్ములను గిట్టలను కలిగి, కపిలవర్ణము గల నూరు
గోవులను ఉత్తములైన బహువేదములలో పరిశ్రమ చేసిన విప్రులకు దానము
చేసిన వలన కలిగే ఫలం తప్పనిసరిగా సమకూరుతుంది భారత గాథను
విన్నటువంటి వారికి. నా చిత్తము ఎల్లప్పుడూ భారతకథను వినుటయందు ఆసక్తి
కలిగి ఉంటుంది.
క.
బహుభాషల బహువిధముల, బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహులగువారికి నెప్పుడు, బహుయాగంబులఫలంబు పరమార్థమగున్.17

వ. అని యానతిచ్చిన విని యక్కవివరుండిట్లనియె.18
చ.
అమలినతార కాసముదయంబుల నెన్నను సర్వ వేదశా
స్త్రంబుల యశేషసారము ముదంబునఁ బొందను బుద్ధి బాహువి
క్రమమున దుర్గమార్థజలగౌరవభారత భారతీసము
ద్రముఁ దఱియంగ నీఁదను విధాతృన కైనను నేరఁ బోలునే.19

స్వచ్ఛమైన నక్షత్రాలను లెక్కించను, అన్నివేదాలసారాన్ని సంతోషముతో
పొందుటను, భారత భారతీ సముద్రాన్ని దాటేలా యీదగలగటం --యివి
విధాతకైనా సాధ్యం కానివి.
క.
ఏయది హృద్య మపూర్వం, బేయది యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బై యుండు నఘనిబర్హణ, మేయది యక్కథయ వినఁగ నిష్టము మాకున్.29

రోమహర్షుణుని పుత్రుడైన రౌమహర్షణి, శౌనకాది మునులతో, ఏకథను నా వలన
వినగోరుతున్నారని అడిగినప్పుడు వారంతా పై విధంగా పలికారట.
సీ.
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రం బని యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతి శాస్త్రంబని కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు లక్ష్యసంగ్రహమని యైతిహాసికు లితిహాస మనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్ఛయం బని మహిఁ గొనియాడుచుండ
ఆ.
వివిధ వేదతత్త్వవిదుఁడు వేదవ్యాసుఁ, డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీన మై, పరఁగుచుండఁ జేసె భారతంబు.31

ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం అంటారట. అధ్యాత్మవిదులు వేదాంతం అంటారట.
నీతివిచక్షణులు నీతి శాస్త్రం అంటారట. కవివృషభులు మహాకావ్యం అంటారట.
లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహం అంటారట.ఐతిహాసికులు ఇతిహాసమంటారట.
పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయం అంటారట. ఈ విధంగా ఈ
భూమి మీద కొనియాడుచున్న మహాభారతాన్ని
వివిధ వేదతత్త్వవిదుఁడు,
ఆదిముని, పరాశరమహర్షి కుమారుడు ఐన వేదవ్యాసుడు విష్ణుసన్నిభుడు
విశ్వానికంతా శుభం కలగాలని రచన చేసాడు.
సీ.
ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు నర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మప్రాప్తియు వినయార్థులకు మహావినయమతియుఁ
బుత్త్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థుల కిష్టసంపదలును
గావించు నెప్పుడు భావించు వినుచుండువారల కిమ్మహాభారతంబు.
ఆ.
భక్తియుక్తు లైన భాగవతులకు శ్రీ,వల్లభుండు భక్తవత్సలుండు
భవభయంబులెల్లఁ బాపి యిష్టార్థసం,సిద్ధిఁ గరుణతోడఁ జేయునట్లు. 33

ఆయువు కోరేవారికి దీర్ఘాయువు, ధనముకోరేవారికి ఎక్కువ ధనసంపద,
ధర్మాన్ని కోరేవారికి నిత్యధర్మప్రాప్తి, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయసంపద,
పుత్రసంతానం కోరేవారికి బహుపుత్ర సమృద్ధి, సంపదలు కోరేవారికిష్టసంపదలు,
కావిస్తుంది ఎప్పుడూ భారతాన్ని భావించి వినేవారికి. అదెలాగంటే భక్తవత్సలుడైన
శ్రీవల్లభుడు భక్తియుక్తులైన భాగవతులకు భవభయాలన్నిటిని పోగొట్టి కరుణతో
యిష్టార్థ సంసిద్ధిని కలిగించినట్లుగా నన్నమాట.


Unknown
స్త్రీ పర్వము-ప్రథమాశ్వాసము-1
చచ్చిన వీరులకు ఉదకప్రదానాదులు చేయుట
తరల.
ధరణినాయక యట్లు పుత్రశతంబు వైరికులంబు చే
నిరవశేషత నొందుటన్ మహనీయగౌరవహీనతం
బొరసి కొమ్మలు తున్మ మ్రోడ్పడుభూరుహంబును బోలె ని
ర్భరవిపద్వికలాత్ముఁడై ధృతరాష్ట్రుఁ డుల్లము వెమ్మగన్.4

అలా నూర్గురు పుత్రులు వైరులచే చచ్చుటచే కొమ్మలన్నీ తుంచగా మోడయి నిలచిన భూరుహమును పోలి ఉన్నాడట ఆ ధృతరాష్ట్రుడు.
వ.చింతాభరంబున నూరక యున్నం జూచి సంజయుం డతని కిట్లనియె.5
వ.
పదునెనిమిదియక్షౌహణిలు సమసెఁ బితామహపితృభాతృపుత్రపౌత్రసఖిసుహృత్సహాయులుం దెగి రందు వగపునకుం బని గానివారలు కలరే యేది కొలందిగా నగ చె దందఱకు నగ్ని కార్యంబు నిర్వర్తింపను దగినవారలకుం దిలోదకప్రదానంబులు చేయను వలయుఁ బొలిగలనికి(స్మశానము) వేంచేయుము.7

Unknown
సౌప్తిక పర్వము-ప్రథమాశ్వాసము-1
అశ్వత్థామ ఉపపాండవులను చంపుట
తే.
సంజయునిచేత గురుసుతోత్సాహ మట్లు
వినిన ధృతరాష్ట్రుఁ డిట్లను వీరవర్యుఁ
డనఁగఁ జాలునశ్వత్థామయును సహాయ
రథికులును విక్రమించినక్రమము చెపుమ.3
సంజయునిచేత అశ్వత్థామ ఉత్సాహాన్ని వినిన ధృతరాష్ట్రుడు -వీరవరుడైన అశ్వత్థామ, తక్కిన సహాయ రథికులు ఏవిధంగా విక్రమించారో చెప్పమంటాడు.
Unknown
శల్య పర్వము-ప్రథమాశ్వాసము-1
సంజయుడు ధృతరాష్ట్రునికి దుర్యోధనాదుల మరణము తెలుపుట
సీ.
జననాథ శల్యుండు సమసె సౌబలుడు గీటడఁగె నులూకుండు మడిసె సకల
సంశప్తకులుఁగడచనిరి కాంభోజశతానీకములుఁ దేగటాఱె యవన
పార్వతీయమ్లేచ్ఛ బలములుఁ ద్రుంగె నల్ దిక్కుల మన్నీలుఁ దక్కుఁగలుగు
నరనాయకులును జచ్చిరి కుమారులు కలయందఱుఁ దెగిరి కర్ణాత్మజులును
తే.
బొలిసి రయ్య వృకోదరుపలుకుతప్ప,కుండఁ దద్గదాదండ ప్ర చండనిహతి
రెండుతొడలును విఱిగి ధరిత్రిఁ బెలుచఁ,గూలి రూపఱి రారాజు ధూళి బ్రుంగె.9
ఓ రాజా! శల్యుడు, సౌబలుడు,ఉలూకుడు, అందరు సంశప్తకులు, కాంభోజశతానీకములు,
యవన పార్వతీయమ్లేచ్ఛబలములు, అంతేకాకుండా నాలుగు దిక్కులనుండి వచ్చిన
మన్నీలుడు మొదలుగా నరనాయకులందఱూ, కుమారకులు, కర్ణుని కొడుకులందరూ--
అందరూ చచ్చిరి. భీముడు చేసిన ప్రతిజ్ఞానుసారము ఆతని గదాదండ ప్రచండ నిహతి
రెండు తొడలును విఱిగి నేలకూలి రారాజు రూపుచెడి మన్నులో కలిసిపోయాడు.
Unknown
కర్ణ పర్వము-ప్రథమాశ్వాసము-1
సంజయుడు ధృతరాష్ట్రునికి కర్ణుడు తెగుటను చెప్పుట
క.
బలవిక్రమములు వినుతం, బులుగా మనమొనలుఁ బాండుపుత్రానీకం
బులు రెండునాళ్ళు పోరుట, తెలియంగాఁ జూచి వచ్చితిం గురునాథా.3

బలవిక్రమములు ప్రకటితమగునట్లుగా మన సేనలు పాండవబలంబులు రెండు రోజులపాటు జరిపిన యుద్ధాన్ని చబచి వచ్చాను రాజా.
వ. అని పలికి కర్ణునిం బ్రశంసించి.4
చ.
సరకుగొనండు పాండుసుతసైన్యనికాయము నించుకేనియున్
గరులు రథంబులున్ హరులుఁ గాల్బలముల్ తనవీఁక విచ్చియున్
మరలియుఁ దూలియుం బిలుకుమాలియు నల్గడఁ బాఱియున్ వియ
చ్చరులకు వేడ్క సేయ భుజసారము శౌర్యముఁ జూపె నేపునన్.5
వ.
చూపి యక్కౌంతేయులం గలంచి యాడి పదంపడి.6
తే.
తనకు బిమ్మిటి యైనయర్జునునిబాహు, లీల నెమ్మెయిఁ ద్రోవంగ లేక తెగియె
నధిప యాఁబోతు బెబ్బులికగ్గ మైన, పగిదియై పాండవులకును బగయడంగె.7
Unknown
ద్రోణ పర్వము
సంజయుడు యుద్ధవృత్తాంతం ధృతరాష్ట్రునికి చెప్పుట
ధృతరాష్ట్రుడు సంజయునితో--
చ.
అమరనదీతనూజు సమరావనిఁ గోల్పడి నాదుయోధవ
ర్గము మఱి యెవ్వరిం గొని పరాక్రమదుర్దమపాండుపుత్ర సై
న్యమునకు మార్కొనం దలఁచె నక్కట కౌరవు లేమిచేసి రా
సమయమునన్ బలప్రచయసంఘటనం బెటులయ్యె సంజయా.

భీష్ముని తరువాత నా సైన్యము ఎవరి సారధ్యంలో ఫాండవులను ఎదుర్కొన్నది.కౌరవులు ఏమి చేసారు. అప్పుడేమి జరిగింది- అని సంజయుని ధృతరాష్ట్రుడు అడుగుతాడు.
Unknown
భీష్మ పర్వముప్రథమాశ్వాసము-1
ధృతరాష్ట్రునికడకు వేదవ్యాసుండు వచ్చుట
ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుడు వచ్చిఆతని అర్చనలు స్వీకరించి అతనితో --
క.
కాలం బగుటయు నృపులకు, నాలము సమకూడె దీని కడలకు మది నీ
వాలోకింపఁగ వలసిన, నే లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్రా.6
రాజులందరికీ కాలం మూడటం వలన ఈ యుద్ధము వచ్చింది. దీనికి బాధ పడకుము. ఈ యుద్ధం నీవు చూడదలచిన నీకు దివ్యదృష్టి నిస్తాను అనగా అతడు యుద్ధాన్ని చూడదలచలేదు, కాని దానిని గురించి వినాలని వుంది అంటాడు.
అప్పుడు వ్యాసభగవానుడు సంజయునికి యుద్ధం గురించి సర్వమూ విదితమయ్యే లాగున వరమిస్తాడు. సంజయుడు యుద్ధాన్ని మొత్తం చూచివచ్చి ధృతరాష్ట్రునికి చెపుతుంటాడు ఆ వర ప్రభావంతో.
Unknown
స్వర్గారోహణ పర్వముఏకాశ్వాసము-1
ధర్మరాజు స్వర్గలోకమున బంధుదర్శనము చేయకోరుట.
వ.
అట్లు బంధుదర్శనంబు గోరి పలికిన పాండవాగ్రజు తలంపున కనుకూలుండై యాఖండలుండు.
సీ.
తగువాని రావించి ధర్మ నందనునకుఁ దనవారిఁ జూడఁ జిత్తమునఁ గోర్కి
దనికినయది నీ వితనిఁగొని వేచని యఖిలబంధులఁ జూపు మనుడు నతఁడు
గారవం బెసఁగంగ నారాజసత్తముఁ దోడ్కొని పోవఁ గుతూహలమునఁ
దోడన నారదాదులు కొంద ఱరిగి ర ట్లేగెడు చోటఁ దట్టెదురఁ దోచె
తే.
నున్నతాసనాసీనుఁ డభ్యుదితసరసి,జాప్తసంకాశుఁ డమృతాశనాంగనాది
వృతుఁడు వీరలక్ష్మీవిరాజితుడుఁ సతత,యుక్తాసుఖసాధనుండు దుర్యోధనుండు.3
Unknown
మహాప్రస్థానీక పర్వము-ఏకాశ్వాసము-1
పాండవులు మహాప్రస్థానీక గతు లగుట
సీ.
అర్జునుం డమ్మెయి నచ్యుతరామాదియాదవజనులవృత్తాంతములును
దనదు తెఱంగు సత్యవతీతనూభవుహితభాషణంబులు నేర్పడంగఁ
జెప్పిన విని యుధిష్టరుండు ప్రస్థానంబునకు మది యొలయ నన్నరునితోడ
నఖిలభూతంబుల ననఘ పాకంబుఁ బొందించుఁ గాలుండు మదీయబుద్ధి
తే.
కర్మ సంత్యాగకలనంబు కార్య మిప్పు
డనువినిశ్చయ మొందె నీమనము నరయ
నిదియ మేలుగఁ గనుచున్కి విదితమయ్యె
నాకు ననవుడు నయ్యింద్ర నందనుండు.4
Unknown
మౌసల పర్వము-ఏకాశ్వాసము-1
ధర్మజు రాజ్యంబున నుత్పాతంబులు తోఁచుట

సీ.
భారతసంగ్రామపారీణుఁడై జయరమ యుల్లసిల్ల సామ్రాజ్యమునకుఁ బాండవముఖ్యునిఁ బట్టంబు కట్టినయది ,యాది కాఁగ ముప్పదియు నైదు సంవత్సరంబులు చన ననంతరవత్సరంబునఁ బ్రజకు భయం బొనర్చు నుత్పాతములు పుట్టె నుర్వీశ విను మహావాయువు శర్కరావర్షి యగుచు
ఆ.
వీచు నర్కు నుదయవేళల బింబంబు, బలసి తోఁచు ఘనకబంధసమితి నీరదములు లేక నిర్ఘాతపాతముల్, కలుగు నుల్క లెల్లకడల డుల్లు.3

భారతసంగ్రామానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడైన ముప్పది ఐదు సంనత్సరములు చనిన పిమ్మట తరువాతి సంవత్సరంలో ప్రజలకు భయం కలిగించే అనేక ఉత్పాతములు పుట్టినవి. గులకరాళ్ళవర్షం, సూర్యుని ఉదయాస్తమయ సమయాల్లో బింబము మరీ పెద్దదిగాను, మబ్బునీరు మొత్తము మేఘములు లేకుండగనే పెద్ద వర్షంగా ఆపులేకుండా కురియటం, ఉల్కాపాతములు మొదలగునవి కలిగేవి.
సీ.
యిట్లనుదినమును నెన్నియేనియును మహోత్పాతములు పుట్టుచుండఁ గొంత కాలంబు పోవఁగఁ గౌంతేయముఖ్యుండు వినియె నొండొరులతోఁ బెనఁగి సర్వ యాదవులును దెగి రంభుజనాభుండు హలధరుండు దక్క నని నరేంద్ర విని భీమసేనుని వివ్వచ్చు నకులుని సహదేవు రావించి సంభృతార్తి
తే.
యగుచు నవ్వార్త యెఱింగించె నందఱకును, వారలేవురు నెవ్వగల్ కూరుమాన
సములు కలఁగ నత్యంతవిషణ్ణు లైరి, సకలజనకోటులును శోకజలధి మునుఁగ.
5
Unknown
ఆశ్రమవాస పర్వము-ప్రథమాశ్వాసము-1
సుమారు ౧౫ సంవత్సరములు గడచిన పిమ్మట ఒకనాడు--
ధృతరాష్ట్రుఁడు ధర్మజునితోఁ దన మనోరథంబు తెలుపుట
సీ.
ఏ కార్య మైనను నెవ్వఁడేనియుఁ జేయఁ దొడఁగునప్పుడు విను పుడమి ఱేని
చే ననుజ్ఞాతుఁడై కాని తొడంగఁ గా దట్లు కావున వార్ధకాభిలీఢ
మైన మదీయకాయమునకు సంస్కార మాచరింపఁగఁ దపమాచరించు
పనికి భూపాల నీయనుమతి పడయంగ వలసి చెప్పెద రాజవంశజునకు
ఆ.
సమరమరణ మొండె విమలతపమునకుఁ, జొచ్చి యందు నిలిచి చచ్చు టొండె
వలయు నస్మదీయకులముఖ్యు లిట్టుల, నడపి రనుపు నన్ను నడవి కనఘ.27

ఎవరైనా ఏపనైనా చేయాలనుకున్నపుడు రాజానుమతితో కాని ఇంకో విధంగా చేయకూడదు.
కాన ముసలితనముచే పూర్తిగా తినబడిన నా శరీరాన్ని సంస్కారించుకొనే నిమిత్తం తపస్సు
చేసుకోవడానికి నీ అనుజ్ఞ కావలసి చెపుతున్నాను విను. రాజవంశంలో పుట్టినవానికి
యుద్ధంలో గాని, తపస్సు ద్వారా కాని చావాల్సి వుంది. నా కులం లోని
కులముఖ్యులందరూ ఇలానే చేసారు. అందుచేత నన్ను అడవికి పంపించు.
క.
రాజు గురుఁ డెల్లవారికి, రాజోత్తమ గురునియాజ్ఞ రంజిల్లఁగఁ బే
రోజం జేసినకృత్యము, సూ జగములు రెంటియందు శోభన మిచ్చున్.28

రాజు ఎల్లవారికి గురుడు.రాజోత్తమా గురునియాజ్ఞ రంజిల్లునట్లుగా పేరోజం(?)
చేసిన కార్యమే రెండు లోకాల్లోనూ శోభను కూర్చుతుంది.
అనగా ధర్మరాజు మొదట్లో ఒప్పుకోడు. ధృతరాష్ట్రుడు తాము తపస్సుకు వెళ్ళటానికి
ఒప్పుకోకపోతే అన్నం తిననంటాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చి
ధృతరాష్ట్రాదులకు అనుమతిని ఇమ్మని ధర్మరాజుకు సూచిస్తాడు.
దానికి ధర్మరాజు ఒప్పుకోవటం జరుగుతుంది.
Unknown
అశ్వమేధ పర్వము-ప్రథమాశ్వాసము-1
శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకు మనస్తాపోపశమంబు చేయుట.
సీ.
శారీరమును మానసంబును నా రెండు తెఱఁగు లై వ్యాధి వర్తించు నందు
విను వాతమునుఁ బిత్తమును శ్లేష్మమును సమత్వంబుఁ బొందినయప్డు స్వస్థుఁడగున
రుం డవి మూఁడు నొక్కండయి వికృతి నొందిన శరీరవ్యాధి యనఁగఁ బరఁగు
సత్వరజస్తమస్సమత సుస్థ్సితి విషమత మనోవ్యాధి యీద్వితయమునకు
ఆ.
నొంటి దోఁచు టెపుడు నొదవ దన్యోన్యసం, జనకజన్యభావ తనుతఁ జేసి
వికృతికాల మొకట నొకటి తోఁచునది వా, తాదులందు గుణములందు నధిప.113

శారీరకము, మానసికము అని వ్యాధులు రెండు విధములు. వాత, పిత్త, శ్లేష్మాలు
సమత్వం పొందితే మనిషి ఆరోగ్యంగా వుంటాడు. ఆ మూటిలో ఏ ఒక్కటి వికృతి పొందినా
మనిషి శారీరక రోగాన్ని పొందుతాడు. మనిషిలోని సత్త్వ, రజ, తమో గుణముల సమత్వం
మానసిక సుస్థ్సితి, వానిలో ఏ ఒక్కటి విషమత చెందినా కలిగేది మనోవ్యాధి.
యీ రెంటిలో ఒక్కటే తోచటం ఎపుడూ జరగదు.ఆ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి
వుంటాయి.వాతాదులలోన, గుణములలోన వికృతికాలములో ఒకటి ఒకటి కనిపిస్తాయి.

కృష్ణుఁడు ధర్మరాజుతో అప్పుడు జరిగిన యుద్ధము మిథ్యాయుద్ధమని, సత్యయుద్ధం అంటే ఏమిటో చెపుతానని ఇలా అంటాడు.
ఉ.
అమ్మెయి బంధుమిత్రులసహాయతకల్మి ప్రయోజనంబు లే
దమ్మహనీయయుద్ధమున కాత్మయ తోడు మనంబు శత్రుఁ డీ
వెమ్మెయి నైన శాంతి ఘటియింపుము లోపగఁ దీర్పు మందు శాం
తమ్మ చుమీ మనోవిజయితన్ వెలుఁగొందుము శాంతబుద్ధివై.118

ఆ యుద్ధంలో బంధుమిత్రుల సహాయసంపద ఉండదు. ఆగొప్ప యుద్ధానికి ఆత్మయే తోడు. మనస్సే శత్రుడు. నీవేవిధంగా నైనా శాంతిని పొందు.లోననున్న పగను మాన్చుము. శాంతమే మనోవిజయమును కూరుస్తుంది.శాంతబుద్ధివై వెలుగొందు.
తే.
అంతరం బగునిక్కయ్య మధిప గెలువ, కిట్ల యేగతిఁ బోయెదో యెఱుఁగ దీని
నీవ కనుఁగొని సద్బుద్ధినిశ్చయప్ర,వీణుడవు కమ్ము మాటలు వేయు నేల.

అంతరంగంలో జరిగే ఈ యుద్ధం గెలవకుండా ఇటుల యేగతి పొందుతావో ఎఱుగను. దీనిని నీవే కనుక్కో. సద్బుద్ధి నిశ్చయప్రవీణుడవు కమ్ము. ఇంక మాటలు వేయయినా ఏమి ప్రయోజనము?
వ.
అని చెప్పి కౌంతేయాగ్రజునితోఁ గృష్ణుండు వెండియు నిట్లను. రెండక్షరంబులు మృత్యువు, మూఁడక్షరంబులు బ్రహ్మంబవి యెయ్యవి యంటేని వినుము మమ యనునవియును నమమ యనునవియును నై యుండు భూతంబులచేతం గానంబడక యా బ్రహ్మమృత్యువులు పోరుచుండు.120
క.
వెలిపగఱ గెలుపు గెలుపే, యలఘుమతిన్ గెలువవలయు నభ్యంతరశ
త్రులఁ దద్విజయము మోక్షము, నలవఱుపం జాలు నొంట నమ్మేలగునే.124

బయటి శత్రుల గెలుపు గెలుపు కాదు అంతశ్శత్రులను గెలవటం ద్వారానే మోక్షము కలుగుతుంది.
క.
విను మంతశ్శత్రులలో, ఘనుఁ డగుఁ గాముఁడు నిరస్తకామం బగువ
ర్తనము విశద మద్యయనయ,జనదానంబులును గామసహితములు కదా.125

విను. అంతశ్శత్రులలో కాముడు ఘనమైనవాఁడు. నిరస్తకామమగు వర్తనము విశదము.అధ్యయనము, యజనము, దానములు కూడా కామసహితములే కదా.
క.
విను పెక్కు లేల కోరిక, మనమునఁ జొరనీక యున్న మడియుం గాముం
డనవధ్య యశ్వమేధం, బొనరింపుము కోరకుండు మొక్కటియు మదిన్.133

కోరికను మనస్సులో చొరనీక పోతే కామం చస్తుంది. ఏ కోరికా మనస్సులో వుంచుకోకుండా కామ్యరహితంగా అశ్వమేధ యాగం చెయ్యి.అని చెప్తాడు ధర్మరాజుతో కృష్ణుడు.
Unknown
అనుశాసనిక పర్వము-ప్రథమాశ్వాసము-1
ధర్మరాజు భీష్మపితామహుడు వివరంగా చెప్పిన వివిధ ధర్మంబులు వినిన తరువాత భీష్మునితో నిట్లనియె.
సీ.
అనఘ నాదగు చిత్తమునకు శమంబు కావించుట కై నీవు వివిధవిశద
భంగులఁ బరమకృపానిరతుండ వై సకలధర్మోపదేశములుఁ జేసి
తిమ్మెయిఁ జెప్పఁగానించుకయేనియు శమము లేకున్నది చలముకొని య
నేకబంధుల వధియించితి నది యొక్క తలయు నీకలిగిన దారుణత్వ
ఆ.
మొక్కతలయు నైన యుగ్రకర్మంబులు, చిత్తవృత్తిఁ దగిలి యుత్తలంబుఁ
జేయ శాంతి యెట్లు సిద్ధించు మునిమాన,నీయ యింక నేమి చేయువాఁడ.3

పుణ్యాత్ముడా! నా మనసుకు శాంతి చేకూర్చుటకై నీవు వివిధ ధర్మోపదేశములు కడుంగడు విశదమగునట్లుగా పరమకృపారతుడవై తెలియ చెప్పావు. కాని దానిమూలంగా కొంచెం కూడా నాకు శమము లేకుండా వున్నది. మాత్సర్యాన్ని పూని అనేకమంది బంధువులను చంపాను. అది అంతా ఒకవైపు, ఇంకో వైపు నీకు చేసిన దారుణమైన ఉగ్రకర్మలు నా మనసును పిండివేస్తుండగా నాకు శాంతి యెలా కలుగుతుంది. ఈ పరిస్థితిలో నేను ఇప్పుడు ఏం చేయాలి ?
ఇలా పలికిన ధర్మరాజుతో భీష్ముడు 'వధించటానికి మనుజుడు కర్త' గాదని దానికుదాహరణంగా గౌతమీలుబ్ధకసర్పమృత్యుకాలసంవాదాన్ని అతనికి వివరిస్తాడు.
గౌతమి అనే బ్రహ్మణ స్త్రీ కొడుకు పాము కరచి చనిపోతే ఆవిడ దుఃఖిస్తుండగా చూచి ఓ కిరాతుడు ఆ పాముని తాడుతో కట్టి తెచ్చి ఆమెకు చూపించి ఆ పామును చంపబోతాడు. అప్పుడామె అతనిని వారిస్తూ ఇలా అంటుంది.
క.
విధివశమున వచ్చినకీ,డధములు కొనియాడి వెడఁగులై విపులభవాం
బుధి మునుగుదురు మునుంగరు, సధర్ములగు నుత్తములు ప్ర శాంతిం జులకన్.9

విధివశాన్ని వచ్చిన కీడును అధములైనవారు పెద్దగా జేసి వెడగులై విపులభవాంబుధిలో మునుగుతారు. కాని సధర్ములైన ఉత్తములు ప్రశాంతి నొందినవారై అలా మునగరు.
అదీకాక ఈ పాముని చంపినా నాకొడుకు తిరిగిబ్రతకడు గదా.అని నచ్చచెప్పినా వివశుడైన కిరాతుడు వినక ఇంకా పామును విడవనని అంటాడు.అప్పుడామె నీ అర్జునక నామము నీకున్న స్వచ్ఛమగు విధమునకు తగివుండాలి, బ్రహ్మణ స్త్రీనైన నేను వద్దని చెప్తున్నపుడు బ్రాహ్మణ సహాయుడవైన నీవు దానికి వ్యతిరిక్తంగా నడవకూడదు కదా. నా సన్నిధిలో నీకీ క్రూరత వలదు.అంటే జనబాధకములైన జంతువులను చంపొచ్చు పాపం రాదు అంటాడు. అయినా ఆమె ఒప్పుకోదు.అప్పుడు పాము నాతప్పేమీలేదు, నీవు ధర్మాన్ని తెలియవు, మృత్యుపరాధీనతను బాలుడిని కాటు వేసాను కాని నాకు మనసులో రోషకామాలు లేవు అంటుంది. నీవు మృత్యువునకు సాధనమవు కాన నిన్ను చంపవచ్చుఅనగా మృత్యువు కూడా అక్కడికి వచ్చి పాముతో-- నేను నిన్ను పంపిన విధంగా యమధర్మరాజు నన్ను పంపాడు అండుచేత నా తప్పూ నీ తప్పూ కూడా లేదంటుంది.అప్పుడక్కడికి కాలుడు వచ్చి నేను,మృత్యువు,పాము కూడా కారణం కాము. ఈతడు చేసిన కర్మఫలమే దీనికి కారణం అంటాడు.
క.
విను కర్మం బొనరించును, జననము మరణంబు నదియ సౌఖ్యము దుఃఖం
బును గావించుం దనచే,సినదానింబడక పోవ శివునకు వశమే.34
కర్మ వలసనే చావు పుట్టుకలు, సుఖదుఃఖాలు అన్నీ కలుగుతాయి. దానిని దాటటం శివునికి కూడా వశము కాదు.
అందుచేత ఈ జరిగిన యుద్ధానికీ, చావులకు నీవు గాని దుర్యోధనుడు గాని కారణం కారు . దీనికి విచారించాల్సిన పని లేదు.అంటాడు ధర్మరాజుతో భీష్ముడు.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్సాసము-1
మంగళ శ్లోకము
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రి పురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీ కన్ధరా శ్శ్రేయసే. 1

లక్ష్మీ సరస్వతీ పార్వతులను హృదయ ముఖ శరీరములందు స్థిరముగ ధరించి, స్త్రీ పురుష యోగమున జనించిన లోకముల నిల్పుచు, వేదత్రయాత్మకులు త్రిమూర్తులును, దేవతలచేఁ బూజింపబడు విష్ణుబ్రహ్మేశానులు శ్శేయస్సు కొఱ కగుదురు గాక.
ఉ.
రాజకులైక భూషణుఁణు రాజమనోహరుఁ డన్యరాజ తే
జోజయశాలిశౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రి కా
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమపేంద్రుఁ డున్నతిన్,3

రాజకులమునకు అలంకారమైనవాఁడు, రాజులలో మనోహరమైనవాఁడు, ఇతర రాజుల తేజస్సనేకాంతిని జయించిన వీరుడు, విశుద్ధమైన శరత్కాల చంద్రుని వెన్నెలవలె ప్రకాశించు సర్వలోకుడైనవాడు, గెలువఁబడనిగొప్ప భుజమందలి ఖడ్గధారయనెడి జలములచే శాంతమైన శత్రువు లనెడి దుమ్ముగలవాఁడు, అయిన రాజమహేంద్రపు రాజు ఉన్నతితో,
క.
విమలాదిత్యతనూజుఁడు, విమలవిచారుఁడు గుమారవిద్యాధరుఁ డు
త్తమచాళుక్యుఁడు వివిధా, గమవిహితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.4

విమలాదిత్యుని కుమారుడు, శుభ్రమైన ఆలోచన కలవాడు, కుమారుఁడైన విద్యాధరుఁడు, ఉత్తమ చాళుక్యుడు, వివిధములైన ఆగమశాస్త్రములలో బాగుగా పరిశ్రమ చేసినవాఁడు, కాంతిలో చంద్రుని వంటివాఁడు రాజరాజ నరేంద్రుడు.

సీ.
తనకులబ్రాహ్మణు ననురక్తు నవిరళజపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాదినానాపురాణవిజ్ఞాననిరతుఁ
బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్రజాతు సద్వినుతావదాత చరితు
లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు
ఆ.
నిత్యసత్యవ చను మత్యమరాధిపా, చార్యు సుజను నన్నపార్యుఁ జూచి
పరమధర్మ విదుఁడు వరచాళుక్యాన్వయా, భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ.9

తన పురోహితుడు, ఇష్టుడు, జపహోమముల యందధికమైన తత్పరత గలవాఁడు, విపులమైన శబ్దములను శాసించగలవాఁడు, శాస్త్రములఁ జదివిన వాడు, బ్రహ్మాండాది నానా పురాణవిజ్ఞానములో ప్రసిద్ధుడైనవాఁడు, పాత్రుడు, ఆపస్తంబసూత్రుడు, ముద్గలగోత్రములో పుట్టినవాఁడు, మంచి ప్రసిద్ధిచెందిన తెల్లని చరితముకలవాఁడు, లోకజ్ఞుడు, ఉభయభాషాకావ్యముల రచనలలో శోభిల్లువాఁడు, మంచి ప్రతిభతో మిక్కిలి వెలయువాఁడు,

నిత్యము సత్యవచనమునే పలుకువాఁడు, బుద్ధియందు బృహస్పతిని బోలువాఁడు, సుజనుడు ఐన నన్నపార్యుని చూచి పరమ ధర్మ విదుఁడు, ప్రసిద్ధినొందిన చాళుక్యవంశమునకు ఆభరణమువంటివాడైన రాజరాజనరేంద్రుడు ఈవిధంగా అన్నాడు.
మ.
ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లైయుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియుఁ బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్ .12

ఈ ఐదు నాకు చాలా ఇష్టమైనవి. బ్రహ్మణుల సేవ, భారతమును వినుటయందాసక్తి, శంకరుని ధ్యానముసేయుట, సంతతము దానములు చేయుట, సాధుజనులతో సాంగత్యము-అనేవి. ఇవి నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉంటాయి.
గరికిపాటి నరసింహారావు గారు వారి శ్రీమదాంధ్రమహాభారత సామాజిక వ్యాఖ్యలో ఈ పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ
ఇక్కడ చెప్పిన ఐదు గుణాలు ఐదుగురు పాండవులను సూచిస్తున్నాయంటున్నారు. నిజమే ననిపిస్తుంది.
భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్=ధర్మరాజు
భారతశ్రవణాసక్తియుఁ=నకులుడు
సంతతదానశీలత=భీముడు
బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహోత్సవమున్=అర్జునుడు
శశ్వత్సాధుసాంగత్యమున్=సహదేవుడు



Unknown
అరణ్య పర్వముప్రథమాశ్వాసము-1
క.
తిలలును నీళ్ళును వస్త్రం, బులుఁ బుష్పసుగంధవాసమున సౌరభముం
బొలు పెసఁగ దాల్చుఁ గావున, నలయక సత్సంగమమున నగు సద్గుణముల్.6
పాండవులు నిజాయుధములు ధరించి ద్రౌపదీ సహితముగ అరణ్యవాసమునకు బయలు దేరినప్పుడు పౌరులెల్లరు దుఃఖితులై ఇలా అంటున్నారు. నువ్వులు, నీళ్ళు, వస్త్రములు పుష్పముల సుగంధం చేత సౌరభాన్ని తాల్చుతాయి.అలానే సత్సంగము వలన అలుపు లేకయె సద్గుణములు కలుగుతాయి.

శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట

క.
శోకభయస్థానంబు ల, నేకంబులు గలిగినను విహీనవివేకుం
డాకులతఁ బొందునట్లు వి, వేకముగలవాఁడు బుద్ధివికలుండగునే.20

శోకము, భయము కలుగు స్థానంబులు అనేకమున్నా వివేకం లేనివాఁడు వ్యాకులత్వము నొందినట్లుగా వివేకము కలవాఁడు వ్యాకులత్వము నొందునే.
Unknown
సభాపర్వము-ప్రథమాశ్వాసము-1
మయుడు మయసభను నిర్మించి పాండవులకిచ్చి వెళ్ళిన తరువాత చాలా మంది మునీశ్వరులు ధర్మరాజును చూడటానికి వస్తారు.
సీ.
సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్యగోపతి గోపవేష మైత్రేయ పవిత్ర పాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞ్యవల్క్య
ఆ.
వాయుభక్ష భార్గవవ్యాస జైమిని, శుక సుమంతు పైల సువ్ర తాదు
లయిన మునులు నేము నరిగితి మెంతయు, రమ్య మయిన ధర్మరాజుసభకు.21

నారదుఁడు పాండవులయొద్దకు వచ్చుట
ఉ.
నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడునొక్కొ యంచు వి
స్మేరమనస్కు లై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి సురేంద్ర మందిర
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్.23

ప్రజలంతా నీరజమిత్రుడు భూమి మీదకు ఎందుకు వచ్చాడో అని ఆశ్చర్యమనస్కులై ఆతని ప్రకాశాన్ని మెచ్చుకొని చూస్తుండగా ఆకాశ మార్గము నుండి నారదుడు ఇంద్రునిమందిరాన్నే తన విలాసముతో అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్న అర్జునుని ఇంటికి ప్రేమతో వచ్చాడు.

పర్వత పారిజాత రైవత సుముఖు లను మహా మునులతో కలసి వచ్చాడట నారదుఁడు.25